దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై గడ్డపై ముంబై ఇండియన్స్‌కు చుక్కలు చూపించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబైపై 20 పరుగుల తేడాతో చెన్నయ్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నయ్ నిర్ణీత 20 ఓవర్లలో 206/4 స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(69), శివమ్ దూబె(66 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరవగా.. ధోనీ(20 నాటౌట్) విలువైన పరుగులు జోడించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై 186/6 స్కోరుకే పరిమితమైంది. రోహిత్ శర్మ(105 నాటౌట్) అజేయ శతకంతో చేసిన ఒంటరి పోరాటం వృథా అయ్యింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన చెన్నయ్ బౌలర్ పతిరణ(4/28) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
రోహిత్ చివరి వరకు..
ఛేదనలో హైలెట్ అంటే రోహిత్ ఆటనే. ముంబై ఓడినా హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ మాత్రం అద్భుతమే. జట్టును గెలిపించేందుకు చివరి బంతి వరకూ అతని చేసిన పోరాటం ప్రశంసనీయమే. మొదట రోహిత్ దూకుడుతో ఛేదనలో ముంబైకి మంచి ఆరంభం దక్కింది. ఇషాన్ కిషన్(23)తో కలిసి తొలి వికెట్‌కు అతను 70 పరుగులు జోడించాడు. ఇషాన్ కిషన్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడదీసిన పతిరణ అదే ఓవర్‌లో ప్రమాదకరమైన సూర్యకుమార్(0)ను అవుట్ చేసి ముంబైకి భారీ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత తిలక్ వర్మ(31)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో 30 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత కూడా రోహిత్ బౌండరీల ఆపలేదు. దీంతో 13 ఓవర్లలో 124/2 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్న ముంబైని పతిరణ మరోసారి దెబ్బకొట్టాడు. తిలక్‌ను పెవిలియన్ పంపాడు. కెప్టెన్ పాండ్యా(2), టిమ్ డేవిడ్(13)దారుణంగా విఫలమవడంతో రోహిత్ ఒంటరి పోరాటాన్ని కొనసాగించాడు. 27 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు పడగొట్టిన చెన్నయ్ బౌలర్లు మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నారు. రోహిత్ చివరి వరకు పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆఖరి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన అతను 62 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరోవైపు, ముంబై విజయానికి 20 పరుగుల దూరంలో ఆగిపోయింది. చెన్నయ్ బౌలర్లలో పతిరణ 4 వికెట్లతో సత్తాచాటగా.. తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు.
చెలరేగిన గైక్వాడ్, దూబె
అంతకుముందు చెన్నయ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రహానే(5) రెండో ఓవర్‌లోనే అవుటవడంతో 8 పరుగులకే సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ గైక్వాడ్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. నబీ బౌలింగ్‌లో సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించిన అతను.. కోయ్టజి బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో దూకుడును కొనసాగించాడు. మరోఎండ్‌లో నిదానంగా ఆడిన రచిన్ రవీంద్ర(21) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. అనంతరం గైక్వాడ్‌కు దూబె తోడయ్యాడు. గైక్వాడ్‌తోపాటు దూబె కూడా మెరుపులు మెరిపించడంతో ముంబై బౌలర్లు ప్రేక్షక పాత్ర వహించారు. షెఫర్డ్ వేసిన 14వ ఓవర్‌లో 22 పరుగులు, ఆ తర్వాతి ఓవర్‌లో ఆకాశ్ బౌలింగ్‌లో 17 పరుగులు పిండుకున్నారు. ఈ క్రమంలో మొదట గైక్వాడ్, ఆ తర్వాత దూబె హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. అయితే, పాండ్యా బౌలింగ్‌లో గైక్వాడ్(69)అవుటవడంతో ఈ జోడీ దూకుడుకు బ్రేక్ పడింది. మూడో వికెట్‌కు వీరు 90 పరుగులు జోడించడంతో చెన్నయ్ భారీ స్కోరుపై కన్నేసింది. ఆ తర్వాత డారిల్ మిచెల్(17)తో కలిసి దూబె(66 నాటౌట్) అదే జోరు కొనసాగించాడు. ఆఖరి ఓవర్ వేసిన పాండ్యా బౌలింగ్‌లో మిచెల్ అవుటవ్వగా.. క్రీజులోకి వచ్చిన ధోనీ(20 నాటౌట్) నాలుగు బంతుల్లో 3 సిక్స్‌లు బాదడంతో స్కోరు 200 దాటింది. ముంబై బౌలర్లలో పాండ్యా 2 వికెట్లు తీయగా.. కోయ్టజి, శ్రేయాస్ గోపాల్‌కు చెరో వికెట్ దక్కింది.
స్కోరుబోర్డు
చెన్నయ్ సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : 206/4(20 ఓవర్లు)
రహానే(సి)పాండ్యా(బి)కోయ్టజి 5, రచిన్ రవీంద్ర(సి)ఇషాన్ కిషన్(బి)శ్రేయాస్ గోపాల్ 21,గైక్వాడ్(సి)నబీ(బి)పాండ్యా 69, దూబె 66 నాటౌట్, డారిల్ మిచెల్(సి)నబీ(బి)పాండ్యా 17, ధోనీ 20 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 8.
వికెట్ల పతనం : 8-1, 60-2, 150-3, 186-4
బౌలింగ్ : నబీ(3-0-19-0), కోయ్టజి(4-0-35-1), బుమ్రా(4-0-27-0), ఆకాశ్(3-0-37-0), శ్రేయాస్ గోపాల్(1-0-9-1), హార్దిక్ పాండ్యా(3-0-43-2), రొమారియో షెఫర్డ్(2-0-33-0)
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 186/6(20 ఓవర్లు)
రోహిత్ 105 నాటౌట్, ఇషాన్ కిషన్(సి)శార్దూల్9బి)పతిరణ 23, సూర్యకుమార్(సి)ముస్తాఫిజుర్(బి)పతిరణ 0, తిలక్(సి)శార్దూల్(బి)పతిరణ 31, పాండ్యా(సి)జడేజా(బి)తుషార్ దేశ్‌పాండే 2, టిమ్ డేవిడ్(సి)రచిన్ రవీంద్ర(బి)ముస్తాఫిజుర్ 13, నబీ 4 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 7.
వికెట్ల పతనం : 70-1, 70-2, 130-3, 134-4, 148-5, 157-6
బౌలింగ్ : తుషార్ దేశ్‌పాండే(4-0-29-1), ముస్తాఫిజుర్(4-0-55-1), శార్దూల్(4-0-35-0), జడేజా(4-0-37-0), పతిరణ(4-0-28-4)