చెమటోడ్చిన రాజస్థాన్.. హెట్మేయర్ మెరుపులతో గెలుపు తీరాలకు
ఐపీఎల్-17లో రాజస్థాన్ రాయల్స్ మళ్లీ గెలుపు బాటపట్టింది.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాజస్థాన్ రాయల్స్ మళ్లీ గెలుపు బాటపట్టింది. చండీగఢ్ వేదిక శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 147/8 స్కోరు చేసింది. అశుతోష్ శర్మ(31) టాప్ స్కోరర్. అనంతరం రాజస్థాన్ 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు శ్రమించాల్సి వచ్చింది. 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్(39) టాప్ స్కోరర్. ఆ తర్వాత హెట్మేయర్(27 నాటౌట్) ఆఖర్లో మెరవడంతో రాజస్థాన్ మరో బంతి మిగిలి ఉండగా విజయతీరాలకు చేరింది.
ఛేదనలో రాజస్థాన్ పోరాటం
బలమైన బ్యాటింగ్ దళమున్న రాజస్థాన్ 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో రాజస్థాన్‌కు ఛేదన సాఫీగా సాగలేదు. మొదట ఓపెనర్లు జైశ్వాల్(39), తనూశ్ కొటియన్(24) జట్టుకు శుభారంభం అందించారు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిదానంగానే ఆడిన వీరు తొలి వికెట్‌కు 56 పరుగుల జోడించారు. తనూశ్ కొటియన్‌ను లివింగ్‌స్టోన్ క్లీన్ బౌల్డ్ చేసి ఈ జోడీని విడదీశాడు. అనంతరం జైశ్వాల్, సంజూ శాంసన్(18) కాసేపటి తర్వాత రబాడ వేసిన వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. రియాన్ పరాగ్(23) విలువైన పరుగులు జోడించగా.. ధ్రువ్ జురెల్(6) నిరాశపర్చడంతో 115/5 స్కోరుతో ఛేదన రాజస్థాన్‌కు కష్టమైంది. ఆ జట్టు విజయానికి 16 బంతుల్లో 33 పరుగులు కావాల్సి రావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో హెట్మేయర్ మెరుపులు ఆశలు రేపిన మరో ఎండ్‌లో పంజాబ్ బౌలర్లు టెన్షన్ పెట్టారు. 19వ ఓవర్‌లో సామ్ కర్రన్.. పొవెల్(11), కేశవ్ మహరాజ్(1)ను అవుట్ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు అవసరమవ్వగా.. అర్ష్‌దీప్ సింగ్ తొలి రెండు బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత మూడు బంతుల్లో హెట్మేయర్(27 నాటౌట్) రెండు సిక్స్‌లతో సహా 14 పరుగులు రాబట్టడంతో రాజస్థాన్ గెలుపు ఖాయమైంది. పంజాబ్ బౌలర్లలో రబాడ, సామ్ కర్రన్ రెండేసి వికెట్లతో సత్తాచాటగా.. అర్ష్‌దీప్, లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.
తడబడిన పంజాబ్
అంతకుముందు పంజాబ్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. ఆ జట్టు బ్యాటర్లు రాజస్థాన్ బౌలర్ల ధాటికి ఒత్తిడికి లోనై క్రీజులో నిలువలేకపోయారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఇదే పరిస్థితి. ఓపెనర్లు అథర్వ(15), బెయిర్ స్టో(15) నిరాశపర్చగా.. ప్రభ్‌సిమ్రాన్(10), కెప్టెన్ సామ్ కర్రన్(6) సైతం తేలిపోయారు. దీంతో 10 ఓవర్ల లోపే పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా ఆ జట్టును ఆదుకునేవారు కరువయ్యారు. గత మ్యాచ్‌ల్లో చెలరేగిన శశాంక్ సింగ్(9)కు కుల్దీప్ సేన్ క్రీజులో నిలిచే అవకాశం ఇవ్వలేదు. అనంతరం జితేశ్ శర్మ(29), లివింగ్‌స్టోన్(21) కాసేపు వికెట్లు కాపాడుకోవడంతో స్కోరు 100 దాటింది. అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో జితేశ్ అవుటవడంతో ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోశ్ శర్మ(31) మరోసారి సత్తాచాటాడు. కాసేపు తోడుగా నిలిచిన లివింగ్‌స్టోన్ రనౌట్ రూపంలో వెనుదిరగగా.. అశుతోష్ పోరాటంతో పంజాబ్‌కు పోరాడే స్కోరు దక్కింది. చివరి ఓవర్‌లో ఆఖరి బంతికి అశుతోష్‌ను బౌల్ట్ అవుట్ చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, మహరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, కుల్దీప్ సేన్, చాహల్‌కు చెరో వికెట్ దక్కింది.
స్కోరుబోర్డు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 147/8(20 ఓవర్లు)
అథర్వ(సి)కుల్దీప్ సేన్(బి)అవేశ్ ఖాన్ 15, బెయిర్‌స్టో(సి)హెట్మేయర్(బి)మహరాజ్ 15, ప్రభ్‌సిమ్రాన్(సి)ధ్రువ్ జురెల్(బి)చాహల్ 10, సామ్ కర్రన్(సి)ధ్రువ్ జురెల్(బి)మహరాజ్ 6, జితేశ్ శర్మ(సి)రియాన్ పరాగ్(బి)అవేశ్ ఖాన్ 29, శశాంక్ సింగ్(సి)ధ్రువ్ జురెల్(బి)కుల్దీప్ సేన్ 9, లివింగ్‌స్టోన్ రనౌట్(తనూశ్/శాంసన్) 21, అశుతోష్ శర్మ(సి)మహరాజ్(బి)బౌల్ట్ 31, హర్‌ప్రీత్ బ్రార్ 3 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 8.
వికెట్ల పతనం : 27-1, 41-2, 47-3, 52-4, 70-5, 103-6, 122-7, 147-8
బౌలింగ్ : బౌల్ట్(4-0-22-1), కుల్దీప్ సేన్(4-0-35-1), అవేశ్ ఖాన్(4-0-34-2), చాహల్(4-0-31-1), మహరాజ్(4-0-23-2)
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 152/7(19.5 ఓవర్లు)
జైశ్వాల్(సి)హర్షల్ పటేల్(బి)రబాడ 39, తనూశ్(బి)లివింగ్‌స్టోన్ 24, శాంసన్ ఎల్బీడబ్ల్యూ(బి)రబాడ 18, రియాన్ పరాగ్(సి)రబాడ(బి)అర్ష్‌దీప్ సింగ్ 23, ధ్రువ్ జురెల్(సి)శశాంక్ సింగ్(బి)హర్షల్ పటేల్ 6, హెట్మేయర్ 27 నాటౌట్, పొవెల్(సి)జితేశ్(బి)సామ్ కర్రన్ 11, కేశవ్ మహరాజ్(సి)లివింగ్‌స్టోన్(బి)సామ్ కర్రన్ 1, బౌల్ట్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 3.
వికెట్ల పతనం : 56-1, 82-2, 89-3, 113-4, 115-5, 136-6, 138-7
బౌలింగ్ : అర్ష్‌దీప్ సింగ్(3.5-0-45-1), రబాడ(4-0-18-2), సామ్ కర్రన్(4-0-25-2), లివింగ్‌స్టోన్(3-0-21-1), హర్షల్ పటేల్(2-0-21-1), హర్‌ప్రీత్ బ్రార్(3-0-22-0)