జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌పై ప్రతీకారం తీర్చుకున్న చెన్నయ్

ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 28 పరుగుల తేడాతో చెన్నయ్ సూపర్ కింగ్స్ విజయం సాధించింది.

Update: 2024-05-05 13:54 GMT

దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ పంజా విసిరింది. దెబ్బకు దెబ్బ కొట్టింది. ఈ నెల 1న పంజాబ్ చేతిలో సీఎస్కే ఓటమిపాలైంది. ఆ ఓటమికి తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 28 పరుగుల తేడాతో చెన్నయ్ సూపర్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నయ్ 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. జడేజా(43) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రుతురాజ్(32), డారిల్ మిచెల్(30) పర్వాలేదనిపించారు. రాహుల్ చాహర్(3/23), హర్షల్ పటేల్(3/24), అర్ష్‌దీప్ సింగ్(2/42) మెరవడంతో చెన్నయ్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.

అయితే, పోరాడే లక్ష్యాన్ని చెన్నయ్ బౌలర్లు కాపాడుకున్నారు. దీంతో ఛేదనకు దిగిన పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 139/9 స్కోరుకే పరిమితమైంది. బ్యాటుతో మెరిసిన జడేజా(3/20) బంతితోనూ సత్తాచాటాడు. 3 వికెట్లు తీసి పంజాబ్ ఓటమిని శాసించాడు. అతనికితోడు సిమర్జీత్ సింగ్(2/16), తుషార్ దేశ్‌పాండే(2/35) రాణించారు. ఈ విజయంతో చెన్నయ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్ ఆశలను మెరుగుపర్చుకుంది. మరోవైపు, పంజాబ్ నాకౌట్ బెర్త్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. సాంకేతికంగా టోర్నీలో ఉన్నా.. ఆ జట్టు ముందడుగు వేయడం కష్టమే. 

Tags:    

Similar News