CM రేవంత్ రెడ్డి భాషపై కేసీఆర్ అభ్యంతరం.. ఏమన్నారంటే?

తాను ముఖ్యమంత్రిగా పదేళ్ల కాలంలో ఏనాడూ దురుసుగా మాట్లాడలేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

Update: 2024-03-12 14:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: తాను ముఖ్యమంత్రిగా పదేళ్ల కాలంలో ఏనాడూ దురుసుగా మాట్లాడలేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తాను తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు రాష్ట్రం వస్తుందని ఎవరూ నమ్మలేదని అన్నారు. నాతో పాటు కొందరు మాత్రమే నన్ను నమ్మి పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసని వెల్లడించారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించాక.. ఇప్పుడు అందరూ గొప్పలకు పోతున్నారని ఆవేదన చెందారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసినా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయి కాంగ్రెస్‌కు ఓటేశారని అన్నారు. హామీలు అమలు గురించి మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. నేను పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని.. కానీ, ఏనాడూ ఇలాంటి పదజాలం వాడలేదని అన్నారు.

బీఆర్ఎస్ కంటే గొప్పగా పనిచేసి ప్రజల మనసులు గెలుచుకోవాలి కానీ.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు అని హితవు పలికారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని గుర్తుచేశారు. ఏనాడూ దాటవేసే ధోరణి కనబర్చలేదని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతుబంధు ఆపలేదు, దళితబంధు ఆపలేదు, రైతులకు నీళ్లివ్వడం ఆపలేదు, ఫించన్లు ఇవ్వడం ఆపలేదు, కరెంట్ ఇవ్వడం ఆపలేదు అని అన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. నమ్మి ఓటు వేస్తే మరోసారి కాంగ్రెస్ తన వక్రబుద్ధి చూపించిందని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి వాడే భాష అందరినీ మెప్పించాలని సూచించారు. ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని.. మాకేం ఈర్ష లేదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లు ఏనాడూ బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చేసింది కూడా శూన్యమని తెలిపారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదని అన్నారు. అసలు ఎందుకు బీజేపీకి ఓటు వేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News