కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్స్‌పై డీకే అరుణ హాట్ కామెంట్స్
వ్యక్తిగత ఆరోపణలు కాదు.. దమ్ముంటే జిల్లాను అభివృద్ధి చేసి చూపించండి. చేసిన అభివృద్ధిని చెప్పండి.
దిశ, మక్తల్ : వ్యక్తిగత ఆరోపణలు కాదు.. దమ్ముంటే జిల్లాను అభివృద్ధి చేసి చూపించండి. చేసిన అభివృద్ధిని చెప్పండి. అంతేకానీ ఆడపడుచు అని చూడకుండా ఇంగింతజ్ఞానం లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడటం భావ్యం కాదని పాలమూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఫైర్ అయ్యారు. గురువారం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్ పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులకు చేసిన అభివృద్ధి గురించి చెప్పుకునే అవకాశం లేకనే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులకు అమ్మ, అక్క, చెల్లి లేరా అని డీకే అరుణ ప్రశ్నించారు.
ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అభ్యర్థి అయినా రేపు గెలిస్తే ఏం అభివృద్ధి చేస్తారో చెప్పుకుంటారని కానీ, కాంగ్రెస్ నాయకులకు ఏం చేయబోతున్నారో, ఏం చేశామో చెప్పుకునే అవకాశం లేకనే తనపై నోటికొచ్చినట్లు దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇంత దిగజారుడు తనాన్ని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆమె ఫైర్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాలో తాను చేసిన అభివృద్ధి తప్ప పదేళ్ల బీఆర్ఎస్, ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు.
దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, పాలమూరు అభివృద్ధి కోసం తనను ఎంపీగా గెలిపించాల్సిందిగా డీకే అరుణమ్మ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ బాల్చేడ్ పావని మల్లికార్జున్, వైస్ చైర్పర్సన్ బి.అఖిల రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు చీరాల సత్యనారాయణ, కర్ని లక్ష్మీస్వామి, ఈసారి కౌసల్య నాగప్ప, కోల్పూర్ కొండయ్య, నాయకులు కర్ని స్వామి, దేవరింటి నరసింహారెడ్డి, బి.రాజశేఖర్ రెడ్డి, చిట్యాల లక్ష్మణ్, జి. బలరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు