నేను టెన్త్ క్లాస్ అమ్మాయిని.. తొలిరాత్రే నా భర్త చాలా మోటుగా ప్రవర్తించాడు

మామయ్యకి నేనంటే చాలా ప్రేమ. కానీ, తొలి రాత్రే చాలా మోటుగా ప్రవర్తించాడు. దాంతో చాలా భయం వేసి, సెక్స్‌కు, మామయ్యకు దూరంగా ఉంటున్నాను.

Update: 2024-11-23 11:49 GMT

మేడమ్ ! నా వయసు 20 ఏళ్లు. టెన్త్ అయ్యాక చదువుకుంటానన్నా, డాక్టర్ కావాలనుంది అని ఏడ్చినా వినకుండా చదువాపించి 30 ఏళ్ల మామయ్యతో పెళ్లి చేశారు. మామయ్యకి నేనంటే చాలా ప్రేమ. కానీ, తొలి రాత్రే చాలా మోటుగా ప్రవర్తించాడు. దాంతో చాలా భయం వేసి, సెక్స్‌కు, మామయ్యకు దూరంగా ఉంటున్నాను. మామయ్య నాలుగేళ్లు ఓపిక పట్టి, ఇప్పుడు విడాకులు కావాలంటున్నాడు. అమ్మా వాళ్ళు నా భయాన్ని అర్థం చేసుకోకుండా అతని వద్దకు వెళ్ళిపొమ్మంటున్నారు. నాకు ఇష్టం లేదు. అమ్మనాన్న నన్ను మానసికంగా, శారీరికంగా హింసిస్తున్నారు. నేనేమి చేయాలి. ఆడదానిగా పుట్టటం పెళ్లి పేరుతో ఇంత దుర్మార్గం, హింసా భరించడానికేనా ? మామయ్య సున్నితంగా ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదు. - సులక్షణ, వికారాబాద్

టెన్త్ చదువుతున్న నీ ఆశలూ, ఆశయాలు అసలు పట్టించుకోకుండా, విలువ ఇవ్వకుండా పెళ్లి చేసి వదిలించుకోవాలనుకోవడం అన్యాయం, తప్పు. నీ వయసుకి రెట్టింపు వయసున్న వ్యక్తితో నీకు బాల్య వివాహం చేయడం చట్ట రీత్యా చాలా పెద్దనేరం. 15-16 సంవత్సరాల వయస్సులో శరీర పెరుగుదల, హార్మోన్స్, ఋతుక్రమాలను అర్థం చేసుకునే వయస్సులో లైంగిక అవయవాలు పూర్తిస్థాయిలో పని చేయని దశలో అసలు పెళ్లి, శృంగారం, స్త్రీ-పురుష జననేంద్రియాల పాత్ర ఏంటో తెలీని పసి వయస్సులో, దాంపత్య జీవితం అంటే కూడా ఏమిటో కనీస అవగాహన లేని స్థితిలో ఏకంగా పెళ్లి చేయడం, ఆడపిల్లల తల్లిదండ్రులు నేరం చేస్తున్నట్లే భావించాలి. ఎన్ని చట్టాలు వచ్చినా పట్టించుకోకుండా రహస్యంగానో, ఆడపిల్ల మేజర్ అని అబద్ధం చెప్పి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేసి ఆడపిల్లల గొంతు కోస్తున్నారు. ఆ తరువాత ఆడపిల్లలు భర్తల చేతిలో ఎన్ని లైంగిక హింసలు అనుభవిస్తున్నా ఆదుకోవడానికి కూడా తిరస్కరిస్తున్నారు. ఆడపిల్లను భారంగా భావిస్తూ, వదిలించుకోవాల్సిన వస్తువుగా భావించడమే దీనికి కారణం. నీ విషయంలో మీ మామయ్య మోటు ప్రవర్తన నీకు ఆయనంటే భయాన్ని, సెక్స్ పట్ల అసహ్యాన్ని కలిగించినట్లుగా తెలుస్తున్నది. అది సహజమే. ముందు నువ్వు మీ మామయ్యను సెక్స్ భయం వల్ల మాత్రమే కాదనుకుంటున్నావా? అలా కాకుండా సున్నితంగా, ప్రేమగా ఉంటే అతనితో జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటున్నావా? ఆలోచించుకోవాలి.

ఒక వేళ నువ్వు లేఖలో రాసినట్లు మామయ్య మారితే బాగుండు అని అనుకుంటే, ముందు నువ్వు మీ అమ్మా, నాన్న, మామయ్యలతో కలిసి మంచి సెక్సాలజిస్టు లేదా మారిటల్ థెరపిస్టు దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వెళ్లు. దీని మూలంగా శృంగారం పట్ల నీకున్న వ్యతిరేకతని, భయాన్ని, అపోహలు, అనుమానాలను పోగొట్టే మంచి శాస్త్రీయమైన అవగాహన కలుగుతుంది. నీలో ఉన్న భయం, శృంగార వ్యతిరేకత తగ్గడానికి కౌన్సిలింగ్, సైకోథెరపీ అవసరం. మీ మామయ్యలో నీతో మోటుగా కాకుండా సున్నితంగా ఎలా వ్యవహరించాలో ఎడ్యుకేట్ చేస్తారు. స్త్రీల దేహాలను వాళ్ళ ఇష్టాయిష్టాలతో , వ్యక్తిత్వాలతో, మనసుతో, బాధ, అవమానం, దుఃఖాలతో సంబంధం లేకుండా, కేవలం లైంగిక వస్తువులుగా మాత్రమే భావిస్తూ, ఆమెను ఏమైనా ఎలాగైనా చేసుకోవచ్చు. ఆమె శరీరంపై తమకే పూర్తి అధికారం ఉంది. భార్య అన్నీ భరిస్తూ మౌనంగా తమకు సహకరించి తీరాలి, తిరస్కరించకూడదు అనే పురుషుడిలో అహంకారం, ఆధిపత్యం నింపే పితృస్వామ్య భావజాలం వల్లనే, స్త్రీల పట్ల సమాజంలో, కుటుంబంలో ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయి. మీ మామయ్యలో, అదే భావజాలముండే మీ అమ్మా నాన్నలో, మీ అత్తా మామల్లో స్త్రీలను బలి పశువులుగా మార్చే బాధిపత్య భావజాలం పోవాలి. ఎన్ని సమస్యలున్నా చదువు మాత్రం ఆపకు.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Tags:    

Similar News