వారంలో దరఖాస్తుల స్వీకరణ.. సర్కారు​కు ‘పోడు’ సవాళ్లు

దిశ, తెలంగాణ బ్యూరో: అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్టు తయారైంది పోడు భూముల పంచాయితీ. పోడుసమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకున్న తెలంగాణ సర్కారుకు క్షేత్రస్థాయిలో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకవైపు అంచనాలకు మించి కబ్జాలు.. భారీ సంఖ్యలో ఉన్న గిరిజనులు, గిరిజనేతరుల్లో అర్హుల గుర్తింపు.. ఏది అటవీ, ఏది రెవెన్యూ.. అందులో దేవాదాయ భూమి ఎంత అనే హద్దులను తేల్చడం.. ఇవన్నీ ఒక పెద్ద తంతుగా మారే చాన్స్ ఉన్నది. దసరా పర్వదినం తర్వాత వారం […]

Update: 2021-10-18 03:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్టు తయారైంది పోడు భూముల పంచాయితీ. పోడుసమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకున్న తెలంగాణ సర్కారుకు క్షేత్రస్థాయిలో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకవైపు అంచనాలకు మించి కబ్జాలు.. భారీ సంఖ్యలో ఉన్న గిరిజనులు, గిరిజనేతరుల్లో అర్హుల గుర్తింపు.. ఏది అటవీ, ఏది రెవెన్యూ.. అందులో దేవాదాయ భూమి ఎంత అనే హద్దులను తేల్చడం.. ఇవన్నీ ఒక పెద్ద తంతుగా మారే చాన్స్ ఉన్నది.

దసరా పర్వదినం తర్వాత వారం రోజుల్లోగా పోడు భూముల పట్టాల కోసం జిల్లాల వారీగా దరఖాస్తులను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గిరిజన శాఖతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు దరఖాస్తులను తీసుకోవడానికి ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల నేతృత్వంలో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఎవరు అర్హులు.. ఎవరికెంత భూమిలో పట్టాలివ్వాలనే అంశంపై అటవీ ప్రాంతాల వారీగా డిజిటల్ ​సర్వే నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. గ్లోబల్​ పొజిషనింగ్​ సిస్టమ్​(జీపీఎస్​) ద్వారా నిర్వహించే ఈ ​సర్వేలో అటవీ భూములు కబ్జా చేసి ఎంతకాలం నుంచి సాగు చేసుకుంటున్నారు.. 2005 డిసెంబర్​ కన్నా ముందు నుంచి కబ్జాలో ఉన్న వారెందరు? ఆ తర్వాత భూములను ఆక్రమించుకున్న వారెంతమంది? అనే విషయాలను తేల్చనున్నారు. దాంతో పాటు అటవీ భూమిలో ఎంత రెవెన్యూ భూమి ఉన్నది? ఎంత దేవాదాయ శాఖకు చెందుతున్నది? అనే లెక్కలను తీస్తారు. అటవీ భూముల కబ్జాలో ఉన్న అర్హులకు (రికగ్నిషన్​ ఆఫ్​ ఫారెస్ట్​ రైట్స్​) ఆర్ఓఎఫ్​ఆర్ ​పట్టాలను ఇస్తారు. వాటిపై యాజమాన్య హక్కులను పొందడానికి వీలు లేదు. అదే రెవెన్యూ భూమిలో అయితే అసైన్డ్​ పట్టాలు ఇస్తారు. వాటిపై యాజమాన్య హక్కులు ఇస్తారు. కానీ అది ఇతరులకు అమ్మడానికి వీలుండదు.

రెవెన్యూ, అటవీ భూములపై వివాదాలు

ఉత్తర తెలంగాణలోని చాలాచోట్ల రెవెన్యూ గ్రామాలకు, అటవీ సరిహద్దుల మధ్య చాలాచోట్ల భూవివాదాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూమిలో ఏడు లక్షల ఎకరాల వరకు రెవెన్యూ భూమి ఉందని రెవెన్యూశాఖ వాదిస్తున్నది. రెవెన్యూ శాఖ తప్పుడు రికార్డులను చూపుతున్నదని భూమి అంతా తమదేనని అటవీశాఖ స్పష్టం చేస్తున్నది. అటవీ భూముల్లో ఎంత రెవెన్యూ భూమి ఉందని గుర్తించి సరిహద్దులను ఖచ్చితంగా తేల్చడం సర్కారు ​ముందున్న సవాల్​. అదే సమయంలో అంచనాలకు మించి అడవుల్లో కబ్జాల్లో అసలైన అర్హులను గుర్తించడం ఎలా.. వారిలో గిరిజనేతరుల పరిస్థితి ఏమిటన్నది మరో చిక్కు సమస్య. అందులో అడవుల నరికివేతలో సిద్ధహస్తులైన గుత్తికోయలు, ముల్లానీల వంటి వారిని ఏం చేయాలనేది ప్రశ్నగా మారింది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ​నుంచి వలస వచ్చి ఖమ్మం, కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో అడవుల విధ్వంసంలో ప్రధాన పాత్ర వహిస్తున్న గొత్తికోయలకు ఆర్ఓఎఫ్ఆర్​ పట్టాలు ఇవ్వకూడదని సర్కారు​ నిర్ణయించినట్లు సమాచారం.

ఇంతింతై రెండింతలై..

