ఆఫ్గనిస్థాన్ ఎఫెక్ట్: నోరెత్తని అమెరికా.. వణుకుతోన్న పాక్

రెండు దశాబ్దాల తర్వాత ఆఫ్గనిస్థాన్‌ను చేజిక్కించుకున్న తాలిబన్ల పాలన ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మరికొంతకాలం ఆగక తప్పదు. ఇప్పటికి వాళ్లు అంత కఠినంగా వ్యవహరించకపోయినప్పటికీ, భవిష్యత్తులో అలాగే ఉంటారనే నమ్మకం ఏమీ లేదు. అమెరికాతో చర్చల తర్వాతే ఆఫ్గనిస్థాన్‌లో అడుగుపెట్టి, కాబూల్ చేరుకుని దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు చివరికి అమెరికాను కూడా హెచ్చరించేస్థాయికి ఎదిగారు. ముందు నిర్ణయించిన ప్రకారం సెప్టెంబర్ ఒకటి లోగా అమెరికా దళాలు ఆఫ్గనిస్థాన్ నుంచి వైదొలగకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని […]

Update: 2021-08-26 06:43 GMT

రెండు దశాబ్దాల తర్వాత ఆఫ్గనిస్థాన్‌ను చేజిక్కించుకున్న తాలిబన్ల పాలన ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మరికొంతకాలం ఆగక తప్పదు. ఇప్పటికి వాళ్లు అంత కఠినంగా వ్యవహరించకపోయినప్పటికీ, భవిష్యత్తులో అలాగే ఉంటారనే నమ్మకం ఏమీ లేదు. అమెరికాతో చర్చల తర్వాతే ఆఫ్గనిస్థాన్‌లో అడుగుపెట్టి, కాబూల్ చేరుకుని దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు చివరికి అమెరికాను కూడా హెచ్చరించేస్థాయికి ఎదిగారు. ముందు నిర్ణయించిన ప్రకారం సెప్టెంబర్ ఒకటి లోగా అమెరికా దళాలు ఆఫ్గనిస్థాన్ నుంచి వైదొలగకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీన్నిబట్టే వాళ్ల వ్యవహార శైలి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్గనిస్థాన్ నుంచి తమ సైనిక బలగాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రెండు, మూడు ప్రకటనలు ధైర్యంగానే చేశారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అంత ధైర్యంగా ప్రకటనలు ఉండడం లేదు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పరిపాలన కొనసాగిస్తామని హామీ ఇస్తే తాము ఆఫ్గనిస్థాన్ నుంచి వైదొలగుతానని గతంలో ట్రంపు తాలిబన్లతో చర్చలు జరిపారు. ఇందుకు వాళ్లు అందుకు అంగీకరించారు. కానీ, బైడెన్ ఆ ఒప్పందాన్ని గట్టిగా ప్రస్తావించలేకపోయారు. ఇదే ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న అంశం.

మిత్రదేశం కలవరం

ఆఫ్గనిస్థాన్‌కు, ముఖ్యంగా తాలిబన్లకు మిత్ర దేశంగా ఉన్న పాకిస్తాన్ కూడా ఇప్పుడు కలవరపడుతోంది. దానికి కారణం ఏమిటంటే, ఆఫ్గనిస్థాన్‌ను తమ చేతిలోకి తీసుకోగానే ఉగ్రవాద మూలాలు కలిగిన వేలాది మంది ఖైదీలను తాలిబన్లు జైలు నుంచి విడుదల చేశారు. పాకిస్తాన్‌లో గతంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన ‘తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్’ అనే సంస్థకు చెందిన ఉగ్రవాదులు కూడా ఇందులో ఉన్నారు. వీళ్లు గతంలో పాక్‌లో అనేక బాంబు దాడులు చేసి, కాల్పులు జరిపి అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు. వారు తిరిగి చెలరేగితే ఇక్కడ అలజడి తప్పదని పాకిస్తాన్ భయం. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఈ విషయం మీద తాలిబన్లతో చర్చలు జరిపారని అంటున్నారు. వారు ఎలాంటి హామీ ఇచ్చారో తెలీదు. అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించడానికి ఆఫ్గన్ సరిహద్దులను మూసేస్తున్నామని చెప్పిన పాకిస్తాన్, నిజానికి వాటిని తెరిచే ఉంచింది. దీంతో వేలాది మంది ఆఫ్గన్ శరణార్థులు పాకిస్తాన్‌లోకి ప్రవేశించగలిగారు. అందులో టీటీపీ మిలిటెంట్లు కూడా ఉన్నారనే అనుమానాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి నివేదిక ప్రకారం ‘తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్’ కు ఆరు వేల మంది సుశిక్షితులైన సైనికులు ఉన్నారు. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు భయపడుతోంది.

