ఆ కోచ్ నన్ను గ్రౌండ్‌లోకి రానివ్వలేదు.. సంచలన విషయం బయటపెట్టిన అశుతోష్ శర్మ
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అశుతోష్ శర్మ సంచలన విషయం బయటపెట్టాడు.
దిశ, స్పోర్ట్స్ : 2020-22 సీజన్‌లో ఓ కోచ్ వల్ల తాను చాలా కుంగుబాటుకు గురయ్యానని పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అశుతోష్ శర్మ సంచలన విషయం బయటపెట్టాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన అశుతోష్ గుజరాత్ టైటాన్స్‌పై ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అతను 17 బంతుల్లో 31 పరుగులు చేసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తాజాగా ఓ జాతీయ మీడియాతో అశుతోష్ మాట్లాడుతూ.. ‘నేను జిమ్‌కు వెళ్లి నా హోటల్ రూంకు వచ్చాను. నన్ను జట్టు నుంచి తప్పించారని తెలిసింది. నేను చాలా కృంగిపోయాను. నా తప్పేంటో ఎవరూ నాకు చెప్పలేదు. మధ్యప్రదేశ్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ వచ్చారు. అతనికి జట్టులోని కొందరిపై నమ్మకమెక్కువ. మరికొందరు నచ్చలేదు. సన్నాహక మ్యాచ్‌లో 45 బంతుల్లో 90 పరుగులు చేశా. నన్ను జట్టు నుంచి తప్పించారు. గత సీజన్‌లో ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆరు మ్యాచ్‌ల్లో మూడు అర్ధ శతకాలు బాదాను. నన్ను గ్రౌండ్‌లోకి కూడా అనుమతించలేదు. అప్పుడు చాలా కుంగుబాటుకు గురయ్యా.’ అని అశుతోష్ తెలిపాడు.
2019లో మధ్యప్రదేశ్‌కు చివరిసారిగా ఆడిన అతను.. గతేడాది నుంచి రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే, ఆ కోచ్ పేరును అశుతోష్ రివీల్ చేయలేదు. కానీ, ఆ కోచ్ చంద్రకాంత్ పండిత్ అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. పండిత్ ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.