రొమ్ముల్లోంచి పాలలాంటి ద్రవం వస్తోంది.. క్యాన్సరేమోనని భయంగా ఉంది

నా వయసు 34. పెళ్లై పదేళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. ఇరవై రోజులనుంచీ రొమ్ముల్లోంచి పాలలాంటి ద్రవం వస్తోంది. ఈ వయసులో ఇలా ఎందుకవుతోంది?

Update: 2024-10-22 12:14 GMT

నా వయసు 34. పెళ్లై పదేళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. ఇరవై రోజులనుంచీ రొమ్ముల్లోంచి పాలలాంటి ద్రవం వస్తోంది. ఈ వయసులో ఇలా ఎందుకవుతోంది?

నా వయసు 40. పెళ్లై పద్నాలుగేళ్లు, ముగ్గురు పిల్లలున్నారు. నాకు ఎడమ రొమ్ములోంచి చిక్కని ద్రవంలాంటిది కారుతోంది. రొమ్ము నొప్పిగాను, మంటగాను ఉంటోంది. క్యాన్సరేమోనని భయంగా ఉంది. ఏం చేయాలి?

సమస్య ఇటీవల బాగా ఎక్కువవుతోంది. రొమ్ముల్లోంచి ఈ రకమైన ద్రవం రావడమనేది యాదృచ్ఛికంగానో, లేక చేతితో నొక్కినప్పుడో బయటపడుతూ ఉంటుంది. ఇలా రోజూ జరగవచ్చు లేదా అప్పుడప్పుడూ కనిపించవచ్చు. రెండు వైపులా ఉండవచ్చు, కొన్నిసార్లు ఒక రొమ్ములోనే ఉండవచ్చు. ముఖ్యంగా వయసు పెరిగిన స్త్రీలు, పెళ్లై పిల్లలున్న స్త్రీలలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పెళ్లికాని స్త్రీలు, రుతుక్రమం సక్రమంగా అయ్యే స్త్రీలలో ఈ సమస్య చాలా తక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా పెళ్లై పిల్లలున్న నడి వయసు స్త్రీలలో రొమ్ముల్లోని చురుకుగా లేని పాలగ్రంథుల నుంచి చిక్కని బూడిదరంగు ఎపిథీలియల్ డెబ్రిస్ స్రవిస్తుంది. అలాగే గర్భధారణ చివరి వారాల్లో పసుపురంగులోని కొలస్ట్రమ్ కనిపిస్తుంది. సాధారణంగా ఈ స్థితికి వినాళగ్రంథుల వ్యాధులు, క్యాన్సర్, కొన్ని రకాల మందులతోపాటు రొమ్ముల్లోని ల్యాక్టిఫెరస్ నాళాలు మూసుకుపోవడం కారణం కావచ్చు. అయితే రొమ్ముల్లోంచి ద్రవం రావడాన్ని అంత తేలిగ్గా తీసి పడేయ కూడదు. ముఖ్యంగా నడివయసు స్త్రీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఎలాంటి పరీక్షలు చేయాలి?

ఈ సమస్య ఎప్పుడు మొదలైంది, ఎంత సమయం స్రవించడం జరుగుతుంది. ద్రవం చిక్కగా ఉందా, పలుచగా ఉందా? వాసన వేస్తుందా? దానంతట అదే ప్రవిస్తుందా లేక ఒత్తిడి కలిగించడం వలన వెలువడుతోందా? “నొప్పి, ముట్టుకున్నంతనే మంట, దురద, వెచ్చగా ఉండడం, రొమ్ము చివర్ల (చనుమొనలు)లో మార్పులు, రొమ్ముల్లో గడ్డలుండడం.. ఒకవేళ గడ్డలుంటే అవి ఎప్పట్నుంచి ఉన్నాయి? వాటి సైజు ఎంత ఉంది? ఈ సమస్యతోపాటు నీరసం, జ్వరం లాంటి లక్షణాలు కూడా ఉన్నాయా? నెలసరి ముందు లేక రుతుస్రావం అయ్యేటప్పుడు రొమ్ముల్లో మంటతో కూడిన నొప్పి, వాపు, చిరాకు, ఉద్రేకం, తలనొప్పి, కడుపులో నొప్పి, వికారం, విరేచనాలు వంటివి కూడా ఉన్నాయా?

ఆమె పిల్లలకు ఎంతకాలం పాలిచ్చింది? బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? గతంలో కుటుంబంలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందా? రోగికే ఇంతకు ముందు ఏమైనా క్యాన్సర్లు వచ్చి తగ్గాయా? రోగి అవివాహితా లేక వివాహితా? వివాహిత అయితే గర్భం మరీ ఆలస్యంగా వచ్చిందా? నెలసరి చిన్నవయసులోనే మొదలైందా? వీటితోపాటు లేట్ మెనోపాజ్ అంశాన్ని కూడా గమనించాలి. రోగి హార్మోనల్ కాంట్రసెప్టివ్ లేక హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకుంటోందా? హై బీపీకి మందులు వాడుతోందా లేక సైకోట్రోఫిక్ డ్రగ్స్ ఏమైనా వాడుతోందా అని గమనించాలి. అన్నిటికంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ ముఖ్యమైనది. ఈ తరహా ఎగ్జామినేషన్ నాలుగు భంగిమల్లో ఉంటుంది.

1. చేతులు శరీరానికి సమాంతరంగా ఉంటుంది.

2. రెండు చేతులూ తలకింద పెట్టే స్థితి.

3. రెండు చేతులను నడుం పక్కలకు ఒత్తుతూ పెట్టే స్థితి.

4. ఛాతీ భాగాన్ని ముందుకు వంచడం.

ఈ నాలుగు భంగిమల్లో రొమ్ములు, చనుమొనల్ని, వాటి స్థానాల్ని పరీక్షించాలి. చనుమొనలు పక్కకు అయినట్లు అవడం, చదునుగా మారడం, సమానంగా లేక పోవడం, మందబారడం, పగుళ్లు ఏర్పడడం, పుండులాగా ఏర్పడటం లాంటివి ఏమైనా ఉన్నాయేమో గమనించాలి. అలాగే రొమ్ములు సరియైన స్థానాల్లో ఉన్నాయో లేదో చూడాలి. ముఖ్యంగా కౌంటర్ను గమనించాలి. చనుమొనల చుట్టూ ఉండే నల్లని భాగంలో ఏదైనా మార్పు వచ్చిందేమో చూడాలి. కణితిలాంటిదేమైనా ఉంటే అది కదులుతోందా లేక ఒక చోటే చర్మానికి అంటుకు పోయిందో పరీక్షించాలి. చర్మం మంద బారిందేమో చూడాలి. నిజానికి ఈ పరీక్షలను ఎవరికి వారు చేసుకోవచ్చు. మొదట్నుంచీ ఎప్పటికప్పుడు ఇలాంటి పరీక్షలు చేసుకుంటే సమస్యను మొదట్లోనే గుర్తించి పరిష్కరించుకోవచ్చు.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Tags:    

Similar News

Mr. మొహ‌మాటం.!