మళ్లీ సీఎస్కే పగ్గాలు చేపట్టబోతున్న ధోనీ.. ఎందుకో తెలుసా?
వరుసగా రెండు పరాజయాలతో డీలా పడిన చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు మరో షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి.
దిశ, స్పోర్ట్స్ : వరుసగా రెండు పరాజయాలతో డీలా పడిన చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు మరో షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. శనివారం ఢిల్లీతో చెన్నయ్ తలపడనుంది. ఆ మ్యాచ్‌కు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. రాజస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో గైక్వాడ్ మోచేతికి గాయమైంది. గాయంతోనే బ్యాటింగ్ చేసిన అతను హాఫ్ సెంచరీతో మెరిశాడు. జట్టును గెలిపించడానికి పోరాడినా ఫలితం దక్కలేదు.
అయితే, మోచేతి గాయం నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆ మ్యాచ్ తర్వాత రెండు రోజులు ట్రైనింగ్‌లో పాల్గొనలేదు. దీంతో ఢిల్లీతో మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ కూడా పూర్తిస్పష్టత ఇవ్వలేదు. మ్యాచ్ రోజే నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. ‘ఈ రోజు ట్రైనింగ్‌లో పాల్గొన్నాడు. కానీ, కొంచెం నొప్పి ఉంది. రోజురోజుకూ మెరుగవుతున్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌కు బాగానే ఉంటాడని ఆశిస్తున్నాం.’ అని హస్సీ చెప్పుకొచ్చాడు. ఒకవేళ గైక్వాడ్ దూరమైతే మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. గతేడాది టోర్నీ ప్రారంభానికి ముందు ధోనీ సీఎస్కే కెప్టెన్‌గా తప్పుకున్న విషయం తెలిసిందే.