'డబుల్' ఇంట్లో మద్యం దందా..!

              ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసాంఘీక కార్యకలాపాలకు వేదికవుతున్నాయా? పంపిణీకి సిద్ధంగా ఉన్న ఈ ఇల్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా లబ్దిదారులకు అందడం లేదా? నిర్మల్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని చిట్యాల గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్రమాలకు అడ్డగా మారుతున్నాయా? అన్న చర్చ నిర్మల్ లో ఆసక్తి రేపుతోంది.               నిర్మల్ […]

Update: 2020-02-07 08:48 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసాంఘీక కార్యకలాపాలకు వేదికవుతున్నాయా? పంపిణీకి సిద్ధంగా ఉన్న ఈ ఇల్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా లబ్దిదారులకు అందడం లేదా? నిర్మల్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని చిట్యాల గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్రమాలకు అడ్డగా మారుతున్నాయా? అన్న చర్చ నిర్మల్ లో ఆసక్తి రేపుతోంది.

నిర్మల్ జిల్లా కేంద్రానికి చిట్యాల గ్రామం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామశివార్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయింది. పూర్తయి చాలా కాలమవుతున్నప్పటికీ పంపణీ మాత్రం జరగలేదు.. పంపిణీ వరకు ఎందుకు లబ్దిదారుల ఎంపికే ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఇవి నిరుపయోగంగా మారాయి.

దీనిని ఆసరాగా తీసుకున్న ఆ గ్రామ అధికార పార్టీ నేత అందులో లిక్కర్ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామంలో ఇంకెక్కడైనా బెల్ట్ షాప్ నడిపితే అద్దె కట్టాల్సి వస్తుందన్న కక్కుర్తితో ఆయన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దందా నడుపుతున్నారు. దానిని ప్రశ్నించిన వారికి మనం కట్టించిన ఇల్లే కదా.. మనే అధికారంలో ఉన్నాం, సమస్యేంటి అంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోని ఒక ఇంటిని స్థానికులు మద్యం దుకాణంలా భావించడం కూడా ఆసక్తి రేపుతోంది.

పేదలకు పంపిణీ చేయాల్సిన ఇళ్లలో ఈ అక్రమ మద్యం దందా ఏంటని అటుగావెళ్లేవాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వ్యవహారం ఎక్సైజ్ శాఖ తో పాటు పోలీసులకు కూడా తెలిసిన పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు పంపిణీలో ఆలస్యం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, వేగంగా వాటిని లబ్దిదారులకు పంపిణీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది పంపణీ కాకుండానే ఇళ్లను ఆక్రమించేందుకు సమాయత్తమవుతున్నారు.

Tags:    

Similar News