ఉప్పల్‌లో హైదరాబాద్ బోణీ కొట్టేనా?.. రేపు ముంబైతో ఢీ
ఐపీఎల్-17లో ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. హైదరాబాద్ వేదికగా ఏడు మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. తొలి మ్యాచ్‌కు బుధవారం ఆతిథ్యమివ్వనున్నది. అదే సమయంలో హోం టీమ్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. రేపు ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది రెండో మ్యాచ్. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ పోరాడి ఓడిన విషయం తెలిసిందే. దీంతో ముంబైతో సొంతగడ్డపై జరిగే మ్యాచ్‌లో బోణీ కొట్టాలని హైదరాబాద్ పట్టుదలతో ఉన్నది. మరోవైపు, ముంబై జట్టు కూడా ఇంకా ఖాతా తెరవలేదు. తొలి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఆ జట్టు పరాజయం పాలైంది. ఇక, ఉప్పల్‌లో హైదరాబాద్, ముంబై జట్లు ఇప్పటివరకు 8సార్లు తలపడ్డాయి. అందులో చెరో నాలుగు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు విజయం సాధించాయి. అయితే, చివరిగా ఆడిన రెండు సార్లూ ముంబై జట్టే నెగ్గింది. మరి, ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ బోణీ కొడుతుందో లేదో చూడాలి.
తొలి మ్యాచ్‌లో ఒక దశలో కోల్‌కతాను హైదరాబాద్ ఓడించినంత పనిచేసింది. 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్ ఏం పోరాడుతుందిలే అని చాలామంది అనుకున్నారు. కానీ, క్లాసెన్ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడటంతో హైదరాబాద్ 204/7 స్కోరు చేసి తృటిలో విజయానికి దూరమైంది. హైదరాబాద్ జట్టు ఇదే పట్టుదలను ముంబైపై ప్రదర్శించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కేకేఆర్ మ్యాచ్‌తో జట్టు బలాబలాలు, ఆటగాళ్లపై కెప్టెన్ కమిన్స్ ఓ అంచనాకు వచ్చే ఉంటాడు. కాబట్టి, ముంబైతో పోరులో కెప్టెన్‌గా తన మార్క్‌ను చూపించాల్సి ఉంది. తొలి మ్యాచ్ తర్వాత జట్టును పరిశీలిస్తే కొన్ని లోపాలు ఉన్నా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా హైదరాబాద్ జట్టు మెరుగ్గానే కనిపిస్తున్నది. క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ ఫామ్ కొనసాగించాల్సి ఉంది. గత మ్యాచ్‌లో నిరాశపర్చిన రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, అబ్దుల్ సమద్ పుంజుకోవాల్సి ఉన్నది. మరోవైపు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్ వంటి ఆల్‌రౌండర్లు బంతితో, బ్యాటుతో ప్రభావం చూపకపోవడం కూడా నష్టపరిచింది. ఇక, గత మ్యాచ్‌లో బౌలింగ్ దళం తమ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ పూర్తిగా తేలిపోయి భారీగా సమర్పించుకున్నాడు. నటరాజన్, మార్కండే మాత్రం కేకేఆర్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ముంబైతో మ్యాచ్‌లో కెప్టెన్ కమిన్స్ లోపాలను అధిగమించడంపై ఫోకస్ పెట్టాలి. సొంత మైదానం కావడం జట్టుకు సానుకూలంశమే. దీన్ని జట్టు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. భారీ బ్యాటింగ్ దళాన్ని కలిగి ఉన్న ముంబైని బౌలర్లు సమిష్టిగా రాణిస్తేనే కట్టడి చేయడం సాధ్యమవుతుంది. మొత్తంగా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తేనే హైదరాబాద్ విజయతీరాలకు చేరుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.