AP: జగన్ సెక్యూరిటీపై టీడీపీ నేతల ఆరోపణలు.. మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్
జగన్‌కు సెక్యూరిటీగా 986 మంది ఉన్నారంటూ టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: జగన్‌కు సెక్యూరిటీగా 986 మంది ఉన్నారంటూ టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఇవాళ తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014-2019లో టీడీపీ అధికారంలో ఉన్న నాడు సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్‌కు 4 ప్లస్ 4 గన్‌మెన్‌లు ఇచ్చారంటూ కామెంట్ చేశారు. కొందరు పనిగట్టుకుని జగన్ భద్రతపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్‌కు సెక్యూరిటీగా ఉన్నది 196 మంది మాత్రమేనని అన్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో అక్రమణలు జరిగితే ఆ విషయంలో జగన్‌కు ఉన్న సంబంధం ఏంటో చెప్పాలన్నారు. సీఎంగా జగన్ ఉన్నప్పడు తాత్కాలిక పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేశారని, ఇప్పుడు దానిని తొలగించడం ఆక్రమణ కిందకు వస్తుందా అని టీడీపీ నాయకులను పేర్ని నాని ప్రశ్నించారు. తాము అనుకున్నట్లు తమ నుంచి టీడీపీ కూటమి అధికారాన్ని కైవసం చేసుకున్న జగన్‌పై విష ప్రచారాన్ని మాత్రం ఆపడం లేదని పేర్ని నాని ధ్వజమెత్తారు.