కమ్యూనిటీ వ్యాప్తి కాదు.. స్థానిక వ్యాప్తి
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి చెందిందని, ఇకపైన గ్రామాల్లో కట్టడి చేయడం కష్టమేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ డాక్టర్ ఆర్వీ మోంగా చేసిన వ్యాఖ్యలతో ఐఎంఏ ఏకీభవించలేదు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమే తప్ప ఐఎంఏ అభిప్రాయం కాదని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ రంజన్ శర్మ, డాక్టర్ ఆర్వీ అశోకన్‌లు ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. మరోవైపు డాక్టర్ మోంగా చేసిన వ్యాఖ్యలతో ఖంగుతిన్న […]
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి చెందిందని, ఇకపైన గ్రామాల్లో కట్టడి చేయడం కష్టమేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ డాక్టర్ ఆర్వీ మోంగా చేసిన వ్యాఖ్యలతో ఐఎంఏ ఏకీభవించలేదు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమే తప్ప ఐఎంఏ అభిప్రాయం కాదని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ రంజన్ శర్మ, డాక్టర్ ఆర్వీ అశోకన్‌లు ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. మరోవైపు డాక్టర్ మోంగా చేసిన వ్యాఖ్యలతో ఖంగుతిన్న ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సైతం కమ్యూనిటీ వ్యాప్తి దశకు ఇంకా చేరుకోలేదని, కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో స్థానిక వ్యాప్తి (లోకల్ ట్రాన్స్‌మిషన్) మాత్రమే జరిగిందని వివరణ ఇచ్చారు.
ప్రస్తుతానికి దేశంలో కమ్యూనిటీ వ్యాప్తి చోటుచేసుకుందని బలపరిచే ఆధారాలేవీ లేవని, కరోనా కేసులు ఎక్కువగా నిర్దిష్ట ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయని ఢిల్లీలో సోమవారం మీడియానుద్దేశించి మాట్లాడుతూ వివరించారు. కొన్నిచోట్ల నిజంగానే కేసులు ఎక్కువగా ఉన్నాయని, సమీప భవిష్యత్తులో మరింత ఎక్కువైతే అప్పుడు అధ్యయనంతో ఒక నిర్ణయానికి రావచ్చని అన్నారు. ప్రస్తుతానికి ఎక్కువ కేసులు నిర్దిష్టంగా ఒక ప్రాంతానికే పరిమితంగా ఉన్నందున దీన్ని స్థానిక వ్యాప్తిగానే పరిగణించాల్సి ఉంటుంది తప్ప కమ్యూనిటీ వ్యాప్తిగా భావించలేమన్నారు.
వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ గురించి మాట్లాడుతూ, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని 18-55 ఏళ్ళ వయసు ఉన్నవారిని ఎంపిక చేసుకుని ప్రయోగాలు జరుగుతాయని, దేశవ్యాప్తంగా 1125 మంది నుంచి రక్త నమూనాలను సేకరించి వైద్య పరీక్షల వివరాలను విశ్లేషించిన తర్వాత 375 మందిని ఎంచుకున్నట్లు తెలిపారు. రెండవ దశలో 12-65 ఏళ్ళ వయసువారిని ఎంపిక చేసి 750 మందిపై ప్రయోగాలు జరుగుతాయన్నారు. మూడవ దశలో వ్యాక్సిన్ సామర్థ్యం గురించి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయన్నారు.