లక్నో సూపర్ విక్టరీ.. అయినా ఇంటికే
ఐపీఎల్-17ను లక్నో సూపర్ జెయింట్స్ విజయంతో ముగించింది.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17ను లక్నో సూపర్ జెయింట్స్ విజయంతో ముగించింది. ముంబై వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 18 పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 214/6 స్కోరు చేసింది. పూరన్(75) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. రాహుల్(55) రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 196/6 స్కోరుకే పరిమితమైంది. రోహిత్ శర్మ(68), నమన్ ధిర్(62 నాటౌట్) పోరాటం ఫలించలేదు. ఈ విజయంతో లక్నో 14 పాయింట్లతో నిలిచినా నెట్‌రన్‌రేట్‌లో వెనుకబడి ఉండటంతో ఆ జట్టు నాకౌట్‌కు దూరమైంది. మరోవైపు, ఇప్పటికే ఎలిమినేట్ అయిన ముంబై జట్టు ఓటమితో సీజన్‌ను ముగించింది.
రోహిత్, నమన్ ధిర్ పోరాటం వృథా
ముంబై పోరాడి ఓడింది. మొదట రోహిత్ శర్మ, డెత్ ఓవర్లలో నమన్ ధిర్ పోరాడినా జట్టుకు ఫలితం దక్కలేదు. 215 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి కావాల్సిన ఆరంభమే దక్కింది. డెవాల్డ్ బ్రెవిస్(23)తో కలిసి రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 88 పరుగులు జోడించాడు. మరోసారి బ్యాటు ఝుళిపించిన హిట్ మ్యాన్ లక్నో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. మ్యాట్ హెన్రీ, మొహ్సిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో రెచ్చిపోయాడు. రోహిత్ మెరుపులతో లక్ష్యాన్ని ముంబై కరిగించింది. అయితే, కీలక సమయంలో లక్నో బౌలర్లు పుంజుకున్నారు. దీంతో 8 ఓవర్లలో 78/0తో నిలిచిన ముంబై.. 14.2 ఓవర్లలో 120/5తో కష్టాల్లో పడింది. డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్(0), రోహిత్ శర్మ(68), హార్దిక్ పాండ్యా(16), నేహాల్(1) వరుసగా వికెట్లు కోల్పోయారు. ఇక, ముంబై పనైపోయిందనుకున్న తరుణంలో నమన్ ధిర్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. డెత్ ఓవర్లలో చెలరేగిన 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతని జోరుతో ముంబై జట్టులో ఆశలు చిగురించాయి. అయితే, తక్కువ బంతుల్లో లక్ష్యం ఎక్కువ ఉండటంతో నమన్ ధిర్(62 నాటౌట్) చివరి వరకూ పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్ రెండేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా, మొహ్సిన్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది.
రెచ్చిపోయిన పూరన్
అంతకుముందు లక్నో ఇన్నింగ్స్‌లో పూరన్ ఆటే హైలెట్. అతను రాక ముందు అతను వచ్చిన తర్వాత అన్నట్టు లక్నో ఇన్నింగ్స్ సాగింది. అయితే, మొదట లక్నో ఆట చూస్తే 150 పరుగులకే పరిమతమయ్యేలా కనిపించింది. 10 ఓవర్లలో లక్నో 69/3 స్కోరు మాత్రమే చేసిందంటే.. ఆరంభంలో ఆ జట్టు ఏ విధంగా తడబడిందో అర్థం చేసుకోవచ్చు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ పడిక్కల్(0)ను తుషార అవుట్ చేయగా.. స్టోయినిస్(28), దీపక్ హుడా(11)లను చావ్లా పెవిలియన్ పంపాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ డిఫెన్స్‌కే పరిమితమవుతూ వికెట్ కాపాడుకున్నాడు. హుడా అవుటైన తర్వాత పూరన్ క్రీజులోకి రావడంతో లక్నో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 11వ ఓవర్‌లో సిక్స్‌తో దూకుడు మొదలుపెట్టిన అతను.. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో ముంబై బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. పూరన్ విధ్వంసంతో 10 ఓవర్లలో 69/3తో నిలిచిన లక్నో.. 16 ఓవర్ పూర్తయ్యే సరికి 170/3 స్కోరుతో నిలిచింది. అతని దూకుడు చూస్తుంటే స్కోరు 250 దాటేలా కనిపించింది. అయితే, నువాన్ తుషార 17వ ఓవర్‌లో పూరన్(75)ను అవుట్ చేసి అతని జోరుకు బ్రేక్ వేశాడు. ఆ తర్వాతి బంతికే అర్షద్ ఖాన్(0) కూడా వెనుదిరిగాడు. మరోవైపు, నిదానంగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రాహుల్(55) కూడా ఆ తర్వాతి ఓవర్‌లో వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత ఆయుశ్ బదోని(22 నాటౌట్), కృనాల్ పాండ్యా(12 నాటౌట్) ధాటిగా ఆడటంతో స్కోరు 210 దాటింది. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా, చావ్లా మూడేసి వికెట్లతో సత్తాచాటారు.
స్కోరుబోర్డు
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ : 214/6(20 ఓవర్లు)
కేఎల్ రాహుల్(సి)నువాన్ తుషార(బి)చావ్లా 55, పడిక్కల్ ఎల్బీడబ్ల్యూ(బి)నువాన్ తుషార 0, స్టోయినిస్ ఎల్బీడబ్ల్యూ(బి)చావ్లా 28, దీపక్ హుడా(సి)నేహాల్(బి)చావ్లా 11, పూరన్(సి)సూర్యకుమార్(బి)నువాన్ తుషార 75, అర్షద్ ఖాన్(సి)నేహాల్(బి)నువాన్ తుషార 0, ఆయుశ్ బదోని 22 నాటౌట్, కృనాల్ పాండ్యా 12 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 11.
వికెట్ల పతనం : 1-1, 49-2, 69-3, 178-4, 178-5, 178-6
బౌలింగ్ : నువాన్ తుషార(4-0-28-3), అర్జున్(2.2-0-22-0), అన్షుల్ కాంబోజ్(3-0-48-0), పీయూశ్ చావ్లా(4-0-29-3), నేహాల్(2-0-13-0), పాండ్యా(2-0-27-0), నమన్ ధిర్(0.4-0-17-0), రొమారియో షెఫర్డ్(2-0-30-0)
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 196/6(20 ఓవర్లు)
రోహిత్(సి)మొహ్సిన్ ఖాన్(బి)రవి బిష్ణోయ్ 68, డెవాల్డ్ బ్రెవిస్(సి)కృనాల్ పాండ్యా(బి)నవీన్ ఉల్ హక్ 23, సూర్యకుమార్(సి)రవి బిష్ణోయ్(బి)కృనాల్ పాండ్యా 0, ఇషాన్ కిషన్(బి)నవీన్ ఉల్ హక్ 14, హార్దిక్ పాండ్యా(సి)నవీన్ ఉల్ హక్(బి)మొహ్సిన్ ఖాన్ 16, నేహాల్(సి)కృనాల్ పాండ్యా(బి)రవి బిష్ణోయ్ 1, నమన్ ధిర్ 62 నాటౌట్, రొమారియో షెఫర్డ్ 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 11.
వికెట్ల పతనం : 88-1, 89-2, 97-3, 116-4, 120-5, 188-6
బౌలింగ్ : అర్షద్ ఖాన్(2-0-11-0), మ్యాట్ హెన్రీ(2-0-24-0), కృనాల్ పాండ్యా(4-0-29-1), మొహ్సిన్ ఖాన్(4-0-45-1), నవీన్ ఉల్ హక్(4-0-50-2), రవి బిష్ణోయ్(4-0-37-2)