Sex & Science : తొలి మూడు రాత్రుళ్లు ఆయనతో సజావుగా జరిగింది.. కానీ నన్ను అనుమానిస్తున్నాడు
కలయిక సులువుగా ఎందుకు జరిగింది? రక్తంఎందుకు రాలేదు? కన్నెపొర ఎందుకు లేదు? అని హింసిస్తూ నేను కన్యను కాను అని వదిలేస్తానని బెదిరిస్తున్నాడు.
డాక్టర్.. నా పెళ్లై రెండు నెలలు. పీజీ చేశాను. పత్రికల్లో అన్ని మెడికల్ ఆర్టికల్స్ చదువుతాను. కొద్దిగా బొద్దుగా ఉండటం వల్ల నా బాహుమూలాల్లో, జననాంగాల్లో చెమట, ఫంగస్ రాకుండా షేవ్ చేసుకుంటాను. తొలి మూడు రాత్రుళ్లు ఆయనతో ఏ భయం లేకుండా ఉన్నానని అతను నన్ను అనుమానిస్తున్నాడు. కలయిక సులువుగా ఎందుకు జరిగింది? రక్తంఎందుకు రాలేదు? కన్నెపొర ఎందుకు లేదు? అని హింసిస్తూ నేను కన్యను కాను అని వదిలేస్తానని బెదిరిస్తున్నాడు. చాలా భయంగా, ఆందోళనగా ఉంది. ఎంతో ఖర్చు పెట్టి, అప్పులు చేసి నా తల్లిదండ్రులు నన్ను చదివించి, పెళ్లి చేశారు. వారికి విషయ తెలిస్తే ఎంతో వేదనకు గురి అవుతారు. నేను సైన్స్ స్టూడెంట్‌ను. శృంగారానికి సంబంధించిన శాస్త్రీయ ఙ్ఞానాన్ని ఇంటర్నెట్లో, పత్రికల్లో చదివి తెలుసుకున్నాను. అది తప్పేలా అవుతుంది? ఆయన్ని ఎలా మార్చడం... నా జీవితం మీ పరిష్కారంలో ఉంది. -అనుపమ
99 శాతం అమ్మాయిల్లో ఎగరడం, దూకడం, ఆటలాడడం, బస్సులెక్కడం లాంటి చర్యల్లో ఉల్లిపోరంత పలుచని యోని రంధ్రాన్ని పాక్షికంగా/పూర్తిగా/పొరకు రంధ్రాలతో కప్పి ఉంచే హైమాన్ అనే పొర తొలగి పోతుంది. హైమన్ ఉండి, కలయికలో రక్తస్రావం అయుతేనే కన్య అనుకోవడం మూర్ఖత్వం, అశాస్త్రీయం. హైమెన్ చాలా మందంగా ఉండి కలయిక సాధ్యం కానప్పుడు రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. కన్నె పొర అన్న పేరే స్త్రీలని అవమానించేదిగా ఉంది. శాస్త్రీయ వైద్య భాషలో హైమెన్ అందాము. ఇక సెక్స్ హైజీన్ లేదా శుభ్రత స్త్రీ, పురుషులు ఇద్దరికి చాలా అవసరం. మెన్సస్ సమయంలో స్త్రీలు మరింత పరిశుభ్రంగా ఉండాలి. లేకపోతే స్త్రీ, పురుషులు ఇద్దరికీ జననాంగాల చుట్టూ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సరైన శాస్త్రీయ అవగాహనతో నువ్వు జాగ్రత్తలు తీసుకోవడం అభినందనీయం. దానికే నువ్వేదో పెళ్లికి ముందే సెక్స్ సంబంధాల్లో ఉన్నావని ముద్ర వేయడం మూర్ఖత్వం.
సెక్స్ హార్మోన్ల వలన తొలి రాత్రుళ్లలో పురుషులు లోనైనట్లే, స్రీలు కూడా ఉద్దీపనకు లోనవటం సహజం. దానివల్ల యోనిలో ద్రవాలు స్రవించి యోని ద్వారం వదులై కలయిక సులభంగా జరుగుతుంది. ఇది చాలా సింపుల్ థియరీ. ఆ సమయంలో భర్తకు కూడా లూబ్రికేషన్ జరుగడం వలన కలయిక మరింత సులభంగా జరుగుతుంది. అతను నిన్ను చేస్తున్న అభియోగం ప్రకారం అతనికి కూడా లూబ్రికేషన్ జరగుద్ది. అతనూ సులభంగా అంతా పూర్వం తెలిసినట్లే నీతో సెక్స్ చేయకూడదు కదా. అనవసర సందేహాలు, అభియోగాలు మాని శాస్త్రీయమైన లైంగిక జ్ఞానం పెంచుకోవడం అతనికే మంచిది.
ఇంటర్నెట్ లేని కాలంలో లైంగిక జ్ఞానం ఇంతగా ఉండేది కాదు. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. పురుషుల్లాగే, స్త్రీలు పెళ్లికి ముందు దాంపత్య జీవితంలో ఉండే జ్ఞానాన్ని, సమస్యలను తెలుసుకోవడం చాలా ఉపయోగకరమైనది. అది తప్పు కాదు. శరీరంలోని ఇతర అవయవాల నిర్మాణాన్ని, విధులను ఏ సిగ్గూ, భయాలు లేకుండా తెలుసుకుంటారో.. శృంగార అవయవాల సైన్స్ ని కూడా అలాగే చాలా సహజమైన విషయంగా అర్థం చేసుకోవాలి. ఇప్పటి యువత ప్రీ మారిటల్ & సెక్సువల్ ఎడ్యుకేషన్ వలన వివాహానంతర అత్తమామలతో భర్త, ఆడబిడ్డలతో సఖ్యత.. పరిపక్వతతో నెరపాల్సిన జీవితం పట్ల, శృంగారం , దాంపత్త్యం, శారీరిక శుభ్రత, ప్రత్యుత్పతి హక్కుల పట్ల, గర్భధారణ, ప్రసవం, పిల్లల పెంపకం పట్ల.. మంచి అవగాహనతో ఉంటున్నారు.
అమ్మా.. అనుపమా.. నువ్వు దిగులు పడకు. నీ భర్తను మంచి sexologist వద్దకు తీసుకెళ్లి సెక్సువల్ సైన్సు పట్ల అవగాహన కలిగించండి. సెక్స్ సైన్సుకి సంబంధించిన మాస్టర్స్ & జాన్సన్ పుస్తకాన్ని చదివించు. అయినా మారకుండా అతను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ, అభద్రతా భయాల్లోకి నెడుతుంటే భరించాల్సిన అవసరం లేదు. అమ్మతో ఈ విషయాలు పంచుకోండి. అవసరం కూడా. నీలో నువ్వే, వంటరిగా కృంగిపోకుండా మంచి marital & sexual therapist ని కలువు. నీ భర్త ఎలా నీతో భయం లేకుండా సక్రమంగా సెక్సులో పాల్గొన్నాడో అదే వైద్య జ్ఞానాన్ని స్త్రీగా నువ్వు కూడా కలిగి ఉండడంలో తప్పు లేదు. వివాహపూర్వ లైంగిక జ్ఞానం, వివాహానంతర దాంపత్య జీవితంలో ఏ సమస్యలు రాకుండా, వచ్చినా శాస్త్రీయమైన అవగాహనతో పరిష్కరించుకునే అవగాహనని ఇస్తుంది. అర్థం చేసుకోని భాగస్వామి దొరికితే జీవితం నరకం అవుతుంది. ఇద్దరూ మంచి sexologist ని కలవండి.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్