లక్నో యువ పేసర్ మయాంక్ గురించి ఈ విషయం మీకు తెలుసా?
లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్ తన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్ తన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. సంచలన ప్రదర్శన చేస్తున్న అతని గురించి క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. దీంతో అతని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. తాజాగా మయాంక్ డైట్ సీక్రెట్‌ను అతని తల్లి మమతా రివీల్ చేసింది.
జాతీయ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. మయాంక్ వెజిటేరియన్ అని తెలిపింది. ‘ఇంతకుముందు అతను నాన్ వెజ్ తినేవాడు. కానీ, అతను వెజిటేరియన్‌గా మారిపోయాడు. గత రెండేళ్లుగా మయాంక్ శాఖాహారం మాత్రమే తీసుకుంటున్నాడు. అతను స్పెషల్‌గా ఏం తీసుకోడు. పప్పు, చపాతి, అన్నం, పాలు, కాయగూరలు వంటివి తీసుకుంటాడు.నాన్ వెజ్ తీసుకోకపోవడానికి అతను మాకు రెండు కారణాలు చెప్పాడు. అందులో శ్రీకృష్ణుడిని విశ్వసించడం ఒకటి. అలాగే, నాన్ వెజ్ తన శరీరానికి అంతగా సరిపోవడం లేదని చెప్పాడు. మేం ఎప్పుడు నాన్ వెజ్ ఎందుకు తీసుకోవడం లేదని అతనిపై బలవంతం చేయలేదు. తాను ఏం చేసినా ఆట, శరీరం మంచి కోసమే అని చెప్పేవాడు.’ అని మయాంక్ తల్లి చెప్పుకొచ్చింది.
కాగా, పంజాబ్, బెంగళూరు మ్యాచ్‌ల్లో మూడేసి వికెట్లతో చెలరేగిన మయాంక్ లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో 6 వికెట్లతో అతను రెండో టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అలాగే, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఫాస్టెస్ట్ బంతి అతను సంధించిందే. బెంగళూరుతో మ్యాచ్‌లో మయాంక్ 157.6 కేపీహెచ్ వేగంతో బంతి విసిరాడు.