ఆఖరి బంతికి భువీ అద్భుతం.. హైదరాబాద్ గెలుపు
సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. వరుసగా రెండు పరాజయాలతో వెనుకబడిన ఎస్‌ఆర్‌హెచ్ గెలుపుబాట పట్టింది.
దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. వరుసగా రెండు పరాజయాలతో వెనుకబడిన ఎస్‌ఆర్‌హెచ్ గెలుపుబాట పట్టింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 201/3 స్కోరు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి(76, 42 బంతుల్లో 3 పోర్లు, 8 సిక్స్‌లు) మరోసారి రెచ్చిపోయాడు. అతనికితోడు ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(42, 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) సత్తాచాటారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. రాజస్థాన్ 200/7 స్కోరుకే పరిమితమైంది. దీంతో రియాన్ పరాగ్(77), యశస్వి జైశ్వాల్(67) పోరాటం వృథా అయ్యింది. భువనేశ్వర్(3/41) రాజస్థాన్ ఓటమిని శాసించగా.. కమిన్స్(2/34), నటరాజన్(2/35) సత్తాచాటారు. ఈ విజయంతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. మరోవైపు, రాజస్థాన్‌కు ఇది రెండో ఓటమి. 16 పాయింట్లతో ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది.
డెత్ ఓవర్లలో రాజస్థాన్ బోల్తా
ఛేదనకు దిగిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే భారీ షాకిచ్చాడు భువనేశ్వర్. తొలి ఓవర్‌లోనే బట్లర్(0), శాంసన్(0)లను డకౌట్ చేశాడు. ఈ దెబ్బతో రాజస్థాన్ తడబడగా.. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్, రియాన్ పరాగ్ కలిసి జట్టును ఆదుకున్నారు. ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. మూడో వికెట్‌కు ఈ జోడీ ఏకంగా 134 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. క్రీజులో పాతుకపోయిన వీరు ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ లక్ష్యాన్ని కరిగించారు. ఈ క్రమంలో 30 బంతుల్లో జైశ్వాల్, 31 బంతుల్లో రియాన్ పరాగ్ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. 13 ఓవర్లలో రాజస్థాన్ 132/2తో నిలిచి విజయానికి బాటలు వేసుకుంది. ఈ పరిస్థితుల్లో జైశ్వాల్(67)ను నటరాజన్ బౌల్డ్ చేసి ఈ జోడీని విడదీశాడు. కాసేపటికే కమిన్స్ బౌలింగ్‌లో రియాన్ పరాగ్(77) వెనుదిరగడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. హైదరాబాద్ బౌలర్లు బలంగా పుంజుకున్నారు. డెత్ ఓవర్లలో రాజస్థాన్ కట్టడి చేశారు. ముఖ్యంగా 18వ ఓవర్ హెట్మేయర్(13)ను నటరాజన్, 19వ ఓవర్‌లో ధ్రువ్ జురెల్(1)ను కమిన్స్ అవుట్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇక, చివరి ఓవర్‌లో రాజస్థాన్ 13 పరుగులు చేయాల్సి ఉండగా భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఐదు బంతుల్లో 11 రన్స్ రాగా.. భువీ ఆఖరి బంతికి పొవెల్(27)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని హైదరాబాద్‌కు విజయాన్ని కట్టబెట్టాడు.
మెరిసిన నితీశ్ రెడ్డి
అభిషేక్ శర్మ(12), అన్మోల్‌ప్రీత్ సింగ్(5) నిరాశపర్చడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ మొదట్లో తడబడింది. అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అభిషేక్ వికెట్ పారేసుకోగా.. ఆ తర్వాతి ఓవర్‌లోనే అన్మోల్‌ప్రీత్ క్యాచ్ అవుటయ్యాడు. దీంతో 35 పరుగులకే హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా డిఫెన్స్‌కే పరిమితమవడంతో పవర్ ప్లేలో ఎస్‌ఆర్‌హెచ్ 37/2 స్కోరుతో నిలిచింది. ఈ సమయంలో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. హెడ్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. అప్పటివరకు నిదానంగా ఆడిన హెడ్ కూడా చాహల్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 4తో హెడ్ గేర్ మార్చాడు. మరోవైపు, అశ్విన్ బౌలింగ్‌లో సిక్సర్‌తో దూకుడు మొదలుపెట్టిన నితీశ్ రెడ్డి.. చాహల్ బౌలింగ్‌లో 21 పరుగులు పిండుకున్నాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించడంతో హైదరాబాద్ 14వ ఓవర్లలో 123/2 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే, హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కాసేపటికే హెడ్(58)ను అవేశ్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే నితీశ్ రెడ్డి 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం మరింత రెచ్చిపోయిన అతను అశ్విన్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్ కొట్టాడు. మరోవైపు, క్లాసెన్ సైతం బ్యాటు ఝుళిపించాడు. డెత్ ఓవర్లలో మెరుపులు మెరిపించాడు. ఈ జోడీ ఆఖరి ఐదు ఓవర్లలో 70 పరుగులు రాబట్టడంతో హైదరాబాద్ 200 పరుగుల మార్క్‌ను అందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 2 వికెట్లు, సందీప్ శర్మ ఒక్క వికెట్ పడగొట్టారు.
స్కోరుబోర్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 201/3(20 ఓవర్లు)
హెడ్(బి)అవేశ్ ఖాన్ 58, అభిషేశ్ వర్మ(సి)ధ్రువ్ జురెల్(బి)అవేశ్ ఖాన్ 12, అన్మోల్‌ప్రీత్ సింగ్(సి)యశస్వి జైశ్వాల్(బి)సందీప్ శర్మ 5, నితీశ్ రెడ్డి 76 నాటౌట్, క్లాసెన్ 42 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 8.
వికెట్ల పతనం : 25-1, 35-2, 131-3
బౌలింగ్ : బౌల్ట్(4-0-33-0), అశ్విన్(4-0-36-0), అవేశ్ ఖాన్(4-0-39-2), సందీప్ శర్మ(4-0-31-1), చాహల్(4-0-62-0)
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 200/7(20 ఓవర్లు)
జైశ్వాల్(బి)నటరాజన్ 67, బట్లర్(సి)మార్కో జాన్సెన్(బి)భువనేశ్వర్ 0, శాంసన్(బి)భువనేశ్వర్ 0, రియాన్ పరాగ్(సి)మార్కో జాన్సెన్(బి)కమిన్స్ 77, హెట్మేయర్(సి)మార్కో జాన్సెన్(బి)నటరాజన్ 13, రోవ్‌మన్ పొవెల్ ఎల్బీడబ్ల్యూ(బి)భువనేశ్వర్ 27, ధ్రువ్ జురెల్(సి)అభిషేక్(బి)కమిన్స్ 1, అశ్విన్ 2 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 13.
వికెట్ల పతనం : 1-1, 1-2, 135-3, 159-4, 181-5, 182-6, 200-7
బౌలింగ్ : భువనేశ్వర్(4-0-41-3), మార్కో జాన్సెన్(4-0-44-0), కమిన్స్(4-0-34-2), నటరాజన్(4-0-35-2), జయదేవ్ ఉనద్కత్(2-0-23-0), నితీశ్ రెడ్డి(1-0-12-0), షాబాజ్ అహ్మద్(1-0-11-0)