భారత స్వాతంత్రోద్యమం.. కీలక ఘట్టాలివే..!
స్వాతంత్రోద్యమ ఘట్టంలో అనేక వీరోచిత పోరాటాలు ఇప్పటికి మనలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి.
దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్రోద్యమ ఘట్టంలో అనేక వీరోచిత పోరాటాలు ఇప్పటికి మనలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి. 1857 నుంచి 1947 వరకు బ్రిటిష్ పాలకుల చెరలో భారతదేశం బందీగా ఉంది. అయితే ఎంతో మంది త్యాగాలు, పోరాటాల ఫలితంగా మనకు స్వాతంత్రం సిద్ధించింది. సిద్ధాంతాలు వేరైనా గమ్యం ఒకటే అని స్వాతంత్రమే లక్ష్యంగా సాగిన అలుపెరగని పోరాటం నేటి తరానికి చైతన్య దీపికగా మారింది.
అతివాదులైన లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ విదేశీ వస్తు బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించారు. అరబిందో వంటి వారు తీవ్ర వాద మార్గాలను పాటించారు. జాతీయోధ్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్ మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాలలో ఉద్యమించింది. సుభాష్ చంద్రబోస్ ‘సాయుధ సంగ్రామమే’ సరైన మార్గమని భావించారు. నేతాజీ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ పేరుతో భారత జాతీయ సైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుంచి పోరాటం సాగించారు. భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది.
ఇలాంటి అనేక పోరాటాల ఫలితంగా ఆనాటి అవిభక్త భారతదేశంలోని దేశాలు స్వాతంత్ర్యం పొందాయి. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్య దేశంగా ఆవిర్భవించింది. అయితే 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అప్పటి వరకు భారతదేశం బ్రిటిష్ పాక్షిక పాలనలో కొనసాగింది. తదనంతరం భారతదేశం సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది.