నాకు, బీజేపీకి ఢోకా లేదు.. కిషన్ రెడ్డి ధీమా

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్ని తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేసినా తనకు, బీజేపీకి ఎలాంటి ఢోకా లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Update: 2024-05-09 16:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్ని తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేసినా తనకు, బీజేపీకి ఎలాంటి ఢోకా లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్పీ స్టేడియంలో శుక్రవారం ప్రధాని మోడీ సభ నేపథ్యంలో గురువారం ఆయన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో కలిసి సభా స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల జిమ్మిక్కులు చేస్తూ బట్టకాల్చి మొహం మీద పడేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. గాడిద గుడ్డు ప్రచారం కాంగ్రెస్‌కే పరిమితమవుతుందని, తెలంగాణ ప్రజలెవరూ దాన్ని పట్టించుకోవడం లేదని చురకలంటించారు.

హైకమాండ్ ఆదేశాలతో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలను కలిశామన్నారు. కాంగ్రెస్‌కు విమర్శించడానికి ఏమీలేకనే దుష్ప్రచారాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. రిజర్వేషన్ల అంశంపైనా కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేసిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలను ఏ ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. రిజర్వేషన్ల అంశంపై డైరెక్ట్ చేసిన రాహుల్ గాంధీ సినిమా ఫ్లాప్ అయిందన్నారు. కాంగ్రెస్.. సెకండ్, థర్డ్ ప్లేస్ వస్తుందని భావించి.. రేవంత్ రిజర్వేషన్ల అంశాన్ని ప్రచారం చేస్తున్నారన్నారు. ఇకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను ప్రజలు ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని, నవ్వుకుంటున్నారని కిషన్ రెడ్డి చురకలంటించారు.

Tags:    

Similar News