స్పిన్నర్ల పరిస్థితి ఏంటి?..ఐపీఎల్‌లో రెండు బౌన్సర్ల రూల్‌పై సౌతాఫ్రికా స్పిన్నర్ ట్వీట్

ఐపీఎల్-17లో ఓవర్‌కు రెండు బౌన్సర్లకు బీసీసీఐ అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-03-24 14:07 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ఓవర్‌కు రెండు బౌన్సర్లకు బీసీసీఐ అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త రూల్ పేసర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. తాజాగా ఈ రూల్‌పై సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీ ప్రశ్నించాడు. స్పిన్నర్ల గురించి కూడా ఆలోచించాలన్నాడు. ‘స్పిన్నర్లకు సహాయపడే విధంగా నిబంధనల్లో మార్పులు చేయగలరా?’ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు.

ఐపీఎల్-2024 వేలంలో షమ్సీ అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలాడు. రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఐపీఎల్‌లో గతంలో షమ్సీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం ఐపీఎల్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన అతను 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

వన్డే, టెస్టుల్లో ఓవర్‌కు రెండు బౌన్సర్లకు ఐసీసీ అనుమతించగా.. పొట్టి ఫార్మాట్‌లో మాత్రం ఒకే బౌన్సర్ వేయాలనే నిబంధన ఉన్నది. తొలిసారిగా ఐపీఎల్‌లో ఓవర్‌కు రెండు బౌన్సర్లు వేసేలా బీసీసీఐ నిబంధనలో మార్పులు చేసింది. దీనిపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. బ్యాటింగ్ జట్టులోని నిర్దిష్ట బ్యాటర్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ రూల్ ఉపయోగపడుతుందన్నాడు.

Tags:    

Similar News