కోల్‌కతా హ్యాట్రిక్.. లక్నో చిత్తు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు హ్యాట్రిక్ విజయం. లక్నో వేదికగా కోల్‌కతా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.

Update: 2024-05-05 18:38 GMT

దిశ, స్పోర్ట్స్ : కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు హ్యాట్రిక్ విజయం. లక్నో వేదికగా కోల్‌కతా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 98 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 235/6 స్కోరు చేసింది. సునీల్ నరైన్(81, 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. సాల్ట్(32), రమణ్‌దీప్ సింగ్(25 నాటౌట్) మెరుపులు మెరిపించారు. అనంతరం కోల్‌కతా బౌలర్లు రెచ్చిపోయారు. ఛేదనకు దిగిన లక్నోను బెంబేలెత్తించారు. దీంతో చేతులెత్తేసిన లక్నో 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. స్టోయినిస్(36) టాప్ స్కోరర్. హర్షిత్ రాణా(3/24), చక్రవర్తి(3/30) బంతితో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. ఈ విజయంతో కోల్‌కతా పాయింట్స్ టేబుల్‌లో రాజస్థాన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు, లక్నో ఐదో స్థానానికి పడిపోయింది.

కేకేఆర్ బౌలింగ్‌లో లక్నో విలవిల

భారీ లక్ష్య ఛేదనలో లక్నో కనీసం పోరాడలేకపోయింది. సొంతగడ్డపై 16.1 ఓవర్లలోనే ఆ జట్టు చేతులెత్తేయడం గమనార్హం. స్టోయినిస్ చేసిన 36 పరుగులే టాప్ స్కోరంటే.. ఆ జట్టు ఏ విధంగా పతనమైందో అర్థం చేసుకోవచ్చు. కేకేఆర్ బౌలింగ్ లక్నో బ్యాటర్లు విలవిలలాడారు. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి(9) వికెట్‌తో ఆ జట్టు పతనం ఆరంభమైంది. స్టోయినిస్, కేఎల్ రాహుల్(25) కాసేపు క్రీజులో ఉన్నారు. వీరు ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. దీంతో పవర్ ప్లేలో లక్నో 65/1తో నిలిచింది. ఆ తర్వాత హర్షిత్ రాణా, రస్సెల్, చక్రవర్తి బంతితో లక్నో పతనాన్ని శాసించారు. రాణా బౌలింగ్‌లో రాహుల్ అవుటవడంతో రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వికెట్లు పడటం ఆగలేదు. ధాటిగా ఆడిన స్టోయినిస్‌ను రస్సెల్ పెవిలియన్ పంగా.. దీపక్ హుడా(5), పూరన్(10), ఆయుశ్ బడోని(15) నిరాశపర్చడంతో లక్నో ఓటమి ఖాయమైంది. 109/6 నిలిచిన లక్నో మిగతా నాలుగు వికెట్లు కోల్పోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, చక్రవర్తి మూడేసి వికెట్లతో విజృంభించగా.. రస్సెల్ 2 వికెట్లు తీశాడు. స్టార్క్, సునీల్ నరైన్‌ తలో వికెట్ పడగొట్టారు.

