ఐపీఎల్ కప్పు.. హైదరాబాదా?. కోల్‌కతా?.. ఏ జట్టుకు అవకాశాలున్నాయంటే?
రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను సందడి చేసిన ఐపీఎల్-17 ముగింపునకు సమయం ఆసన్నమైంది.
దిశ, స్పోర్ట్స్ : 10 ఏళ్లుగా టైటిల్ గెలవని కోల్‌కతా ఒకవైపు.. 8 ఏళ్లుగా మరోసారి చాంపియన్‌గా నిలువాలని చూస్తున్న హైదరాబాద్ మరోవైపు.. కొన్ని సీజన్లుగా ఈ రెండు జట్లు ఐపీఎల్ విజేతగా నిలవడంలో ఏదో ఒక దశలో విఫలమైనవే. ఈ సారి ఇరు జట్లు టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచాయి. అయితే, గెలిచేదే ఒక్క జట్టే. ఈ రెండు జట్లలో టైటిల్ నిరీక్షణకు తెరదించేదేదో?.. నేడే ఫైనల్. ఈ టైటిల్ పోరుకు వేదిక చెన్నయ్. మరి, నెగ్గేదెవరో?..
రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను సందడి చేసిన ఐపీఎల్-17 ముగింపునకు సమయం ఆసన్నమైంది. చెన్నయ్ వేదికగా నేడు ఫైనల్ జరగనుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్‌లో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. లీగ్ స్టేజ్‌లో ఈ రెండు జట్లే టాప్-2లో నిలిచిన విషయం తెలిసిందే. క్వాలిఫయర్-1లో హైదరాబాద్‌నే ఓడించి కేకేఆర్ ఫైనల్‌కు చేరుకోగా.. క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై నెగ్గి హైదరాబాద్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తుండటంతో ఫైనల్ పోరు ఆసక్తికరంగా జరిగే అవకాశాలే ఎక్కువ. కోల్‌కతా గతంలో గౌతమ్ గంభీర్ సారథ్యంలో రెండుసార్లు(2012, 2014)లో టైటిల్ గెలిచింది. 2021లో చెన్నయ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆ జట్టుకు గంభీర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు, హైదరాబాద్ 2016లో తొలి, చివరి టైటిల్ నెగ్గగా.. 2018లో ఫైనల్‌కు చేరినా టైటిల్ గెలవలేకపోయింది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌పై కేకేఆర్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టే గెలిచింది. కాబ్టటి, కోల్‌కతాను ఓడించాలంటే హైదరాబాద్ అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంది.
హైదరాబాద్‌లో వీళ్లు
హైదరాబాద్ బ్యాటింగ్ ప్రధానంగా హెడ్, అభిషేక్ శర్మ, త్రిపాఠి, క్లాసెన్‌లనే ఆధారపడి ఉన్నది. గత రెండు మ్యాచ్‌ల్లో హెడ్, అభిషేక్ నిరాశపర్చడంతో జట్టు ఏ విధంగా తడబడిందో చూశాం. కాబట్టి, వీరిద్దరు అందించే ఆరంభంపైనే జట్టు ఇన్నింగ్స్ సాగుతుందనడంలో సందేహం లేదు. మిడిలార్డర్‌లో త్రిపాఠి, క్లాసెన్ నిలకడగా రాణిస్తుండటం బలం. మార్‌క్రమ్, నితీశ్ రెడ్డి వారికితోడుగా నిలిస్తే హైదరాబాద్‌కు ఢోకా ఉండదు. ఇక, బౌలింగ్ పరంగా కెప్టెన్ కమిన్స్, నటరాజన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీరి నుంచి కేకేఆర్ బ్యాటర్లకు సవాల్ తప్పదు. అలాగే, గత మ్యాచ్‌లో షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ స్పిన్ మ్యాజిక్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. స్పెషలిస్ట్ స్పిన్నర్లు లేని లోటు వీరు తీర్చారు. మరి, ఫైనల్‌లోనూ వీరు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారో లేదో చూడాలి.
కోల్‌కతాలో వీళ్లు
ఈ సీజన్‌లో బ్యాటింగ్ దళం పవర్‌ఫుల్‌గా ఉన్న జట్లలో కోల్‌కతా ఒక్కటి. ఈ సీజన్‌లో సునీల్ నరైన్ సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. పవర్ ప్లేలో అతనితో హైదరాబాద్ బౌలర్లకు సవాల్ తప్పదు. అలాగే, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్‌లో ఉండటం కేకేఆర్ బలాన్ని తెలియజేస్తుంది. రింకు సింగ్, రస్సెల్ వంటి హిట్టర్లు ఉండనే ఉన్నారు. స్టార్క్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, హర్షిత్ రానాలతో బౌలింగ్ దళం పటిష్టంగా ఉంది.
కేకేఆర్‌దే ఆధిపత్యం
ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 27సార్లు ఎదురుపడ్డాయి. అందులో 18 విజయాలతో ఎస్‌ఆర్‌హెచ్‌పై కేకేఆర్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఈ సీజన్‌లో ఇరు జట్లు గ్రూపు దశలో, క్వాలిఫయర్-1లో తలపడగా.. రెండు మ్యాచ్‌ల్లోనూ కోల్‌కతానే గెలిచింది. చెపాక్ స్టేడియంలో హైదరాబాద్, కోల్‌కతా తలపడటం ఇది రెండోసారి. మొదటిసారి కోల్‌కతానే విజయం సాధించింది.
పిచ్ రిపోర్టు
చెపాక్ స్టేడియంలోనే రాజస్థాన్, హైదరాబాద్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. చెపాక్ పిచ్ బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా అనుకూలిస్తుంది. గత మ్యాచ్‌లో స్పిన్నర్లు సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపించారు. ఫైనల్‌లోనూ తేమ పడకుంటే స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.