భూ లావాదేవీలకు ‘ధరణే’ మూలం..!
రెండేళ్ల కసరత్తు అనంతరం తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని బుధవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ‘భూమి హక్కులు, పట్టాదారు పుస్తకాల చట్టం-2020’ పేరిట న్యూ యాక్టును తీసుకొచ్చింది. రెవెన్యూ పరిపాలనలో అవినీతిని నిర్మూలించి మంచి అలవాట్లను పెంచడం, రెవెన్యూలో బదిలీలను పెంచడం వంటి ప్రక్రియలను చేపట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. చురుకైన, సుపరిపాలనలో భాగంగా బాధ్యతను, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు కొత్త చట్టాన్ని రూపొందించామని వివరించారు. దిశ, న్యూస్‌బ్యూరో: ఇక నుంచి ఎలాంటి అవాంతరాలు […]
రెండేళ్ల కసరత్తు అనంతరం తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని బుధవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ‘భూమి హక్కులు, పట్టాదారు పుస్తకాల చట్టం-2020’ పేరిట న్యూ యాక్టును తీసుకొచ్చింది. రెవెన్యూ పరిపాలనలో అవినీతిని నిర్మూలించి మంచి అలవాట్లను పెంచడం, రెవెన్యూలో బదిలీలను పెంచడం వంటి ప్రక్రియలను చేపట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. చురుకైన, సుపరిపాలనలో భాగంగా బాధ్యతను, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు కొత్త చట్టాన్ని రూపొందించామని వివరించారు.
దిశ, న్యూస్‌బ్యూరో: ఇక నుంచి ఎలాంటి అవాంతరాలు లేని రెవెన్యూ పాలనను అందిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయనే స్వయంగా కొత్త రెవెన్యూ చట్టం బిల్లును శాసనసభ ముందు ఉంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాహితమే లక్ష్యంగా బిల్లును రూపొందించామని చెప్పారు. బ్యాంకుల్లో రుణాలు పొందేందుకు రైతుల మీద ఒత్తిడి లేని వ్యవస్థను తీసుకొస్తున్నామని అన్నారు. డేటాను అనుసరించి బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలన్నారు. అందుకే, తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పుస్తకాల చట్టం 1971లోని కొన్ని నిబంధనలను బలోపేతం చేయాలని భావించామన్నారు. కొత్త చట్టంలో ‘ధరణి’ వెబ్ సైట్ అత్యంత కీలకంగా మారనుంది. ప్రతి ప్రక్రియ దాని ఆధారంగానే నడుస్తుంది. ప్రతి దరఖాస్తు దాని మూలంగానే పరిష్కారం అవుతుంది.
అత్యంత కీలకంగా మారిన తహసీల్దార్ ఇందులోని వివరాలకు అనుగుణంగానే వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఇక నుంచి తహసీల్దార్ కు అదనంగా సంయుక్త సబ్ రిజిస్ట్రార్ హోదాను కల్పిస్తున్నారు. ఆర్డీఓలకు ఎలాంటి అదనపు బాధ్యతలను అప్పగించలేదు. ఏ రకమైన రిజిస్ట్రేషన్ కోసమైనా వెబ్ సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో పాస్ పుస్తకం బదిలీ, దస్తావేజులు రిజిస్ట్రార్ సమక్షంలో ఇవ్వాలి. వ్యవసాయ భూముల అమ్మకం కొనుగోలు మ్యూటేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే హక్కుల రికార్డ్ పూర్తి చేసి కొన్నవారికి బదిలీ చేయాలి. ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన చేయాలి. మోసపూరితంగా ప్రభుత్వ భూములకు పట్టాదారు పుస్తకాన్ని జారీ చేస్తే, రద్దు చేసి అధికారం కలెక్టర్ కు ఉంటుంది. ఇప్పటి వరకు ఎటువంటి పట్టాదారు పుస్తకాలు జారీ చేయని భూములకు పాస్ పుస్తకాలు జారీ చేసే అధికారం తహసీల్దార్ కు ఉందని పేర్కొన్నారు.
ఇవీ ప్రధానాంశాలు..
