సన్‌రైజర్స్‌కు సూర్య‘స్ట్రోక్’
ఐపీఎల్-17లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్‌కు ఊరట. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత ఓ విజయం దక్కింది.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్‌కు ఊరట. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత ఓ విజయం దక్కింది. ముంబై వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 173/8 స్కోరు చేసింది. హెడ్(48) టాప్ స్కోరర్. కెప్టెన్ కమిన్స్(35 నాటౌట్) మెరవడంతో పోరాడే స్కోరు దక్కింది. హార్దిక్ పాండ్యా(3/31), పీయూశ్ చావ్లా(3/33) బంతితో సత్తాచాటారు. అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు 17.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్(102 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ముంబైకి భారీ విజయం అందించాడు.
సూర్య ఆకాశమే హద్దుగా..
లక్ష్య ఛేదనలో ముంబైకి ఏమాత్రం శుభారంభం దక్కలేదు. ఇషాన్ కిషన్(9), రోహిత్ శర్మ(4), నమన్ ధిర్(0) నిరాశపర్చడంతో ఆ జట్టు 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడేలా కనిపించింది. హైదరాబాద్ బౌలర్లు అదే జోరు కొనసాగించి లక్ష్యాన్ని కాపాడుకుంటేరేమో అనిపించింది. అయితే, హైదరాబాద్ ఆశలపై సూర్యకుమార్ నీళ్లు చల్లాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతను మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి ధనాధన్ మొదలుపెట్టిన అతను..జాన్సెన్ బౌలింగ్‌లో 4, 4, 6,6 బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ స్ట్రైక్ రొటేట్ చేస్తూ సహకరించాడు. మరో ఎండ్‌లో దంచికొట్టిన అతను 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన అతను జట్టును విజయానికి చేరువేశాడు. అదే సమయంలో కమిన్స్ బౌలింగ్‌లో వరుసగా 4, 4,6 కొట్టి సెంచరీకి చేరువైన అతను.. నటరాజన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించడంతోపాటు శతకం పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ నుంచి సెంచరీకి సూర్య తీసుకున్న బంతులు 20 మాత్రమే.
తడబడిన హైదరాబాద్
హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. పీయూశ్ చావ్లా, హార్దిక్ పాండ్యా వరుస వికెట్లతో చెలరేగి ఎస్‌ఆర్‌హెచ్‌ను మోస్తరు స్కోరుకే కట్టడి చేశారు. అయితే, మొదట జట్టుకు ఓపెనర్ హెడ్ మంచి ఆరంభాన్ని అందించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అభిషేక్ తడబడినా.. హెడ్ మాత్రం దూకుడుగా ఆడాడు. నువాన్ తుషారా బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన అతను.. అన్షుల్ వేసిన ఓవర్‌లో రెండు ఫోర్లు, సిక్స్ దంచాడు. దీంతో 5 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 51/0తో నిలిచి భారీ స్కోరుకు మంచి పునాదే వేసుకుంది. ఆ తర్వాత ముంబై బౌలర్లు పుంజుకున్నారు. 6వ ఓవర్‌లో అభిషేక్(11)ను బుమ్రా అవుట్ చేయడంతో హైదరాబాద్ తడబాటు మొదలైంది. క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్(5) నిరాశపరిచారు.. అనంతరం స్పిన్నర్ పీయూశ్ చావ్లా, పేసర్ హార్దిక్ పాండ్యా వరుస వికెట్లతో హైదరాబాద్‌ను దెబ్బ మీద దెబ్బకొట్టారు. చావ్లా బౌలింగ్ అవుటై హెడ్(48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. క్లాసెన్(2) దారుణంగా నిరాశపరిచాడు. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి(20), మార్కో జాన్సెన్(17), షాబాజ్ అహ్మద్(10)లను పాండ్యా అవుట్ చేయడంతో హైదరాబాద్ ఆలౌట్ అంచున నిలిచింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ పాట్ కమిన్స్ తనలోని బ్యాటర్‌ను మరోసారి బయటకుతీశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అతను 17 బంతుల్లో 35 స్కోరుతో అజేయంగా నిలిచి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. ముంబై బౌలర్లలో పాండ్యా, చావ్లా మూడేసి వికెట్లతో సత్తాచాటగా.. అన్షుల్, బుమ్రాలకు చెరో వికెట్ దక్కింది.
స్కోరుబోర్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 173/8(20 ఓవర్లు)
హెడ్(సి)తిలక్(బి)చావ్లా 48, అభిషేక్(సి)ఇషాన్ కిషన్(బి)బుమ్రా 11, మయాంక్ అగర్వాల్(బి)అన్షుల్ 5, నితీశ్ రెడ్డి(సి)అన్షుల్(బి)పాండ్యా 20, క్లాసెన్(బి)చావ్లా 2, జాన్సెన్(బి)పాండ్యా 17, షాబాజ్ అహ్మద్(సి)సూర్యకుమార్(బి)పాండ్యా 10, అబ్దుల్ సమద్ ఎల్బీడబ్ల్యూ(బి)చావ్లా 3, కమిన్స్ 35 నాటౌట్, సన్వీర్ సింగ్ 8 నాటౌట్
వికెట్ల పతనం : 56-1, 68-2, 90-3, 92-4, 96-5, 120-6, 124-7, 136-8
బౌలింగ్ : నువాన్ తుషారా(4-0-42-0), అన్షుల్(4-0-42-1), బుమ్రా(4-0-23-1), పాండ్యా(4-0-31-3), చావ్లా(4-0-33-3)
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 174/3(17.2 ఓవర్లు)
ఇషాన్ కిషన్(సి)మయాంక్ అగర్వాల్(బి)జాన్సెన్ 9, రోహిత్(సి)క్లాసెన్(బి)కమిన్స్ 4, నమన్ ధిర్(సి)జాన్సెన్(బి)భువనేవ్వర్ 0, సూర్యకుమార్ 102 నాటౌట్, తిలక్ వర్మ 37 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 22.
వికెట్ల పతనం : 26-1, 31-2, 31-3
బౌలింగ్ : భువనేశ్వర్(4-1-22-1), జాన్సెన్(3-0-45-1), కమిన్స్(4-1-35-1), నటరాజన్(3.2-0-31-0), నితీశ్ రెడ్డి(2-0-16-0), షాబాజ్ అహ్మద్(1-0-11-0)