ఏపీకి గుడ్ న్యూస్.. టాప్-10 ఐటీ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు
రాష్ట్రంలో మెరుగైన ఐటీ పాలసీని తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది...
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మెరుగైన ఐటీ పాలసీని తీసుకువస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖలో ఏపీ ఐటీ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ నిరుద్యోగులపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, ప్రతి ఏడాది 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశంలో టాప్ -10 ఐటీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, త్వరలో శుభవార్త వింటారని లోకేశ్ తెలిపారు. ఐఎస్‌బి తరహాలో విశాఖలో ప్రపంచస్థాయి ఎఐ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎఐ హబ్‌గా కూడా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. రోబోటిక్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి రంగాలతో అనుసంధానించి రాష్ట్రంలో ఐటీని వేగవంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో విశాఖపట్నాన్ని 100 బిలియన్ డాలర్ల ఎకానమీ నగరంగా తీర్చిదిద్దుతామని నారా లోకేశ్ పేర్కొన్నారు.