నరైన్ విధ్వంసం

అంతకుముందు కోల్‌కతా ఇన్నింగ్స్‌లో సునీల్ నరైన్ ఆటే హైలెట్. అతను మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ సాల్ట్‌తో కలిసి జట్టుకు మెరుపు ఆరంభం అందించాడు. అయితే, మొదట దూకుడు మొదలుపెట్టింది మాత్రం సాల్టే. తొలి ఓవర్‌లో రెండు ఫోర్లతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన అతను. ఆ తర్వాతి ఓవర్‌లో సిక్స్ దంచాడు. మూడో ఓవర్‌లోనూ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అదే ఓవర్‌లో నరైన్ వరుసగా 4,4 తో గేర్ మార్చాడు. అక్కడి నుంచి అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 4వ ఓవర్‌లో మూడు ఫోర్లు, సిక్స్‌తో 20 పరుగులు పిండుకున్నాడు. అయితే, ఆ తర్వాతి ఓవర్‌లో సాల్ట్(32) అవుటవడంతో ఓపెనింగ్ జోడీ విడిపోయింది. సాల్ట్ అవుటైనా రఘువంశీ(32) సహకారంతో నరైన్ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతను.. ఆ తర్వాత సిక్స్‌ల మోత మోగించాడు. దీంతో 11 ఓవర్లలో కేకేఆర్ 129/1తో నిలిచి భారీ స్కోరుపై కన్నేసింది. అయితే, నరైన్(81) దూకుడుకు రవి బిష్ణోయ్ చెక్ పెట్టడంతో లక్నో ఊపిరి పీల్చుకుంది. అనంతరం రస్సెల్(12), రింకు సింగ్(16) నిరాశపర్చినా.. శ్రేయస్ అయ్యర్(23)‌ విలువైన పరుగులు జోడించాడు. చివరి రెండు ఓవర్లలో రమణ్‌దీప్ సింగ్(25 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో కేకేఆర్‌కు భారీ స్కోరు దక్కింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్‌ మూడు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్విర్ సింగ్‌కు చెరో వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : 235/6(20 ఓవర్లు)

సాల్ట్(సి)రాహుల్(బి)నవీన్ ఉల్ హక్ 32, నరైన్(సి)పడిక్కల్(బి)రవి బిష్ణోయ్ 81, రఘువంశీ(సి)రాహుల్(బి)యుధ్విర్ సింగ్ 32, రస్సెల్(సి)గౌతమ్(బి)నవీన్ ఉల్ హక్ 12, రింకు సింగ్(సి)స్టోయినిస్(బి)నవీన్ ఉల్ హక్ 16, శ్రేయస్ అయ్యర్(సి)రాహుల్(బి)యశ్ ఠాకూర్ 23, రమణ్‌దీప్ సింగ్ 25 నాటౌట్, వెంకటేశ్ అయ్యర్ 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 13.

వికెట్ల పతనం : 61-1, 140-2, 167-3, 171-4, 200-5, 224-6

బౌలింగ్ : స్టోయినిస్(2-0-29-0), మోహ్సిన్ ఖాన్(2-0-28-0), నవీన్ ఉల్ హక్(4-0-49-3), యశ్ ఠాకూర్(4-0-46-1), కృనాల్ పాండ్యా(2-0-26-0), రవి బిష్ణోయ్(4-0-33-1), యుధ్విర్ సింగ్(2-0-24-1)

లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ : 137 ఆలౌట్(16.1 ఓవర్లు)

కేఎల్ రాహుల్(సి)రమణ్‌దీప్(బి)హర్షిత్ రాణా 25, అర్షిన్ కులకర్ణి(సి)రమణ్‌దీప్(బి)స్టార్క్ 9, స్టోయినిస్(సి)హర్షిత్ రాణా(బి)రస్సెల్ 36, దీపక్ హుడా ఎల్బీడబ్ల్యూ(బి)చక్రవర్తి 5, నికోలస్ పూరన్(సి)సాల్ట్(బి)రస్సెల్ 10, ఆయుశ్ బడోని(సి)స్టార్క్(బి)నరైన్ 15, అష్టన్ టర్నర్(సి అండ్ బి) చక్రవర్తి 16, కృనాల్ పాండ్యా(సి)సాల్ట్(బి)హర్షిత్ రాణా 5, యుధ్విర్ సింగ్(సి)రస్సెల్(బి)చక్రవర్తి 7, రవి బిష్ణోయ్ ఎల్బీడబ్ల్యూ(బి)హర్షిత్ రాణా 2, నవీన్ ఉల్ మక్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 7.

వికెట్ల పతనం : 20-1, 70-2, 77-3, 85-4, 101-5, 109-6, 125-7, 129-8, 137-9, 137-10

బౌలింగ్ : వైభవ్(2-0-21-0), స్టార్క్(2-0-22-1), నరైన్(4-0-22-1), హర్షిత్ రాణా(3.1-0-24-3), వరుణ్ చక్రవర్తి(3-0-30-3), రస్సెల్(2-0-17-2)

Tags:    

Similar News