క్రిప్టోకరెన్సీ కథాకమామీషు!
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికీ చాలా మందికి బిట్‌కాయిన్ గురించి తెలియదు. కానీ, గత కొన్ని నెలలుగా పెరిగిపోతున్న బిట్‌కాయిన్ విలువ గురించి వార్తలు చదివి, మళ్లీ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లక్షలు, కోట్లు అంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు చెప్పండి. ఇప్పుడు బిట్‌కాయిన్ విలువ దాదాపుగా 30 లక్షల రూపాయలకు చేరుకుంది. నిజానికి ఈ క్రిప్టోకరెన్సీ ప్రారంభమైన కొత్తల్లో దాని విలువ రూ. 12 ఉండేది. ఎక్కడి పన్నెండు రూపాయలు, ఎక్కడి 30 […]
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికీ చాలా మందికి బిట్‌కాయిన్ గురించి తెలియదు. కానీ, గత కొన్ని నెలలుగా పెరిగిపోతున్న బిట్‌కాయిన్ విలువ గురించి వార్తలు చదివి, మళ్లీ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లక్షలు, కోట్లు అంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు చెప్పండి. ఇప్పుడు బిట్‌కాయిన్ విలువ దాదాపుగా 30 లక్షల రూపాయలకు చేరుకుంది. నిజానికి ఈ క్రిప్టోకరెన్సీ ప్రారంభమైన కొత్తల్లో దాని విలువ రూ. 12 ఉండేది. ఎక్కడి పన్నెండు రూపాయలు, ఎక్కడి 30 లక్షలు? అయితే బిట్‌కాయిన్ విలువ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే జనవరి 11న ఏకంగా 26 శాతం దాని విలువ పడిపోయింది మరి. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రిస్క్ తీసుకుని పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మాత్రం క్రిప్టోకరెన్సీ నిజంగా ఒక మంచి ప్లాట్‌ఫామ్. కానీ దానికి ముందు కాస్త రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పటికే ట్రేడింగ్‌లో నిష్ణాతులు అయితే మాత్రం మీకు పెద్దగా జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొత్తది ఏదైనా రాగానే అత్యుత్సాహంతో ముందుకెళ్లి అవగాహన లేకుండా, పక్కవాళ్ల మాటలు విని పెట్టుబడులు పెట్టి తర్వాత చేతులు కాల్చుకునే మహానుభావులు మాత్రం బిట్‌కాయిన్ గురించి, ముఖ్యంగా క్రిప్టోకరెన్సీ గురించి పూర్తిగా నేర్చుకున్న తర్వాతనే అడుగుపెట్టాలి.
క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి?
లావాదేవీలను వెరిఫై చేయడానికి బ్యాంకులు లేని ఒక డిజిటల్ పేమెంట్ వ్యవస్థను క్రిప్టోకరెన్సీ అంటారు. ఎక్కడి నుంచైనా చెల్లింపులను చేయడానికి, అందుకోవడానికి అనుమతినిచ్చే ఒక పీర్ టు పీర్ నెట్‌వర్క్. భౌతికంగా డబ్బును తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లో డిజిటల్ ఎంట్రీల ద్వారా చెల్లింపులు చేయడం అన్నమాట. అయితే ప్రస్తుతం ఫోన్‌పే, గూగుల్‌పే లాంటి యాప్‌ల ద్వారా కూడా అదే కదా చేస్తున్నాం అని అనుకోవద్దు. ఎందుకంటే క్రిప్టోకరెన్సీకి బ్యాంకింగ్ సిస్టమ్ అనేది లేదు. యూపీఐ యాప్‌ల ద్వారా జరిగే లావాదేవీలను రికార్డ్ చేయడానికి బ్యాంక్‌లు ఉన్నాయి. కానీ క్రిప్టో లావాదేవీలకు అలాంటి వ్యవస్థ లేదు. మీ క్రిప్టోకరెన్సీని ఒక డిజిటల్ వాలెట్‌లో దాచుకోవచ్చు. కావాలనుకున్నప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు. ఒక కోడింగ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా ఈ లావాదేవీలు పబ్లిక్ లెడ్జర్‌లో రికార్డవుతాయి కాబట్టి దీనికి క్రిప్టోకరెన్సీ అని పేరు వచ్చింది. ఈ ఎన్‌క్రిప్షన్ ద్వారా క్రిప్టోకరెన్సీ సురక్షితంగా ఉంటుంది.
నిజంగా సురక్షితమేనా?
బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీ రూపొందించబడుతుంది. ఈ టెక్నాలజీలో ప్రతి లావాదేవీ ఒక బ్లాక్ లాగా రికార్డు చేయబడి, దానికి టైమ్ స్టాంపింగ్ వేయబడుతుంది. ఇది కొద్దిగా సంక్లిష్టమైన టెక్నికల్ విధానమే. కానీ ఫైనల్‌గా క్రిప్టోకరెన్సీ లావాదేవీలన్నీ ఒక డిజిటల్ లెడ్జర్‌లో హ్యాకర్లకు అందకుండా రికార్డు చేసేందుకు ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అదనంగా, క్రిప్టో లావాదేవీలన్నింటికీ టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ విధానం ఉంటుంది. అంటే మీరు యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యాక కూడా మీ ఫోన్‌లో ఓటీపీని అందివ్వాల్సి ఉంటుంది. మరి ఇంత సెక్యూరిటీ ఉంది కదా? హ్యాక్ జరగలేదా అంటే… జరిగింది. 2018లో కాయిన్‌చెక్, బిట్‌గ్రెయిల్‌లను హ్యాకర్‌లు కొల్లగొట్టగలిగారు. దీని వల్ల వరుసగా రెండింటికీ 534 మిలియన్‌లు, 195 మిలియన్‌ల డాలర్ల నష్టం వచ్చింది. అయినప్పటికీ భవిష్యత్తులో ఎదిగే డొమైన్ అవడం వల్ల ఎన్నో రకాల క్రిప్టోకరెన్సీలు పుట్టుకొచ్చి, ఇదొక ట్రేడింగ్ వ్యవస్థగా మారిపోయింది.
బిట్‌కాయిన్ మాత్రమే కాదు!
క్రిప్టోకరెన్సీ అనగానే ఒక్క బిట్‌కాయిన్ అని మాత్రమే కాదు. ఈథేరియం, టెథర్, ఎక్స్‌ఆర్‌పీ, పోల్కడాట్, కార్డానో, లైట్‌కాయిన్, చైన్‌లింక్..ఇలా చెప్పుకుంటూ పోతే 2,000 రకాల క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. వీటన్నింటికి వాటి వాటి మైనింగ్ ఆధారంగా ఒక విలువ ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ విపరీతంగా పెరిగిపోతోంది. కాబట్టి ఇది పాపులర్ అవుతోంది. వీటిని ఆన్‌లైన్ ఎక్స్‌చేంజ్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. కాయిన్‌స్విచ్, బైయూకాయిన్, కాయిన్‌షేర్, యూనోకాయిన్ లాంటి ఎక్స్‌చేంజ్‌లు మన దేశంలో పాపులర్. వీటి ద్వారా బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేయవచ్చు, అమ్ముకోవచ్చు. అయితే బిట్‌కాయిన్‌లను వ్యక్తిగత వాలెట్‌లో స్టోర్ చేసుకోగల సౌకర్యాన్ని అందించే ఎక్స్‌చేంజ్‌లను ఎంచుకుంటే మంచిది. దాదాపు ఇలాంటి ఎక్స్‌చేంజ్‌లు అన్నింటిలో క్రిప్టోకరెన్సీ లావాదేవీల కోసం కేవైసీ తప్పనిసరి. అలాగే విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంక్ వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం రూ. 100 నుంచి మీకు వీలైనంత బిట్‌కాయిన్‌ను మీరు కొనవచ్చు. ఒక బిట్‌కాయన్‌ను పూర్తిగా కొనాలని రూల్ లేదు.
భారతదేశంలో లీగలేనా?
2018లో బిట్‌కాయిన్‌ను ప్రోత్సహించొద్దని ఆర్‌బీఐ, బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్కెట్ తలకిందులైంది. అయినప్పటికీ సుప్రీంకోర్ట్, ఆర్‌బీఐ నిర్ణయాన్ని సమర్థిస్తూ బిట్‌కాయిన్ మీద నిషేధం విధించింది. తర్వాత గతేడాది మార్చిలో మళ్లీ బిట్‌కాయిన్ మీద నిషేధాన్ని ఎత్తివేసింది. కాబట్టి బిట్‌కాయిన్ లావాదేవీలు భారతదేశంలో లీగల్. అయితే బిట్‌కాయిన్‌ల లావాదేవీల కారణంగా తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి మాత్రం ఎలాంటి నియమ నిబంధనలు, మార్గదర్శకాలు లేవు. దీని వల్ల కొంచెం రిస్క్ ఉండొచ్చు. అలాగే క్రిప్టోకరెన్సీ పెట్టుబడికి సంబంధించి పన్నుల విధింపు గురించి కూడా భారతదేశంలో ఎలాంటి స్పష్టత లేదు. కాబట్టి పెట్టుబడి పెట్టేముందు కాస్త ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఒక్క బిట్‌కాయిన్ మాత్రమే కాకుండా వేరే క్రిప్టోకరెన్సీని కూడా కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా పాస్‌వర్డ్ ముఖ్యమనే విషయం గుర్తుంచుకోండి.