అప్పుడే మొదలైన భానుడి భగ భగలు.. ఈసారి ఎండలు మాములుగా ఉండవు!

సాధారణంగా వేసవి కాలం ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమై మే చివరి వరకు ఉంటుంది.

Update: 2025-02-01 05:29 GMT
అప్పుడే మొదలైన భానుడి భగ భగలు.. ఈసారి ఎండలు మాములుగా ఉండవు!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా వేసవి కాలం ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమై మే చివరి వరకు ఉంటుంది. కానీ గత కొన్నేళ్లుగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా మార్చి మొదట్లోనే ఎండలు మండిపోతున్నాయి. అయితే, ఈ ఏడాది ఒక నెల ముందుగానే అంటే.. ఫిబ్రవరి మొదటి వారం నుంచే భానుడు తన ప్రతాపం చూపనున్నాడు. మరో షాకింగ్ వార్త ఏమింటంటే.. సాధారణంగా ఏప్రిల్ మధ్యలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి రెండో వారంలోనే నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

సాధారణం కంటే అధికంగా..

ఈ ఏడాది జనవరి నెల సైతం వేడి, పొడి నెలగా రికార్డులకు ఎక్కినట్లు భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. అలాగే దీర్ఘకాల సగటు (1971-2020) వర్షపాతమైన 22.7 మిల్లీమీటర్లతో పోల్చితే ఫిబ్రవరి నెలలో 81 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. 1901 నుంచి సేకరిస్తున్న సమాచారం ప్రకారం.. 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైన సంగతి తెలిసిందే. ఇక గతేడాది ఉష్ణోగ్రత సగటున 0.65 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ ఏడాది జనవరిలోనూ ఉష్ణోగ్రత సగటున 0.94 డిగ్రీలు పెరిగింది. 1958లో 1.17, 1990లో 0.97 డిగ్రీలు పెరిగాయి. ఆ తర్వాత ఇదే అధికం అని IMD పేర్కొంది. ఈ నేపథ్యంలో 2025 కూడా గత ఏడాది మాదిరిగానే ఎండలు మండిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక, ఫిబ్రవరి 15 వరకు వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్కప్పుడు చల్లగాలులు, మరొక్కప్పుడు వేడిగాలులు వీస్తాయని, ఫిబ్రవరి 15 తర్వాత వేడి తీవ్రత పెరుగుతుందన్నారు. అలాగే వచ్చే వారం నుంచి ఉత్తర, మధ్య, తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాల్లో 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. దక్షిణ, వాయువ్య భారతంలోని కొన్ని మినహా అన్ని ప్రాంతాల్లోనూ వేడి వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోను గత రెండు రోజులుగా ఉక్కపోత ప్రారంభమైంది. దీంతో భానుడి ప్రతాపం నుంచి తప్పించుకోవడం కోసం ప్రజలు ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మధ్య తరగతి వారు కూలర్లు.. ఉన్నోళ్లు ఏసీ షాపులకు క్యూ కడుతున్నారు. మరోవైపు ఇప్పుడే ఇలా ఉంటే.. మార్చి, ఏప్రిల్‌, మేలో ఎండలు ఎలా ఉంటాయోనని జనం జంకుతున్నారు.

Tags:    

Similar News