గుజరాత్ కష్టంగా.. పంజాబ్‌‌‌కు నాలుగో ఓటమి

143 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ అలవోకగా ఛేదిస్తుందనుకుంటే గెలుపు కోసం ఆ జట్టు శ్రమించాల్సి వచ్చింది.

Update: 2024-04-21 18:33 GMT

దిశ, స్పోర్ట్స్ : 142 పరుగులకే పంజాబ్ కింగ్స్ ఆలౌట్.. 143 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ అలవోకగా ఛేదిస్తుందనుకుంటే గెలుపు కోసం ఆ జట్టు శ్రమించాల్సి వచ్చింది. ఆఖరికి 5 బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది. మొహాలి వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై 3 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రాన్(39) టాప్ స్కోరర్. గుజరాత్ స్పిన్నర్ సాయి కిశోర్(4/33) ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్ తెవాటియా(36 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ గిల్(35), సాయి సుదర్శన్(31) విలువైన పరుగులు జోడించారు. ఢిల్లీ చేతిలో ఓటమితో వెనుకబడిన గుజరాత్ ఈ విజయంతో పుంజుకోగా.. మరోవైపు, పంజాబ్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. 

ఛేదనలో శ్రమించిన గుజరాత్

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి గుజరాత్ శ్రమించాల్సి వచ్చింది. పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో పంజాబ్ బౌలర్లు లక్ష్యాన్ని కాపాడుకునేందుకు శాయశక్తులా పోరాడారు. ఓపెనర్ సాహా(13) నిరాశపర్చడంతో 25 పరుగులకే గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత సాయి సుదర్శన్‌తో కలిసి మరో ఓపెనర్ గిల్ ఇన్నింగ్స్ నిర్మించేందుకు చూశాడు. ఈ ప్రయత్నంలో లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో గిల్(35) అవుటవ్వగా.. క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్(4) నిరాశపరిచాడు. కాసేపు క్రీజులో ఉన్న సాయి సుదర్శన్(31)‌తోపాటు అజ్మతుల్లా(13) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరగడంతో గుజరాత్ 103/5 స్కోరుతో కష్టాల్లో పడేలా కనిపించింది. అయితే, రాహుల్ తెవాటియా(36 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. షారుఖ్ ఖాన్(8), రషీద్ ఖాన్(3) విఫలమైనా.. రాహుల్ తెవాటియా ధాటిగా ఆడటంతో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ విజయం లాంఛమైంది. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లతో రాణించగా.. లివింగ్‌స్టోన్ రెండు, అర్ష్‌దీప్, సామ్ కర్రన్ చెరో వికెట్ తీసుకున్నారు.

స్పిన్ ఉచ్చులో పంజాబ్ విలవిల

అంతకుముందు పంజాబ్‌కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్(35), సామ్ కర్రన్(20) తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. అయితే, గుజరాత్ స్పిన్నర్లు ధాటికి ఆ జట్టు తడబాటుకు గురైంది. మోహిత్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రాన్ అవుటవడంతో ప్రారంభమైన వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. చివరికి అతనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రోసోవ్(9), సామ్ కర్రన్, లివింగ్‌స్టోన్(6) నిరాశపరిచారు. ఆ తర్వాత సాయి కిశోర్ స్పిన్ మంత్రంతో పంజాబ్‌ పతనాన్ని శాసించాడు. వరుస ఓవర్లలో జితేశ్ శర్మ(13), అశుతోశ్ శర్మ(3), శశాంక్ సింగ్(8) వంటి కీలక బ్యాటర్లను పెవిలియన్ పంపాడు. 100 పరుగుల్లోపే పంజాబ్ 7 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో కూరుకుపోయింది. అనంతరం హర్‌ప్రీత్ బ్రార్(29), హర్‌ప్రీత్ సింగ్(14) విలువైన పరుగులు జోడించడంతో పంజాబ్‌కు పోరాడే స్కోరు దక్కింది. ఆఖరి ఓవర్ వేసిన మోహిత్ శర్మ బౌలింగ్‌లో హర్షల్ పటేల్(0) క్యాచ్ అవుటవ్వగా.. చివరి బంతికి హర్‌ప్రీత్ సింగ్ రనౌటవడంతో పంజాబ్ ఆలౌటైంది. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 4 వికెట్లతో సత్తాచాటగా.. మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లతో రాణించారు. రషీద్ ఖాన్‌కు ఒక్క వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 142 ఆలౌట్(20 ఓవర్లు)

సామ్ కర్రన్ ఎల్బీడబ్ల్యూ(బి)రషీద్ 20, ప్రభ్‌సిమ్రాన్(సి)సాహా(బి)మోహిత్ 35, రోసోవ్ ఎల్బీడబ్ల్యూ(బి)నూర్ అహ్మద్ 9, జితేశ్(బి)సాయి కిశోర్ 13, లివింగ్‌స్టోన్(సి)రాహుల్ తెవాటియా(బి)నూర్ అహ్మద్ 6, శశాంక్(సి అండ్ బి)సాయి కిశోర్ 8, అశుతోష్(సి)మోహిత్(బి)సాయి కిశోర్ 3, హర్‌ప్రీత్ సింగ్ రనౌట్(సాయి సుదర్శన్/సాహా) 14, హర్‌ప్రీత్ బ్రార్(సి)షారుఖ్(బి)సాయి కిశోర్ 29, హర్షల్ పటేల్(సి)షారుఖ్(బి)మోహిత్ 0, రబాడ 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 4.

వికెట్ల పతనం : 52-1, 63-2, 67-3, 78-4, 86-5, 92-6, 99-7, 139-8, 140-9, 142-10

బౌలింగ్ : అజ్మతుల్లా(2-0-13-0), సందీప్(1-0-21-0), మోహిత్(4-0-32-2), రషీద్(4-0-15-1), నూర్ అహ్మద్(4-0-20-2), సాయి కిశోర్(4-0-33-4), షారుఖ్(1-0-7-0)

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ : 146/7(19.1 ఓవర్లు)

సాహా(సి)అశుతోష్(బి)అర్ష్‌దీప్ 13, గిల్(సి)రబాడ(బి)లివింగ్‌స్టోన్ 35, సాయి సుదర్శన్(బి)సామ్ కర్రన్ 31, మిల్లర్(బి)లివింగ్‌స్టోన్ 4, అజ్మతుల్లా(సి)జితేశ్(బి)హర్షల్ పటేల్ 13, రాహుల్ తెవాటియా 36 నాటౌట్, షారుఖ్ ఖాన్(బి)హర్షల్ పటేల్ 8, రషీద్ ఖాన్(సి)రోసోవ్9బి)హర్షల్ పటేల్ 3, సాయి కిశోర్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 3.

వికెట్ల పతనం : 66-1, 77-2, 97-3, 103-4, 138-5, 142-6

బౌలింగ్ : రబాడ(4-0-40-0), అర్ష్‌దీప్(2.1-0-17-1), హర్షల్ పటేల్(3-0-15-3), సామ్ కర్రన్(2-0-18-1), హర్‌ప్రీత్ బ్రార్(4-0-35-0), లివింగ్‌స్టోన్(4-0-19-2)

Tags:    

Similar News