ముంబై గడ్డపై రాజస్థాన్ ఆల్‌రౌండ్ షో
ఐపీఎల్-17లో రాజస్థాన్ రాయల్స్ దూకుడు కొనసాగుతోంది.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాజస్థాన్ రాయల్స్ దూకుడు కొనసాగుతోంది. ముంబై గడ్డపై ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఆ జట్టు పాండ్యా సేనను మట్టికరిపించింది. ముంబై వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో టోర్నీలో రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయగా.. ముంబై వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 125/9 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(34) టాప్ స్కోరర్. తిలక్ వర్మ(32) పర్వాలేదనిపించాడు. బౌల్ట్(3/22), యుజువేంద్ర చాహల్(3/11) బంతితో విజృంభించడంతో ముంబై స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అనంతరం 126 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 15.3 ఓవర్లలోనే ఛేదించింది. 4 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(54 నాటౌట్) మరోసారి హాఫ్ సెంచరీతో చెలరేగడంతో అలవోకగా నెగ్గింది.
రియాన్ పరాగ్ మెరుపులు
స్వల్ప లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. ఆరంభంలో ముంబై బౌలర్లు ఆ జట్టును కట్టడి చేశారు. దీంతో ఓపెనర్లు జైశ్వాల్(10), బట్లర్(13) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. కెప్టెన్ శాంసన్(12)ది అదే పరిస్థితి. రాజస్థాన్ 48/3 స్కోరుతో తడబడిన సమయంలో రియాన్ పరాగ్ మరోసారి తన బ్యాటు పవర్ చూపెట్టాడు. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలు బాదిన అతను హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. అశ్విన్(16)తో కలిసి 40 పరుగులు, శుభమ్ దూబె(8 నాటౌట్)తో కలిసి 39 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివరి వరకు అజేయంగా నిలిచిన రియాన్ పరాగ్ 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 పరుగులు చేశాడు. ముంబౌ బౌలర్లలో ఆకాశ్ 3 వికెట్లు తీయగా.. క్వెనా మఫాకకు ఒక్క వికెట్ దక్కింది.
పేస్‌తో బౌల్ట్.. స్పిన్‌తో చాహల్
అంతకుముందు రాజస్థాన్ బౌలర్ల ధాటికి ముంబై బ్యాటర్లు తేలిపోయారు. బౌల్ట్ తన పేస్‌తో ఆరంభంలో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. తొలి ఓవర్‌లోనే వరుస బంతుల్లో రోహిత్(0), నమన్ ధిర్(0)లను, వరుస ఓవర్‌లో బ్రెవిస్(0)ను అవుట్ చేశాడు. నాలుగో ఓవర్ వేసిన నాండ్రే బర్గర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్(16) వెనుదిరిగడంతో ముంబై 20 పరుగులకే 4 వికెట్లు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(34), తిలక్ వర్మ(32) ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్రయత్నించారు. ఐదో వికెట్‌కు ఈ జోడీ 56 పరుగులు జోడించింది. ఈ క్రమంలో యుజువేంద్ర చాహల్ తన స్పిన్ మంత్రాన్ని ప్రయోగించాడు. పాండ్యాను అవుట్ చేసి ఆ జోడీని విడదీసిన అతను.. కాసేపటికే తిలక్‌ను కూడా పెవిలియన్ పంపాడు. దీంతో 95/7 స్కోరుతో ముంబై ఆలౌట్ అంచున నిలువగా.. టిమ్ డేవిడ్(17) కాసేపు పోరాటం చేశాడు. బుమ్రా(8 నాటౌట్), ఆకాశ్(4 నాటౌట్) వికెట్లు కాపాడుకోవడంతో ముంబై ఆలౌట్ ప్రమాదం నుంచి బయటపడింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, బౌల్ట్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. నాండ్రే బర్గర్ 2 వికెట్లు, అవేశ్ ఖాన్‌కు ఒక్క వికెట్ దక్కింది.
స్కోరుబోర్డు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 125/9(20 ఓవర్లు)
ఇషాన్ కిషన్(సి)శాంసన్(బి)నాండ్రే బర్గర్ 16, రోహిత్(సి)శాంసన్(బి)బౌల్ట్ 0, నమన్ ధిర్ ఎల్బీడబ్ల్యూ(బి)బౌల్ట్ 0, బ్రెవిస్(సి)నాండ్రే బర్గర్(బి)బౌల్ట్ 0, తిలక్(సి)అశ్విన్(బి)చాహల్ 32, పాండ్యా(సి)పొవెల్(బి)చాహల్ 34, చావ్లా(సి)హెట్మేయర్(బి)అవేశ్ ఖాన్ 3, టిమ్ డేవిడ్(సి)బౌల్ట్(బి)నాండ్రే బర్గర్ 17, కోయ్టెజి(సి)హెట్మేయర్(బి)చాహల్ 4, బుమ్రా 8 నాటౌట్, ఆకాశ్ 4 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 7.
వికెట్ల పతనం : 1-1, 1-2, 14-3, 20-4, 76-5, 83-6, 95-7, 111-8, 114-9
బౌలింగ్ : బౌల్ట్(4-0-22-3), నాండ్రే బర్గర్(4-0-32-2), అవేశ్ ఖాన్(4-0-30-1), చాహల్(4-0-11-3), అశ్విన్(4-0-27-0)
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 127/4(15.3 ఓవర్లు)
జైశ్వాల్(సి)టిమ్ డేవిడ్(బి)క్వెనా మఫాక 10, బట్లర్(సి)చావ్లా(బి)ఆకాశ్ 13, శాంసన్(బి)ఆకాశ్ 12, రియాన్ పరాగ్ 54 నాటౌట్, అశ్విన్(సి)తిలక్(బి)ఆకాశ్ 16, శుభమ్ దూబె 8 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 14.
వికెట్ల పతనం : 10-1, 42-2, 48-3, 88-4
బౌలింగ్ : క్వెనా మఫాక(2-0-23-1), బుమ్రా(4-0-26-0), ఆకాశ్(4-0-20-3), గెరాల్డ్ కెయ్టెజి(2.3-0-36-0), పీయూశ్ చావ్లా(3-0-18-0)