హక్కుల రికార్డు (ROR) :
మ్యాన్యువల్ విధానం ఉండదు. ‘ధరణి’ పోర్టల్ లో అప్ లోడ్ అయిఉన్న రికార్డుల ఆధారంగానే అన్ని ప్రతిక్రియలను తహసీల్దార్ కొనసాగిస్తారు. వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది.
ధరణి ..
ధరణి పోర్టల్ ద్వారా భూ యాజమాన్య హక్కుల బదిలీని చేపడుతారు. పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో భూ రికార్డ్స్ నిర్వహణ ఉంటుంది. కొత్త చట్టం వ్యవసాయ యోగ్యమైన భూమి కోసం మాత్రమే వర్తిస్తుంది. పట్టాదారు పుస్తకాన్ని హక్కు పత్రంగా పరిగణనలోకి తీసుకుంటారు. భూ వివాదాల పరిష్కారాలకు ఒక్కరు లేదా అంతకన్నా ఎక్కువ సభ్యులతో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. కోర్ బ్యాంకింగ్ సిస్టం ద్వారా ప్రతి గ్రామంలోని భూముల హక్కుల రికార్డును డిజిటల్ స్టోరేజ్ చేస్తారు. కొత్త పట్టాదారు పుస్తకాన్ని హక్కుల రికార్డుగా పరిగణిస్తారు. ఆ రికార్డులో పట్టాదారు పేర్లు – సర్వే నంబర్లు – విస్తీర్ణం ఉంటాయి. ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములకు వర్తించదు. పాయిగా, జాగీరు, సంస్థానాలు, మక్తా, గ్రామ అగ్రహారం, ఉహ్మ్లి, ముకాసా సహా అన్ని రకాల భూముల యాజమాన్యం ఈ చట్టం ప్రకారం బదిలీ చేయరాదు. జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి.
స్లాట్..
భూమిని విక్రయించేందుకు, దానం చేసేందుకు, తాకట్టు పెట్టేందుకు, మార్పిడి చేసేందుకు రిజిస్టరైన దస్తావేజు కింద భూమిని బదిలీ చేసేందుకు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కేటాయించిన స్లాట్ ప్రకారమే కార్యాలయానికి రావాలి. ప్రమాణ పత్రాలు, పట్టాదారు పుస్తకాలు, హక్కు పత్రాలను తీసుకురావాలి. బదిలీ డాక్యుమెంట్లను రిజిస్ట్రార్ సమక్షంలో సమర్పించాలి. స్టాంపు డ్యూటీ, భూమి యాజమాన్యపు హక్కుల మార్పిడి (మ్యూటేషన్) చార్జీలను చెల్లించాలి. వెంటనే పట్టాదారుడి ఖాతాలో నుంచి తొలగించి కొనుగోలుదారుడి పేరిట రిజిస్టర్ చేస్తారు. తక్షణమే హక్కుల రికార్డులో నమోదు చేస్తారు. చెల్లించిన చార్జీల వివరాలను కూడా ధరణిలో రికార్డులో చేరుస్తారు. కొనుగోలు చేసిన వ్యక్తికి పట్టాదారు పుస్తక సహిత హక్కు పత్రాన్ని జారీ చేస్తారు. అమ్మిన వ్యక్తి పట్టాదారు పుస్తకాన్ని కూడా సరి చేస్తారు.
వారసులకు భాగం..
వారసులు భూ విభజన చేసుకోవాలనుకుంటే ఏకాభిప్రాయాని వచ్చి కూడా వెబ్సైట్ ద్వారా సమయాన్ని పొందాలి. నిర్ధిష్ట సమయానికి కార్యాలయానికి రావాలి. భూమిపై హక్కులు, రికార్డుల్లో మార్పు ప్రభావాన్ని తహశీల్దార్ సమక్షంలో సమర్పించాలి. ఉమ్మడి ఒప్పందం తెలిపే డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ ఉంటుంది. పట్టాదారుడు చనిపోతే కూడా అదే పద్ధతిని అనుసరించాలి. ప్రస్తుత పట్టాదారు పుస్తకాలు, ఇతర హక్కు పత్రాలతో తహసీల్దార్ కార్యాలయానికి రావాలి. వారి ఉమ్మడి సమ్మతి ఆధారంగా యాజమాన్యపు మార్పిడి (మ్యూటేషన్) చేస్తారు. దీనికి కూడా చార్జీలు ఉంటాయి.
