న్యాయవాదిపై దాడి అంటే న్యాయంపై దాడి జరిగినట్టే : న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు

నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో దళిత న్యాయవాద మంద విజయ్ కుమార్ పై జరిగిన దాడిని టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఖండించారు.

Update: 2023-11-14 07:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో దళిత న్యాయవాద మంద విజయ్ కుమార్ పై జరిగిన దాడిని టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఖండించారు. ఈ దాడి న్యాయంపై జరిగిన దాడిగా జ్యుడీషియల్ వ్యవస్థ భావిస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు, న్యాయమూర్తులు ఈ దాడిని తీవ్రంగా పరిగణించాలి అని సూచించారు. వైఎస్ జగన్ నిరంకుశ విధానాలు తన పార్టీ కార్యకర్తలను కూడా అదే బాటలో నడిపిస్తున్నాయనడానికి విజయ్ కుమార్ పై దాడి నిలువుటద్దంలా నిలుస్తుంది అని ఆరోపించారు. వైసీపీ కి చెందిన కబ్జాదారులు, గూండాలు, రౌడీలు తమ నిరంకుశ విధానాలను నిలదీసిన వారిపై, అడ్డుకున్నవారిపై దాడులకు తెగబడుతున్నారు అని ధ్వజమెత్తారు. ఇవి జగన్మోహన్ రెడ్డి కొంత మంది ప్రభుత్వ పెద్దల వెనకుండి, ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు అని టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఆరోపించారు.

జగన్ పాదసేవలో సీఐడీ 

వైఎస్ జగన్ పాలనలో పేదల భూములకు రక్షణ లేకుండా పోయింది అని టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఆరోపించారు. పేదవాళ్ల భూములు కబ్జాకు గురైతే..ఆ కబ్జాదారులపై న్యాయపరమైన పోరాటం చేస్తున్న దళిత న్యాయవాది, అడ్డువెళ్లిన తన తల్లిపైనా వైసీపీ సైకోలు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. నిందితులే ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయడం పోలీసు వ్యవస్థకు మాయని మచ్చ, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయనడానికి నిదర్శనం అని మండిపడ్డారు. గతంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన హైకోర్టు జడ్జిలను సైతం వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ కార్యకర్తలు తీవ్రమైన పరుష పదజాలంతో కించపరిచేలా పోస్టులు పెట్టారు అని మండిపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ కేసు దర్యాప్తును అంగుళం కూడా ముందుకు తీసుకెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి పాదసేవలో తరిస్తూ స్వామిభక్తిని చాటుతోంది అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ దుర్మార్గాలు, వైసీపీ సైకోల ఆగడాలను నిలదీసిన వారిపై మాత్రం సీఐడీ విరుచుకుపడుతోందన్నారు. న్యాయవ్యవస్థపై దాడులు చేస్తున్న ఈ దుర్మార్గపు ప్రభుత్వం దళిత, న్యాయవ్యవస్థ చేతిలో మట్టికరవక తప్పదు అని హెచ్చరించారు. ప్రజాస్వామ్యవాదులంతా దళిత న్యాయవాది విజయ్ కుమార్, తన తల్లిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాలని, యావత్ న్యాయవ్యవస్థ విజయ్ కుమార్‌కు న్యాయం జరిగే వరకు అండగా నిలవాలని టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లు కోరారు. 

Tags:    

Similar News