'వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులతోనే జాకీ వెనక్కి'

వైసీపీ నేతలు పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తుంటే పరిశ్రమలు ఎలా వస్తాయని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ ప్రశ్నించారు. జాకీ కంపెనీ తరలివెళ్లిపోవడానికి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డియే కారణమని ఆరోపించారు...

Update: 2022-11-22 16:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ నేతలు పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తుంటే పరిశ్రమలు ఎలా వస్తాయని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ ప్రశ్నించారు. జాకీ కంపెనీ తరలివెళ్లిపోవడానికి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డియే కారణమని ఆరోపించారు. ఎన్నికల్లో తమకు ఖర్చయిన డబ్బులు ఇవ్వాలంటూ జాకీ కంపెనీ ప్రతినిధులను బెదిరించారని ఆయన ఆరోపించారు. ఆ బెదిరింపులను తట్టుకోలేక జాకీ కంపెనీ ప్రతినిధులు వేరే ప్రాంతానికి కంపెనీని తరలించేశారని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆధ్వర్యంలో రాప్తాడు సమీపంలోని జాకీ పరిశ్రమ స్థలం వద్ద పార్టీ శ్రేణులు మంగళవారం నిరసన చేపట్టారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలను బెదిరిస్తుంటే పరిశ్రమలు ఎలా వస్తాయని.. ఇలాంటి చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే బెదిరింపుల వల్ల ఒక కంపెనీ తరలిపోవడమే కాకుండా వేలాది మంది ఉపాధి కోల్పోయారని అన్నారు. జాకీ పరిశ్రమ తిరిగి రాప్తాడు తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ హెచ్చరించారు.

Tags:    

Similar News