మాట నిలబెట్టుకున్న CM రేవంత్.. ఆ విషయంలో ఫుల్ సక్సెస్
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ సవాల్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న చేవెళ్ల సభలో సీఎం బీఆర్ఎస్ పార్టీని ఒక్క సీటు కూడా గెలువ నివ్వనని శపథం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ సవాల్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న చేవెళ్ల సభలో సీఎం బీఆర్ఎస్ పార్టీని ఒక్క సీటు కూడా గెలువ నివ్వనని శపథం చేశారు. ‘సొల్లువాగుడు వాగే కేటీఆర్‌కు నేను సవాల్ విసురుతున్నా... నేనే ముఖ్యమంత్రిని... నేనే పీసీసీ ప్రెసిడెంట్‌ను... రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాల్ విసురుతున్న... చేతనైతే... నీకు దమ్ముంటే.. నువ్వు మొగోడివైతే... ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించూ... నీ అయ్యా.. నువ్వు వస్తావా? నీ అయ్యవస్తాడా? మా కార్యకర్తలు చూసుకుంటారు... బిడ్డా’ అని సవాల్ చేశారు. సభా వేదికపై అన్నట్లుగానే పంతం నెగ్గించుకున్నారు. ఏ పార్లమెంట్ స్థానంలోనూ విజయం సాధించకుండా అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలను సైతం డిఫెన్స్‌లోకి నెట్టివేయడంలో సక్సెస్ అయ్యారు.
జీరో స్థానానికే కట్టడి...
బీఆర్ఎస్ పాలనలో చేసిన తప్పులను ఎత్తిచూపడంలో రేవంత్ ప్రభుత్వం సక్సెస్ అయిందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ ఇలా ప్రతి రంగంలోనూ అవినీతికి పాల్పడిందని, వాటన్నింటిని బయటకు తీస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అన్నట్లుగానే ప్రతి అంశంపై ఫోకస్ పెట్టి విస్తృత ప్రచారం చేపట్టారు. సభలు, సమావేశాల్లోనూ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. సోషల్ మీడియాలోనూ ప్రచారం చేపట్టడంతోపాటు కేడర్‌నూ ఎప్పకటిప్పుడు సన్నద్ధం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ గతంకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో పాటు బీఆర్ఎస్‌ను కట్టడి చేశారు. జీరో స్థానానికి పరిమితం చేసి ఉనికిని ప్రశ్నార్థకంగా చేయడంలో సీఎం సక్సెస్ అయ్యారని, సవాల్‌ను అచరణలో పెట్టారని ఎన్నికల ఫలితాలే స్పష్టం చేస్తున్నాయి.