మాక్స్ లైఫ్ ఆస్ప‌త్రిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

దిశ ప్ర‌తినిధి , హైద‌రాబాద్: క‌ర్మ‌న్ ఘాట్ మాక్స్ లైఫ్ ఆస్ప‌త్రిపై చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఆర్సీలో జనగాం జిల్లా నఖ్కల్ గ్రామానికి చెందిన పాశం కోమల అనే మహిళ ఫిర్యాదు చేశారు. తన భర్తకు కరోనా వచ్చిందని చెప్పి చికిత్స పేరిట తన దగ్గర నుంచి లక్షలాది రూపాయలను ఆస్పత్రి వారు దండుకున్నారని తెలిపారు. చివరకు తన భర్త పరిస్థితి విషమించి చనిపోయారని చెప్పి ఆస్పత్రి వారు మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు తమకు […]

Update: 2020-12-14 10:50 GMT

దిశ ప్ర‌తినిధి , హైద‌రాబాద్: క‌ర్మ‌న్ ఘాట్ మాక్స్ లైఫ్ ఆస్ప‌త్రిపై చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఆర్సీలో జనగాం జిల్లా నఖ్కల్ గ్రామానికి చెందిన పాశం కోమల అనే మహిళ ఫిర్యాదు చేశారు. తన భర్తకు కరోనా వచ్చిందని చెప్పి చికిత్స పేరిట తన దగ్గర నుంచి లక్షలాది రూపాయలను ఆస్పత్రి వారు దండుకున్నారని తెలిపారు. చివరకు తన భర్త పరిస్థితి విషమించి చనిపోయారని చెప్పి ఆస్పత్రి వారు మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌లో ఆమె సోమవారం ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ…. ఆగ‌స్టు 19న త‌న భ‌ర్త పాశం ల‌క్ష్మ‌య్య అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో క‌ర్మ‌న్ ఘాట్‌లోని మాక్స్ లైఫ్ ఆస్ప‌త్రికి తీసుకు వచ్చామని తెలిపారు. తన భ‌ర్త‌ను డాక్ట‌ర్ విజ‌య్ గౌడ్ ప‌రీక్షించారని చెప్పారు. ఇదే అదునుగా భావించి తన భర్తకు క‌రోనా వచ్చిందనీ , 80 శాతం ఊపిరితిత్తులు చెడిపోయాయ‌ని డాక్టర్ చెప్పారని తెలిపారు. వెంట‌నే క‌రోనా ట్రీట్‌మెంట్ మొద‌లు పెట్టాల‌ని చెప్పి పలు విడ‌త‌ల్లో రూ. 14 ల‌క్ష‌లు తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు. అయినా స‌రైన వైద్యం అందించ‌క‌ పోవ‌డంతో కేవ‌లం 5 రోజుల వ్య‌వ‌ధిలో (23న) త‌న భ‌ర్త మ‌ర‌ణించిన‌ట్లు వెల్లడించారు. ఆస్ప‌త్రి యాజ‌మాన్యం తీసుకున్న డ‌బ్బుల‌కు ఎలాంటి ర‌సీదు ఇవ్వ‌లేద‌ని చెప్పారు.

తన భర్త చ‌నిపోయిన‌ట్లుగా మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రం కూడా ఇవ్వ‌కుండా కొనియ‌ర్‌లో పంపిస్తామ‌ని డెడ్ బాడీని ఇచ్చి పంపించి వేశార‌ని అన్నారు. ఈ విష‌య‌మై ఎన్ని సార్లు వారిని అడిగినా రేపు.. మాపు అంటూ కాల‌యాప‌న చేశార‌ని అన్నారు. ఇప్ప‌డు వెళితే హాస్పిట‌ల్ మేనేజ్ మెంట్ మారింద‌ని, వారు త‌మ‌కు తెలియ‌ద‌ని అంటున్నార‌ని వాపోయారు. దీంతో తాము ఆస్ప‌త్రి విష‌యంలో విచార‌ణ జ‌రుప‌గా ఎలాంటి అనుమ‌తులు లేవ‌ని, య‌జ‌మాని డాక్ట‌ర్ విజ‌య్ గౌడ్ అస‌లు డాక్ట‌రే కాద‌ని తేలింద‌న్నారు. తన భ‌ర్త బ‌తికి ఉన్న స‌మ‌యంలో ఫోన్‌లో తనతో ఆయన మాట్లాడారనీ.. ఆయనకు ఎలాంటి చికిత్స‌లు ఇవ్వ‌డం లేద‌ని, నెగిటివ్ వ‌చ్చింద‌ని ఆయన తనతో చెప్పిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ఈ విష‌యంలో విచార‌ణ చేపట్టి హాస్పిట‌ల్‌ పై త‌‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హ‌క్కుల క‌మిష‌న్‌ను ఆమె కోరారు.

Tags:    

Similar News