దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాజస్థాన్ రాయల్స్‌కు ఎదురులేకుండా పోయింది. మైదానంలో అడుగుపెడితే విజయమే అన్నట్టుగా ఆ జట్టు దూకుడు కొనసాగుతోంది. లక్నో వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 3 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 196/5 స్కోరు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(76), దీపక్ హుడా(50) సత్తాచాటారు. అనంతరం లక్ష్యాన్ని రాజస్థాన్ అలవోకగా ఛేదించింది. 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ శాంసన్(71 నాటౌట్), ధ్రువ్ జురెల్(52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ చేతిలో ఓడటం లక్నోకు ఇది రెండోసారి. రాజస్థాన్‌కు వరుసగా ఇది నాలుగో గెలుపు. మొత్తంగా 8వది. దీంతో ఆ జట్టు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది.
శాంసన్, జురెల్ మెరుపులు
లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌కు ఆశించిన ఆరంభమే దక్కింది. ఓపెనర్లు బట్లర్(34), యశస్వి జైశ్వాల్(24) తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. జైశ్వాల్ నిదానంగా ఆడినా.. బట్లర్ మాత్రం దూకుడుగా ఆడటంతో ఐదు ఓవర్లలో రాజస్థాన్ 50/0తో నిలిచింది. ఆ తర్వాతి ఓవర్‌లో యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో బట్లర్ అవుటవడంతో ఓపెనింగ్ జోడీ విడిపోయింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే జైశ్వాల్ కూడా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్(14) నిరాశపరిచాడు. దీంతో 78/3 స్కోరుతో రాజస్థాన్ కష్టాల్లో పడేలా కనిపించింది. అయితే, కెప్టెన్ శాంసన్, ధ్రువ్ జురెల్ మ్యాచ్‌ను పూర్తిగా రాజస్థాన్ వైపు తిప్పేశారు. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో వీరు లక్నో బౌలర్లను బెంబేలెత్తించారు. దీంతో 16 ఓవర్లలో 160/3 స్కోరుతో రాజస్థాన్ విజయం దిశగా వెళ్లింది. అదే సమయంలో శాంసన్ 28 బంతుల్లో, ధ్రువ్ జురెల్ 31 బంతుల్లో అర్ధ శతకాలు పూర్తి చేశారు. 12 బంతుల్లో రాజస్థాన్ విజయానికి 10 పరుగులు కావాల్సి ఉండగా.. శాంసన్ 19వ ఓవర్‌లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టి మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టు విజయాన్ని లాంఛనం చేశాడు. లక్నో బౌలర్లలో యశ్ ఠాకూర్, స్టోయినిస్, అమిత్ మిశ్రా చెరో వికెట్ తీశారు.
లక్నోను ఆదుకున్న రాహుల్, హుడా జోడీ
అంతకుముందు లక్నోకు పేలవ ఆరంభం దక్కింది. ఓపెనర్ డికాక్(8)ను తొలి ఓవర్‌లోనే బౌల్ట్ బౌల్డ్ చేయగా.. క్రీజులోకి వచ్చిన స్టోయినిస్(0) ఆ తర్వాతి ఓవర్ డకౌటయ్యాడు. దీంతో 11 పరుగులకే లక్నో రెండు వికెట్లు కోల్పోయి తడబడింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా జట్టును ఆదుకున్నారు. నిదానంగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వీరు ఆ తర్వాత దూకుడు పెంచారు. సింగిల్స్ తీస్తూనే బౌండరీలూ బాదారు. ఈ క్రమంలో రాహుల్ 31 బంతుల్లో, హుడా 30 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. 12 ఓవర్లలో 126/2 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచిన లక్నోను అశ్విన్ దెబ్బ కొట్టాడు. హుడా(50)ను అవుట్ చేసి మూడో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. క్రీజులోకి వచ్చిన పూరన్(11) నిరాశపర్చగా.. స్కోరు 170 దాటిన తర్వాత రాహుల్(76) కూడా వెనుదిరిగాడు. ఆయుశ్ బడోని(18 నాటౌట్), కృనాల్ పాండ్యా(15 నాటౌట్) విలువైన పరుగులు జోడించడంతో లక్నో పోరాడే స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 2 వికెట్లు తీయగా.. బౌల్ట్, అవేశ్ ఖాన్, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.
స్కోరుబోర్డు
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ : 196/5(20 ఓవర్లు)
డికాక్(బి)బౌల్ట్ 8, రాహుల్(సి)బౌల్ట్(బి)అవేశ్ ఖాన్ 76, స్టోయినిస్(బి)సందీప్ శర్మ 0, దీపక్ హుడా(సి)రొవ్‌మన్ పొవెల్(బి)అశ్విన్ 50, పూరన్(సి)బౌల్ట్(బి)సందీప్ శర్మ 11, ఆయుశ్ బడోని 18 నాటౌట్, కృనాల్ పాండ్యా 15 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 18.
వికెట్ల పతనం : 8-1, 11-2, 126-3, 150-4, 173-5
బౌలింగ్ : బౌల్ట్(4-0-41-1), సందీప్ శర్మ(4-0-31-2), అవేశ్ ఖాన్(4-0-42-1), అశ్విన్(4-0-39-1), చాహల్(4-0-41-0)
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 199/3(19 ఓవర్లు)
యశస్వి జైశ్వాల్(సి)రవి బిష్ణోయ్(బి)స్టోయినిస్ 24, బట్లర్(బి)యశ్ ఠాకూర్ 34, శాంసన్ 71 నాటౌట్, రియాన్ పరాగ్(సి)ఆయుశ్ బడోని(బి)అమిత్ మిశ్రా 14, ధ్రువ్ జురెల్ 52 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 4.
వికెట్ల పతనం : 60-1, 60-2, 78-3
బౌలింగ్ : మ్యాట్ హెన్రీ(3-0-32-0), మోహ్సిన్ ఖాన్(4-0-52-0), యశ్ ఠాకూర్(4-0-50-1), స్టోయినిస్(1-0-3-1), కృనాల్ పాండ్యా(4-0-24-0), అమిత్ మిశ్రా(2-0-20-1), రవి బిష్ణోయ్(1-0-16-0)