అధికారమంటే అజమాయిషి కాదు ప్రజల పట్ల మమకారం చూడటం
అధికారమంటే అజమాయిషి చేయడం కాదు. ప్రజల పట్ల మమకారం చూపడం.
దిశ, డైనమిక్ బ్యూరో : ‘అధికారమంటే అజమాయిషి చేయడం కాదు. ప్రజల పట్ల మమకారం చూపడం. ఇంటింటా ప్రతి ఒక్కరికీ మంచి చేస్తున్న ప్రభుత్వం మనదని, ప్రజలకు మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందుకు వేసే బాధ్యత తీసుకున్నానని వారికి భరోసా కల్పించడం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన పలు సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధిపొందని వారి అకౌంట్లలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి డబ్బులు జమ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలో అన్ని అర్హతలు కలిగి ఉండి వివిధ కారణాల వల్ల పథకాలు అందక మిగిలిపోయిన వారికి మరోసారి అవకాశం కల్పిస్తూ.. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందజేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందాలన్న కృత నిశ్చయంతో ఏ కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు కూడా లబ్ధి చేకూరుస్తున్నామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని 2,62,169 మంది అర్హులకు రూ.216.34 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖతాల్లోకి బటన్ నొక్కి సీఎం జగన్ నిధులు జమ చేశారు.
ప్రతీ ఇంటికి మంచి జరగాలన్నదే లక్ష్యం
ఇంటింటా మనిషి మనిషికి కూడా మంచి చేస్తున్న ప్రభుత్వం, మంచి జరగాలని తాపత్రయపడుతున్న ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఎక్కడా కూడా లంచాలకు తావులేకుండా, వివక్షకు చోటివ్వకుండా, ఎటువంటి కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా చివరకి ఏ రాజకీయ పార్టీ అన్నది కూడా ప్రస్తావన చూడకుండా, మనకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు..అర్హత ఉంటే సంక్షేమ పథకాలు అందించాలని, ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుడదనే అని తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్న పాలనే ఈ నవరత్నాల పాలన అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఏపథకంలోనైనా అర్హత ఉండి ఏ కారణంతోనైనా అందాల్సిన సాయం అందకపోయిన పరిస్థితి ఎవరికైనా అందకపోతే అలాంటి వారికి న్యాయం చేసేందుకు మంచి చేసేందుకు మరొక్కసారి వారికి అవకాశం ఇచ్చి, పథకాలు అందిస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఏ కారణం చేతనైనా రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోండి, వెరిఫికేషన్ చేయించి మీకు ప్రభుత్వం మంచి చేస్తుంది. ఈ రోజు మిగిలిపోయిన లబ్ధిదారులకు మంచి చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. అధికారం అంటే అజమాయిషి చేయడం కాదు..అధికారం అంటే ప్రజల పట్ల మమకారం చూపడం. అధికారం అంటే ప్రజలకు మంచి చేయడం కోసం నాలుగు అడుగులు ముందుకు వేసే బాధ్యత అని రుజువు చేస్తూ..ఆబాధ్యతను ఈ రోజు తలుచుకుంటూ..గతంలో వివిధ కారణాలతో అందుకోలేకపోయిన వారికి ఈ రోజు 2.62 లక్షల మంది అర్హులకు గత అరు నెలలుగా జరిగిన వివిధ పథకాలు, కార్యక్రమాల్లో మిగిలిపోయిన వారికి మరొక్కసారి అవకాశం కల్పిస్తున్నాం. నేడు రూ.216.34 కోట్లు నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
64 లక్షలకు చేరిన పింఛన్ లబ్ధిదారుల సంఖ్య
ఈ ఆరు నెలల కాలంలో కూడా కొత్తగా పెన్షన్ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకుంటే వెరిఫికేషన్ చేయించి ఇవ్వడమే కాక కొత్తగా 1,49,875 మందికి పింఛన్లు కూడా మంజూరు చేస్తున్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. సెప్టెంబర్ నుంచి వీరందరికీ పింఛన్ సొమ్ము అందుతుందని చెప్పుకొచ్చారు. 2 లక్షల 312 మందికి కొత్తగా బియ్యం కార్డులు కూడా మంజూరు చేస్తున్నామని వీరికి కూడా సెప్టెంబర్ నుంచి బియ్యం పంపిణీ చేస్తారు అని తెలిపారు. అలాగే 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు కొత్తగా మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 12029 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. కొత్తగా పెన్షన్లు కలిపితే మొత్తంగా 64.27 లక్షల మందికి చేరుకుంది అని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. గతంలో అంటే ఎన్నికలకు ఆరు నెలలకు ముందు 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చేవారని అయితే అది ఈ రోజు 64 లక్షలకు చేరింది అని తెలిపారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కేవలం రూ.1000 పింఛన్ మాత్రమే ఇచ్చేవారని కానీ నేడు రూ.2,750 ఇస్తున్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు.
జగనన్న సురక్ష విజయవంతం
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 15004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, స్థానిక నాయకులు వెళ్లి జల్లెడ పట్టి ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదని జగనన్న సురక్ష ద్వారా 94,62,184 మందికి వివిధ రకాల సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు అందులో 12408 మందికి అర్హులైన కూడా ఆయా పథకాలు అందని వారిని గుర్తించి వారితో కూడా దరఖాస్తు చేయించి సంక్షేమ పథకాలు అందించాం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ద్వారా కాల్ చేసిన వారి దరఖాస్తులు కూడా వెరిఫై చేశామని స్పష్టం చేశారు. అందులో కూడా 1630 మందిని గుర్తించి ఈ పథకంలో మంచి చేస్తున్నాం. వీరిందరికీ కూడా మళ్లీ అవకాశం ఇచ్చి జల్లెడ పట్టి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదనే తపన, తాపత్రయంతో మంచి చేశాం అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.