టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. జట్టులోకి అతని రాక ఖాయమే?

విశాఖపట్నం వేదికగా చెన్నయ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

Update: 2024-03-31 20:25 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దాదాపు 15 నెలలు ఆటకు దూరమయ్యాడు. గత సీజన్ ఐపీఎల్‌కు కూడా అందుబాటులో లేడు. ఇటీవలే కోలుకున్న అతను ఐపీఎల్‌తోనే తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. అయితే, అతను ఎలా ఆడతాడో?.. మునుపటి పంత్‌ను చూడగలమా?.. ఇలా అందరిలోనూ ఎన్నో ప్రశ్నలు.

ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ సందడి మొదలుకానుండటంతో పంత్ నిరూపించుకోవడం కూడా ముఖ్యమే. పంత్‌పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఎందుకంటే, మైదానంలో దిగితే పరుగుల వరదే. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బంతి కనిపిస్తే బాదడమే అతని నైజం. కాబట్టి, అతనిపై అంచనాలు ఉండటం సహజమే. అయితే, తొలి రెండు మ్యాచ్‌ల్లో అతను వరుసగా 18 ,28 స్వల్ప పరుగులకే వెనుదిరిగాడు. దీంతో భారత అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యారు.

కానీ, చెన్నయ్‌తో మ్యాచ్‌లో ఫ్యాన్స్‌కు పంత్ వింధు భోజనం పెట్టాడు. మునపటి దూకుడును గుర్తు చేస్తూ అతను ఆడిన ఆటను చూడాల్సిందే. తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదిన పంత్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. 13వ ఓవర్‌లో బాదిన సిక్స్‌గానీ, 16వ, 18వ ఓవర్లలో ఒంటి కొట్టిన ఫోర్, సిక్స్ వింటేజ్ పంత్‌ను గుర్తు చేశాయి. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో పంత్ తానేంటో నిరూపించుకున్నాడు. టీ20 వరల్డ్ కప్‌ జట్టుకు తాను పోటీలో ఉన్నానని సెలెక్టర్లకు సందేశం పంపాడు. 

Tags:    

Similar News