ఆరు దశాబ్ధాల కల సాకారం.. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

6 దశాబ్దాల సమస్య తొలగిపోయే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

Update: 2023-08-08 15:16 GMT

దిశ, నందికొట్కూరు అర్బన్ : 6 దశాబ్దాల సమస్య తొలగిపోయే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో ఇసుక వాగుపై రూ.5 కోట్లతో వంతెన నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. చిన్నపాటి వర్షానికి చుట్టుపక్కల 10 గ్రామాలు స్తంభించిపోయే సమస్యకు పరిష్కారంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతుల మీదుగా హైలెవల్ వంతెనకు శంకుస్థాపన జరిగింది. ఎండీఆర్ ప్లాన్ నిధుల ద్వారా కె.జి రోడ్డు నుండి పారుమంచాల రహదారి నందు ఈ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను పారుమంచాల గ్రామవాసి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం.. వెంటనే స్పందించడం.. ఇసుక వాగు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.

ఇప్పటికే మంజూరైన నిధులకు టెండర్లు ముగియడంతో మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. 60 ఏళ్ల క్రితం నుంచి వాగుపై వంతెన లేక వర్షాకాలంలో పడే తమ కష్టాలను గుర్తించి వంతెనకు మోక్షం కలిగించడం పట్ల పారుమంచాల, తూడిచెర్ల, వాడాల, మద్దూరు, రేగడగూడూరు, వేల్పనూరు, వెలుగోడు గ్రామాల ప్రజలు, ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News