దిశ, స్పోర్ట్స్ : దాదాపు రెండు నెలలపాటు ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్-17 ముగిసింది. కోల్‌కతా టైటిల్ దక్కించుకుంది. ఈ సీజన్‌లోనూ పలువురు యువ క్రికెటర్లు సత్తాచాటారు. వరల్డ్ క్లాస్ ప్లేయర్లు పాల్గొనే ఐపీఎల్‌లో తమ ప్రతిభను చూపెట్టాలని ప్రతి యువ క్రికెటర్ కోరుకుంటాడు. కానీ, తుది జట్టులో చోటు దక్కడం, ఒక వేళ దక్కినా నిరూపించుకోవడం అంత సులువు కాదు. కానీ, కొందరు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకుంటారు. అలా.. ఈ సీజన్‌లోనూ కొందరు మెరిశారు. అరంగేట్రంలోనే ఆకట్టుకున్నారు. వాళ్లెవరో చూద్దామా..
నితీశ్ రెడ్డి : ఈ జాబితాలో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి మొదటి స్థానంలో ఉంటాడనడంలో సందేహం లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఈ ఆల్‌రౌండర్ ఈ సీజన్‌లో అదరగొట్టాడు. గత సీజన్‌లోనే నితీశ్ అరంగేట్రం చేసినా.. బ్యాటింగ్ పరంగా అతనికి ఇదే మొదటి సీజన్. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 303 పరుగులు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరపున 4వ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించిన నితీశ్.. పంజాబ్‌పై అతను గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. హెడ్, అభిషేక్, మార్‌క్రమ్, త్రిపాఠి, క్లాసెన్.. ఇలా స్టార్లందరూ విఫలమైన పరిస్థితుల్లో నితీశ్ రెడ్డి జట్టును ఆదుకున్నాడు. 37 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఒక్క వికెట్ కూడా తీశాడు. ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో నితీశ్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఢిల్లీపై ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన అతను 37 పరుగులు చేయడంతోపాటు 2 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో నితీశ్ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 180కిపైగా స్ట్రైక్‌రేటుతో ఆడిన అతను 42 బంతుల్లో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అందులో 8 సిక్స్‌లు ఉండటం విశేషం. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ 202 పరుగుల టార్గెట్ పెట్టగా.. ఒక్క పరుగు తేడాతోనే గెలిచింది. క్లాసెన్‌తో కలిసి నితీశ్ నెలకొల్పిన భాగస్వామ్యమే హైదరాబాద్ విజయానికి కారణమైందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శనకుగానూ నితీశ్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. నితీశ్ నిలకడగా రాణిస్తే జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకునే అవకాశాలు లేకపోలేదు. భారత జట్టులో పేస్ ఆల్‌రౌండర్ స్థానానికి నితీశ్ సరిపోతాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జేక్ ఫ్రేజర్ : అరంగేట్రంలోనే అదరగొట్టిన మరో యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్. ఈ సీజన్‌లో ఢిల్లీ తరపున ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఆస్ట్రేలియా సంచలనం.. 9 మ్యాచ్‌ల్లో 330 పరుగులు చేశాడు. అందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్‌రేట్ 234 ఉండటం గమనార్హం. లక్నోపై అరంగేట్రం చేసిన జేక్ ఫ్రేజర్ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఆ తర్వాత ఢిల్లీ విజయాల్లో అతను కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్, ముంబైలపై 300లకుపైగా స్ట్రైక్‌రేటుతో ఆడిన అతను రెండు మ్యాచ్‌ల్లోనూ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. ఢిల్లీ తరపున ఫాస్టెస్ హాఫ్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు. రాజస్థాన్‌పై కూడా మరో హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో సత్తాచాటిన ఈ యువ బ్యాటర్ ఈ ఏడాదే వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా తరపున వన్డే అరంగేట్రం చేశాడు.
విల్ జాక్స్ : ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ కూడా ఇదే తొలి ఐపీఎల్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున అతను అదరగొట్టాడు. గతేడాది వేలంలో అతన్ని ఆర్సీబీ రూ.3.20 కోట్లుకు దక్కించుకుంది. అయితే, ఆ సీజన్‌లో బెంచ్‌కే పరిమితమైన అతను ఈ ఏడాది సంచలన ప్రదర్శన చేశాడు. 8 మ్యాచ్‌ల్లో 230 పరుగులు చేశాడు. అందులో గుజరాత్‌పై అతను బాదిన మెరుపు సెంచరీ కూడా ఉంది. ఆ మ్యాచ్‌లో కోహ్లీతో అతను సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 16 ఓవర్లలోనే ఛేదించిందంటే విల్ జాక్స్ విధ్వంసమే కారణం. 41 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకంటే ముందు కోల్‌కతాపై హాఫ్ సెంచరీతో మెరిశాడు. విల్ జాక్స్ ఇంగ్లాండ్‌కు మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
మయాంక్ యాదవ్ : లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్ ఈ సీజన్‌తోనే అరంగేట్రం చేశాడు. ఈ సీజన్‌లో అతను ఆడింది నాలుగు మ్యాచ్‌లే. కానీ, నాలుగు మ్యాచ్‌ల్లోనే తన బౌలింగ్ నైపుణ్యాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ బౌల్ వేసింది అంతనే. బెంగళూరుపై 156.7 కీపీహెచ్ వేగంతో బంతి సంధించాడు. పంజాబ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అతను 3 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లో బెంగళూరుపై కూడా 3 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ప్లే ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అనంతరం ఢిల్లీతో మ్యాచ్‌లో అతను గాయపడటంతో మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. మొత్తం 4 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. మయాంక్‌కు టీమ్ ఇండియాలో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఎన్‌సీఏ హై పర్ఫామెన్స్ మానిటరింగ్ ప్రొగ్రామ్‌కు ఎంపిక చేసిన ఆటగాళ్లలో మయాంక్ యాదవ్ ఉన్నాడు.