డిక్రీ ద్వారా..
న్యాయస్థానం డిక్రీ ద్వారా హక్కులు పొంది హక్కుల రికార్డుల్లో మార్పులు కోరేవారు కూడా స్లాట్ బుక్ చేసుకోవాల్సిందే. కేటాయించిన సమయంలోనే స్టాంపు డ్యూటీ చెల్లించాలి. ఆ తర్వాత ఖాతా నుంచి డిక్రీ కిందికి వచ్చే భూమిని తొలగిస్తూ తహసీల్దార్ తగిన మార్పులు చేస్తారు.
రుణం పొందడానికి..
పట్టాదారుడికి రుణాలు ఇచ్చేందుకు పహాణీ, పట్టాదారు పుస్తకం తీసుకురావాలని బ్యాంకులు పట్టుబట్టొద్దు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఉండే ధరణి హక్కుల రికార్డు ప్రాతిపదికన రుణాలు మంజూరు చేయాలి. పంట రుణాలకు ఏజెన్సీ పాస్ పుస్తకం, హక్కు పత్రాలను ఉంచుకోవద్దు. రికార్డులో భూమి ఉంటే చాలు. రుణాలు ఇవ్వాలి. తెలంగాణ భూమి రికార్డుల నిర్వహణ పద్ధతి (TLRMS)లో హక్కుల రికార్డును ఎలక్ట్రానిక్ రూపంలో నిర్వహిస్తున్నారు. స్టోరేజ్, డివైజ్ రెవెన్యూ రికార్డులను మీ సేవ ద్వారా పొందొచ్చు. భూమిని కలిగి ఉన్నవారు ఎలక్ట్రానిక్ పట్టాదారు పుస్తక సహిత హక్కు పత్రాన్ని పొందొచ్చు.
కేసులన్నీ ట్రిబ్యునల్ కే..
తెలంగాణ భూమిపై హక్కులు, పట్టాదారు పుస్తకాల చట్టం 1971 నిబంధనల కింద రద్దు వల్ల అపరిష్కృత అప్పీళ్లు, పున:పరిశీలన కేసులన్నీ ప్రత్యేక ట్రిబ్యునల్ కు బదిలీ చేస్తారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులే అంతిమంగా ఉంటుంది. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ త్వరలోనే వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.
దావా వేయరాదు..
ఏదైనా భూమికి సంబంధించి రికార్డులు సవరించినా, తొలగించినా నమోదు చేసిన ప్రభుత్వం మీదా, ప్రభుత్వ అధికారి మీదా ఎటువంటి దావా వేయరాదని చట్టంలో 9వ సెక్షన్ లో స్పష్టం చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పు చేసినా, యాదృచ్ఛికంగా పొరపాటు జరిగినా సదరు అధికారిపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేశారు. అంటే, తహసీల్దార్ తలచుకుంటే ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడే అధికారులు తప్పులు చేయరన్న గ్యారంటీ లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అనేక మంది తహసీల్దార్ల అవినీతి దందాలు వెలుగులోకి వచ్చాయి.
కీసర తహసీల్దార్ నాగరాజు ఏకంగా రూ.1.10 కోట్లు తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసే పూర్తి అధికారం వారి చేతిలోకి వస్తుంది. కింది స్థాయి సిబ్బంది అవసరం కూడా లేదు. ఎలాంటి విచారణ లేదు. క్షేత్ర స్థాయి పరిశీలన లేదు. కక్షిదారులను నమ్మడమే, వారి మాటల ఆధారంగానే ప్రక్రియ పూర్తవుతుంది. ఎవరూ మార్పు చేయలేని, తిరిగి సరిదిద్దలేని మార్పును తహశీల్దార్ చేయొచ్చు. 8వ సెక్షన్ లో మాత్రం ప్రభుత్వ భూములకు పట్టాదారు పుస్తకాలు, హక్కులు కల్పిస్తే.. కలెక్టర్ ఆ పాస్ పుస్తకాన్ని, హక్కులను రద్దు చేయొచ్చు. సంబంధిత తహసీల్దార్ ను బర్తరఫ్ చేయడానికి చర్యలు తీసుకుంటారు. క్రిమినల్ చర్యలు మొదలు పెడతారు.