ఓపెనింగ్ మ్యాచ్‌లో విరాట్ సాధించిన రికార్డులివే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది.
దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. పురుషుల టీ20 క్రికెట్‌లో 12 వేల పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్-2024లో చెన్నయ్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో విరాట్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 21 పరుగులు చేసిన అతను మొత్తంగా 12,015 రన్స్ చేశాడు. 432 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డు నెలకొల్పిన కోహ్లీ.. వేగవంతంగా ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. వేగవంతంగా 12 వేలు పరుగులు చేసిన రికార్డు ఇంగ్లాండ్ బ్యాటర్ అలెక్స్ హేల్స్ పేరిట ఉంది. అతను 432 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని సాధించాడు.
అంతేకాకుండా, పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లీ 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్(14,562) అగ్రస్థానంలో ఉండగా.. షోయబ్ మాలిక్(13,360), కీరన్ పొలార్డ్(12,900), అలెక్స్ హేల్స్(12,319), డేవిడ్ వార్నర్(12,065) టాప్-5లో ఉన్నారు.
అలాగే, ఈ మ్యాచ్‌లో విరాట్ మరో ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్‌లో చెన్నయ్‌పై 1000 పరుగులు నమోదు చేశాడు. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోహ్లీ ఈ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఓ జట్టుపై 1,000 పరుగులు చేసిన జాబితాలో కోహ్లీతోపాటు డేవిడ్ వార్నర్(పంజాబ్, కోల్‌కతా జట్లపై), శిఖర్ ధావన్(చెన్నయ్‌పై), రోహిత్ శర్మ(కోల్‌కతాపై) ఉన్నారు.