కోహ్లీ, డుప్లెసిస్ నెలకొల్పిన రికార్డులు ఇవే

గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పలు రికార్డులను నెలకొల్పారు.

Update: 2024-05-04 20:08 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎలాగైనా నాకౌట్ బెర్త్‌ను సాధించాలనే పంతంతో ఉన్నది. వరుస విజయాలతో దూకుడు కనబరుస్తున్నది. శనివారం గుజరాత్‌పై విజయంతో ఆ జట్టు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పలు రికార్డులను నెలకొల్పారు. ఏవేంటో చూద్దాం..

రికార్డుల రారాజుగా పేరొందిన కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 12,500 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో విరాట్ 27 బంతుల్లో 42 పరుగులు చేయడంతో ఈ ఫీట్ సాధించాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. 387 టీ20 మ్యాచ్‌ల్లో విరాట్ 12,536 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అతను 4వ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ 14, 562 పరుగులతో ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. భారత క్రికెటర్లలో కోహ్లీ తర్వాతి స్థానంలో రోహిత్(11,482 పరుగులు) ఉన్నాడు. ఐపీఎల్‌లో 7,805 పరుగులతో కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

డుప్లెసిస్ కూడా తన పేరిట అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఆర్సీబీ తరపున పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. గుజరాత్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన అతను 23 బంతుల్లో 64 పరుగులు చేశాడు. 278.26 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఇంతకుముందు పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ఆర్సీబీ బ్యాటర్ రికార్డు ఆ జట్టు మాజీ ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉండేది. 2012, 2013లో పుణే వారియర్స్ ఇండియా జట్టుపై రెండు సందర్భాల్లో గేల్ 50 పరుగులు చేశాడు. 2015లో పంజాబ్ కింగ్స్‌పై కూడా 50 పరుగులు చేశాడు. తాజాగా ఆ రికార్డును డుప్లెసిస్ బద్దలుకొట్టాడు. 

Tags:    

Similar News