డ్రాగన్ మౌనం

తాలిబన్‌లకు ఆఫ్గనిస్థాన్‌లో అండగా నిలిచిన చైనా మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నది. అక్కడి పరిస్థితుల మీద నోరు మెదపడం లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా గంభీరంగానే మాట్లాడుతున్నారు. ‘తాలిబన్లు మునుపటిలా ఉండకపోవచ్చు’ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆఫ్గనిస్థాన్ ప్రజలు మాత్రం తాలిబన్లను నమ్మే స్థితి లేదు. ఇక అంతర్జాతీయ సమాజం ఎలా నమ్ముతుంది? సామాన్య జనం తమ పనులను మామూలుగా చేసుకోవచ్చని తాలిబన్లు పదేపదే స్థానిక ప్రజలకు చెబుతున్నప్పటికీ, రోజూ వేలాది కుటుంబాలు ఆఫ్గనిస్థాన్ నుంచి పొరుగు దేశాలకు తరలిపోతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్థాన్‌‌ను చేజిక్కించుకున్నాక ఒక తాలిబన్ నేత మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆఫ్గనిస్థాన్‌లో శాంతిని పరిరక్షిస్తామని, మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు తగిన రక్షణ కల్పిస్తామని చెప్పారు. అందుకు భిన్నంగా దేశంలో నాలుగైదు సంఘటనలు జరిగాయి. అమెరికా, నాటో దళాల ఆధీనంలోనే ఉన్న కాబూలు విమానాశ్రయం వద్ద కాల్పులు జరిగాయి. విమానాశ్రయం బయట అమెరికా సైనికులు చాలామంది నిలువరించారు. వేలాది మంది ఆఫ్గనిస్థాన్ నుంచి తరలిపోవడానికి రావడంతోనే ఘటనలు జరిగాయని అంతర్జాతీయ మీడియా ప్రసారం చేసింది.

వైఖరి మారుతోంది

విచిత్రమేమిటంటే నిన్నటి వరకు తాలిబన్లను ఓపెన్‌గా సహకరించిన దేశాలు క్రమక్రమంగా తమ వైఖరిని మార్చుకుంటున్నాయి. ప్రజాస్వామిక పాలన ఉండదనే విషయాన్ని తాలిబన్లు చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. షరియా అమలవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అక్కడక్కడ జీన్స్ వేసుకున్నారని, టైట్ దుస్తులు ధరించారని కొందరిని కొడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. తాలిబన్లకు ఆర్థిక సహకారం అందిస్తున్న సంస్థలను, వారిని ఆశ్రయం కల్పిస్తున్న దేశాల మీద ఒత్తిడి పెంచగలిగితే తాలిబన్లను నియంత్రణలో ఉంచవచ్చనే ఒక భావన వ్యక్తమవుతున్నది. ఆఫ్గనిస్థాన్ ప్రభుత్వానికి చెందిన నిధులు అమెరికన్ బ్యాంకులలో ఉన్నాయి. అమెరికా వాటిని స్తంభింపజేసింది. తాలిబన్ల వైఖరి ఏమిటో, పాలన ఎలా ఉంటుందో? తెలుసుకున్న తరువాతనే ఆ నిధులను విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ అదే కోరుకుంటున్నాయి.

-ఫజుల్ రహమాన్
90102 23917

Tags:    

Similar News