అక్షయ్‌కు కరోనా.. డాబర్ బ్రాండ్‌కు తలనొప్పులు
దిశ, ఫీచర్స్ : బాలీవుడ్ సెలబ్రిటీలు.. ఆమిర్ ఖాన్, ఆలియా భట్, ఫాతిమా సనా షేక్, కత్రినా కైఫ్, భూమి పెడ్నేకర్, మిలింద్ సోమన్, గోవింద, విక్కీ కౌశల్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ కరోనా మరింత ఉధృతంగా వ్యాప్తి చెందుతుండగా, 24 గంటల్లోనే కేసుల సంఖ్య లక్ష దాటింది. ఈ నేపథ్యంలోనే తాను కరోనా బారిన పడినట్లు ఆదివారం ఉదయం వెల్లడించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. డాక్టర్ల సలహా మేరకు […]
దిశ, ఫీచర్స్ : బాలీవుడ్ సెలబ్రిటీలు.. ఆమిర్ ఖాన్, ఆలియా భట్, ఫాతిమా సనా షేక్, కత్రినా కైఫ్, భూమి పెడ్నేకర్, మిలింద్ సోమన్, గోవింద, విక్కీ కౌశల్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ కరోనా మరింత ఉధృతంగా వ్యాప్తి చెందుతుండగా, 24 గంటల్లోనే కేసుల సంఖ్య లక్ష దాటింది. ఈ నేపథ్యంలోనే తాను కరోనా బారిన పడినట్లు ఆదివారం ఉదయం వెల్లడించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. డాక్టర్ల సలహా మేరకు ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేరినట్లు సోమవారం మరో ట్వీట్ చేశాడు.
ఇక అక్షయ్ నటిస్తున్న రామ్‌సేతు మూవీ యూనిట్‌లో ఏకంగా 45 మంది జూనియర్ ఆర్టిస్టులు కరోనా బారిన పడ్డారు. అయితే ‘ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకు వచ్చినట్లు’ అక్షయ్‌కు పాజిటివ్ రావడంతో ‘డాబర్’ సంస్థ చిక్కుల్లోపడింది. అందుకు అక్షయ్ నటించిన ఓ యాడ్ కారణం కాగా.. ప్రజలను మిస్ లీడింగ్ చేస్తుందంటూ నెటిజన్లు డాబర్ సంస్థపై మండిపడుతున్నారు.
కొవిడ్ కాలం నుంచి ప్రతీ సంస్థ కూడా తమ ప్రొడక్ట్ ‘కరోనా నిరోధానికి పనిచేస్తుందని’ చెప్పుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలోనే డాబర్ కంపెనీ అందిస్తున్న చ్యవన్‌ప్రాష్ కూడా ఆ జాబితాలో ఉంది. దీనికి సంబంధించిన యాడ్‌లో అక్షయ్ నటించగా, రెండు చెంచాల చ్యవన్‌ప్రాష్ తీసుకోవడం వల్ల ప్రాణాంతక వైరస్ సోకే ప్రమాదం 12 రెట్లు తగ్గుతుందని ప్రకటనలో పేర్కొన్న కంపెనీ.. ఈ విషయం ‘క్లినికల్ స్టడీ’లో కూడా నిరూపితమైందని తెలిపింది (ఇమ్యూనిటీ టెస్ట్‌లో భాగంగా 696 మందిపై జరిపిన అధ్యయనంలో చ్యవన్‌ప్రాష్ తీసుకున్న 351 కొవిడ్ నుంచి రక్షణ పొందగా, మిగతావాళ్లు పాజిటివ్ తెచ్చుకున్నారు).
అయితే, డాబర్ వెబ్‌సైట్‌లో మాత్రం ఇలాంటి పరిశోధన లేదా అధ్యయనం చేసినట్లు ఎక్కడా వివరణ ఇవ్వలేదు. అంతేకాకుండా చ్యవన్‌ప్రాష్ బ్రాండ్ అంబాసిడర్ అక్షయ్ కూడా కొవిడ్ బారినపడటంతో నెటిజన్లు ఆ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాబర్, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై మీమ్స్, జోక్స్ పేలుస్తున్నారు.
‘హెచ్చరిక.. @ascionline! డాబర్ ఇండియా అధ్యయనంలో విశ్వసనీయత ఎంత? అది చెల్లుతుందా? దయచేసి మీ తీర్పును కనుగొని ఆమోదించండి. @rameshnarayan @skswamy @beastoftraal @calamur hatbhatnaturally రెండు చెంచాలు vs రెండు షాట్ల టీకా?’ అంటూ బ్రాండ్ కోచ్, స్ట్రాటజిస్ట్ అండ్ బ్రాండ్-బిల్డింగ్.కామ్ సలహాదారు ఏఎమ్‌బీఐ పరమేశ్వరన్ ట్వీట్ చేశాడు.
మహమ్మారి నేపథ్యంలో.. ఆయుర్వేద పరిశ్రమ, ఇతర థెరపెటిక్ ఇండస్ట్రీల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. పరిమిత సాక్ష్యాలు ఉన్నప్పటికీ, వాటిలో చాలా కంపెనీలు తమ ప్రకటనలతో ప్రజలను మిస్ లీడింగ్ చేస్తున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. కరోనావైరస్ వ్యాధి నివారణగా విక్రయిస్తున్న పతంజలి ఆయుర్వేద కరోనిల్ కూడా ఇంతకు ముందు స్కానర్ కిందకు వచ్చింది. ఈ నేపథ్యంలో పతంజలి నుంచి వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఇక సౌరవ్ గంగూలీకి గుండె నొప్పి రావడంతో.. అతడు ప్రచారం చేసిన ఫార్చ్యూన్ ఆయిల్ కూడా ఇలాంటి విమర్శలే ఎదుర్కొంది. ఈ క్రమంలో గంగూలీ కూడా ట్రోల్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.