ఢిల్లీ గెలుపు బాట.. లక్నో చిత్తు
ఐపీఎల్-17లో వరుసగా రెండు పరాజయాలతో వెనుకబడిన ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి గెలుపు బాటపట్టింది.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి పుంజుకుంది. వరుసగా రెండు పరాజయాలతో వెనుకబడిన ఆ జట్టు లక్నోపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మళ్లీ గెలుపు బాటపట్టింది. మరోవైపు, లక్నో హ్యాట్రిక్ విజయాల జోరుకు బ్రేక్ పడింది. శుక్రవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 167/7 స్కోరు చేసింది. ఆయుశ్ బదోని(55) అజేయ హాఫ్ సెంచరీతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. రాహుల్(39), అర్షద్ ఖాన్(20) కీలక పరుగులు జోడించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/20) బంతితో సత్తాచాటాడు. అనంతరం 168 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 18.1 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది. 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. జేక్ ఫ్రేజర్(55) హాఫ్ సెంచరీతో రాణించగా.. పంత్(41) మరోసారి మెరవడంతో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది.
ఢిల్లీ అలవోకగా..
లక్ష్య ఛేదనలో ఢిల్లీని ఏ ఏమాత్రం తడబడలేదు. ఓపెనర్ వార్నర్(8) త్వరగా అవుటవడం మినహా ఆ జట్టు ఛేదన సాఫీగానే సాగింది. వార్నర్ నిరాశపర్చడంతో ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ పృథ్వీషా, జేక్ ఫ్రీజర్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. వీరు ధాటిగా ఆడటంతో ఢిల్లీ పవర్ ప్లేలో 62/1తో నిలిచింది. అయితే, ఆ తర్వాతి ఓవర్‌లో పృథ్వీ(32)ను రవి బిష్ణోయ్ అవుట్ చేశాడు. అనంతరం జేక్ ఫ్రీజర్‌కు పంత్ తోడయ్యాడు. అయితే, లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 7, 8, 9, 10 ఓవర్లు కలుపుకుని 13 పరుగులే వచ్చాయి. దీంతో ఢిల్లీపై ఒత్తిడి పెరిగేలా కనిపించింది. అయితే, 11వ ఓవర్‌లో పంత్ వరుసగా సిక్స్, ఫోర్ బాది గేర్ మార్చాడు. 13వ ఓవర్‌లో జేక్ ఫ్రీజర్ వరుసగా మూడు సిక్స్‌లు దంచాడు. ఆ తర్వాతి ఓవర్‌లో అతను 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, ఆ తర్వాతి ఓవర్‌లో జేక్ ఫ్రీజర్(55) దూకుడుకు బ్రేక్ పడింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే పంత్(41) కూడా వెనుదిరిగడు. మూడో వికెట్‌కు ఈ జోడీ 77 పరుగులు జోడించడంతో ఢిల్లీ విజయానికి చేరువైంది. అనంతరం ట్రిస్టన్ స్టబ్స్(15 నాటౌట్), షాయ్ హోప్(11 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్‌కు 2 వికెట్లు దక్కగా.. నవీన్ ఉల్ హక్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు.
ఆదుకున్న ఆయుశ్ బదోని
అంతకుముందు ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో ఇన్నింగ్స్ మొదటి నుంచి తడబడుతూనే సాగింది. ఓపెనర్ డికాక్(19) స్వల్ప స్కోరుకే అవుటవ్వగా.. పడిక్కల్(3) మరోసారి తేలిపోయాడు. దీంతో పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయి తడబడగా.. కెప్టెన్ రాహుల్(39) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అయితే, మరో ఎండ్‌లో మాత్రం వికెట్లు నిలువలేదు. స్టోయినిస్(8), పూరన్(0) కూడా చేతులెత్తేశారు. కాసేపటికే రాహుల్ కూడా అవుటయ్యాడు. ఈ ముగ్గురు కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే వికెట్లు పారేసుకున్నారు. దీపక్ హుడా(10), కృనాల్ పాండ్యా(3) కూడా నిరాశపర్చడంతో 94/7 స్కోరుతో లక్నో ఆలౌట్ అంచున నిలిచింది. ఈ పరిస్థితుల్లో ఆయుశ్ బడోని(55 నాటౌట్) జట్టును ఆదుకున్నాడు. 94/7 నుంచి లక్నో 167/7 స్కోరుతో నిలిచిందంటే అతని సంచలన ప్రదర్శనే కారణం. ఢిల్లీపై బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతను అర్షద్ ఖాన్(20 నాటౌట్) సహకారంతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. 8వ వికెట్‌కు ఈ జోడీ అజేయంగా 73 పరుగులు జోడించింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ 3 వికెట్లతో సత్తాచాటగా.. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు, ఇషాంత్, ముకేశ్‌లకు చెరో వికెట్ దక్కింది.
స్కోరుబోర్డు
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ : 167/7(20 ఓవర్లు)
డికాక్ ఎల్బీడబ్ల్యూ(బి)ఖలీల్ 19, రాహుల్(సి)పంత్(బి)కుల్దీప్ 39, దేవదత్ పడిక్కల్ ఎల్బీడబ్ల్యూ(బి)ఖలీల్ 3, స్టోయినిస్(సి)ఇషాంత్(బి)కుల్దీప్ 8, పూరన్(బి)కుల్దీప్ 0, దీపక్ హుడా(సి)వార్నర్(బి)ఇషాంత్ 10, ఆయుశ్ బదోని 55 నాటౌట్, కృనాల్ పాండ్యా(సి)పంత్(బి)ముకేశ్ 3, అర్షద్ ఖాన్ 20 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 10.
వికెట్ల పతనం : 28-1, 41-2, 66-3, 66-4, 77-5, 89-6, 94-7
బౌలింగ్ : ఖలీల్ అహ్మద్(4-0-41-2), ఇషాంత్(4-0-36-1), ముకేశ్ కుమార్(4-0-41-1), అక్షర్(4-0-26-0), కుల్దీప్ యాదవ్(4-0-20-3)
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 170/4(18.1 ఓవర్లు)
పృథ్వీ షా(సి)పూరన్(బి)రవి బిష్ణోయ్ 32, వార్నర్(బి)యశ్ ఠాకూర్ 8, జేక్ ఫ్రేజర్(సి)అర్షద్(బి)నవీన్ ఉల్ హక్ 55, పంత్(స్టంప్)రాహుల్(బి)రవి బిష్ణోయ్ 41, ట్రిస్టన్ స్టబ్స్ 15 నాటౌట్, షాయ్ హోప్ 11 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 8.
వికెట్ల పతనం : 24-1, 63-2, 140-3, 146-4
బౌలింగ్ : అర్షద్ ఖాన్(3.1-0-34-0), నవీన్ ఉల్ హక్(3-0-24-1), యశ్ ఠాకూర్(4-0-31-1), కృనాల్ పాండ్యా(3-0-45-0), రవి బిష్ణోయ్(4-0-25-2), స్టోయినిస్(1-0-10-0)