రాష్ట్రంలో అటవీ భూమి 66 లక్షల ఎకరాల వరకు ఉండగా దాదాపు 8 లక్షల ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారుల రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఆర్ఓఎఫ్​ఆర్​ పథకం కింద అదనంగా పోయింది 3 లక్షల ఎకరాలు. ఇక మొత్తంగా మిగిలింది 55 లక్షల ఎకరాలే. ఇది అధికారిక లెక్క మాత్రమే. కానీ గత కొంతకాలంగా సర్కార్​ రహస్యంగా ప్రాంతాల వారీగా నిర్వహిస్తున్న శాంపిల్​ సర్వేలో ఈ కబ్జాలు రెండు నుంచి నాలుగింతలుగా ఉన్నాయి. మహబూబాబాద్​ ప్రాంతంలో ఒక మండలం పరిధిలో 3 వేల ఎకరాల అటవీ భూమి కబ్జా అయిందని రికార్డుల్లో ఉండగా.. క్షేత్రస్థాయిలో వెళ్లి చూసేసరికి కబ్జాకు గురైంది 21వేల ఎకరాలని తేలడంతో అధికారులు అవాక్కయ్యారు. అంటే రికార్డుల్లో ఉన్న దాని కంటే ఏడు రెట్లు ఎక్కువ కావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరు నాగారం​, పాకాల్​, ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా, మహబూబాబాద్ అడవుల్లో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు వెల్లడవుతున్నది. క్షేత్రస్థాయిలో ఆక్రమణలు రెండు రెట్లు అధికంగా ఉన్నట్లు శాటిలైట్​ చిత్రాల ద్వారా వెల్లడవుతున్నది. ఇందులో సగానికి పైగా 2005 డిసెంబర్​ తర్వాతే కబ్జాకు గురైనట్లు ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే స్పష్టమవుతున్నది.

8.10 లక్షల ఎకరాల అటవీ భూమి కేటాయింపు

వాస్తవానికి చాలా ఏండ్లుగా అడవుల్లోనే నివాసముంటూ పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు, ఇతర సంప్రదాయ తెగలకు సంబంధించిన వారికి భూమిపై యాజమాన్య హక్కులను ఇవ్వడానికి రికగ్నిషన్​ ఆఫ్​ ఫారెస్ట్​ రైట్స్​(ఆర్ఓఎఫ్ఆర్) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2006లో అమల్లోకి తెచ్చింది. ఈ యాక్ట్​ ప్రకారం డిసెంబర్​ 2005 కంటే ముందు నుంచి అటవీ భూములపై కబ్జాలో ఉండి వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు, పేదలకు పట్టాలివ్వాలన్న నిబంధన ఉంది. చట్టం అమల్లోకి వచ్చిన మూడు నుంచి ఆరునెలల్లోపు ఆర్ఓఎఫ్​ఆర్ కింద​ దరఖాస్తు చేసుకున్న వారినే పరిగణనలోకి తీసుకుంటారు. ఇక గిరిజనేతరులు పట్టా పొందాలంటే చట్టం అమల్లోకి రావడం కన్నా 75ఏండ్ల ముందు నుంచే సాగు చేసుకున్నట్లు ఆధారాలు చూపాలి. కాగా రాష్ట్రంలో ఆర్ఓఎఫ్ఆర్ ​కింద 94,273 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 54వేల 278మందికి పట్టాలిచ్చి 3,05,977ఎకరాల అటవీ భూమిని కేటాయించారు. సామాజిక అవసరాల కింద మరో 5లక్షల ఎకరాలను ఇవ్వగా.. మొత్తానికి ఆర్​ఓఎఫ్ఆర్​ కింద 8 లక్షల 10వేల ఎకరాల అటవీ భూమిని వ్యక్తులకు, సంస్థలకు కట్టబెట్టారు. లక్ష దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి.

శాటిలైట్ సర్వే ప్రామాణికం

వాస్తవానికి నేషనల్​ రిమోట్​ సెన్సింగ్​ ఏజెన్సీ శాటిలైట్​ సర్వేను ప్రామాణికంగా తీసుకుంటే అసలు విషయం బట్టబయలవుతుంది. ప్రస్తుతం అటవీశాఖ ఎన్ఆర్ఎస్ఏ ‘కార్టో శాట్’ద్వారా ఉపగ్రహ చిత్రాలను తీస్తున్నది. దీని ప్రకారం ఏ అటవీ భూమి ఎప్పుడు పంట పొలంగా మారింది.. ఎక్కడ కబ్జాకు గురైందనే వివరాలు చిత్రాలతో సహా బయట పడతాయి. కాగా 2005కు ముందు కబ్జా ఎంత.. ఆ తర్వాత ఎంత ఆక్రమణకు గురైందనే విషయం ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడవుతాయి. దీనికి సంబంధించిన వ్యవస్థ అటవీశాఖ వద్ద ఉంది. కానీ ఈ సర్వేలో ఏది అటవీభూమి, ఏది రెవెన్యూ భూమి అనేది తెలియదు. ఏ వ్యక్తి ఆధీనంలో ఎంత భూమి ఉందనేదీ తేలదు. ఒకవైపు శాటిలైట్​ చిత్రాలను ప్రామాణికంగా తీసుకుంటూనే మరోవైపు డిజిటల్​ సర్వే చేయించాలని సర్కార్​ నిర్ణయించింది. మరి డిజిటల్​ సర్వే ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది.. ఎప్పుడు ముగుస్తుందనేది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News