స్వాతంత్ర దినోత్సవ వేళ.. భారత్ ఎంచుకున్న లక్ష్యాలివే..!

భారతదేశం స్వాతంత్రం సాధించి ఈ అగస్టు 15తో 76 వసంతాలు పూర్తి చేసుకోనుంది.

Update: 2023-08-08 05:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం స్వాతంత్రం సాధించి ఈ అగస్టు 15తో 76 వసంతాలు పూర్తి చేసుకోనుంది. అభివృద్ధి చెందే దేశం దిశగా భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే భారత్ అనేక రంగాల్లో ప్రతిభ చాటుతూ ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ప్రపంచ మొత్తం కరోనాతో వణికి పోతున్న వేళ కరోనా వ్యాక్సిన్ మన దేశంలోనే తయారై విశ్వవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అయింది. దీంతో వైద్య రంగంలో మన సత్తా ఏంటో ప్రపంచానికి చాటినట్లు అయింది. విపత్తు వస్తే ప్రపంచ దేశాలు భారత్ వైపు చేసేలా మన వైద్య రంగ శాస్త్రవేత్తలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ విశ్వ వ్యాప్తంగా మన్ననలు పొందింది.

స్పేస్ రంగంలో ఇలా..

స్పేస్ టెక్నాలజీలో భారత్ కొత్త ఆవిష్కరణలతో తుఫాన్‌ను సృష్టిస్తోంది. ఇటీవలే చంద్రయాన్ - 3 ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. చంద్రుడి ఉపరితంపైకి ఈ హ్యోమ నౌక ఈనెల 23న దిగనుంది. తద్వారా అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సాధిస్తున్న ప్రగతికి ఈ తాజా పరిశోధన నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.

మన శాస్త్రవేత్తల అద్భుతమైన విజయాలకు చంద్రయాన్ - 3 నిదర్శనంలా మారింది. అంతరిక్షపై అధ్యయనం విషయంలో భారత్ తన ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉంది. సాంకేతిక పురోగతి, స్థిరమైన అభివృద్ధి, సామాజిక పురోగతి వంటి అంశాలతో ప్రపంచ నాయకత్వం వైపు భారత్ అడుగులు వేస్తోంది. భవిష్యత్ లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటి అందుకోవడమే లక్ష్యంగా భారత్ దూసుకెళ్తోంది.

యజ్ఞంలా గ్రీన్ ఇనిషియేటివ్..

పర్యావరణంలో జరుగుతున్న పెను మార్పులను దృష్టిలో ఉంచుకుని భారత్ గ్రీన్ ఇనిషియేటివ్‌ను ఓ యజ్ఞంలా ముందుకు సాగిస్తోంది. కర్బన ఉద్గారాలను తగ్గించి హరిత భారతావని దిశగా చర్యలు చేపట్టింది. పర్యావరణ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. గ్రీన్ హౌస్, వాయు ఉద్గారాలను తగ్గించడం, గ్రీన్ టెక్నాలజీని పెంచే దిశంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది.

డిజిటల్ విప్లవంలో పవర్ హౌస్...

డిజిటల్ విప్లవంలో ప్రపంచ వ్యాప్తంగా మన స్థానాన్ని నిలబెట్టుకోవడంలో భాగంగా ఆవిష్కరణలకు పవర్ హౌస్‌లా మారాలని భారత్ భావిస్తోంది. కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతికలతో పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వర్క్ ఫోర్స్ ఉత్పాదకతే లక్ష్యంగా విద్యావ్యవస్థను మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తోంది.

పేదరిక నిర్మూలన ఇలా..

దేశ అభివృద్ధి, అనేక రంగాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతున్నా పేదరిక నిర్మూలన దేశానికి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆదాయ అసమానతల విషయంలో సమ్మిళిత అభివృద్ధి టార్గెట్ పెట్టుకుని ముందుకు సాగుతోంది. ఆదాయం విషయంలో ఉన్న అసమానతలను దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాల వారికి విద్యను అందిస్తేనే లక్ష్యం నెరవేరుతుందని భారత్ భావిస్తోంది. అట్టడుగు వర్గాల సాధికరత కు సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేస్తోంది.


Similar News