లక్నోకు ఢిల్లీ షాక్

ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలనుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్. ఢిల్లీ క్యాపిటల్స్ ఆ జట్టును భారీ దెబ్బ కొట్టింది.

Update: 2024-05-14 19:08 GMT

దిశ, స్పోర్ట్స్ : ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలనుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్. ఢిల్లీ క్యాపిటల్స్ ఆ జట్టును భారీ దెబ్బ కొట్టింది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన కీలక పోరులో లక్నోపై 19 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 208/4 స్కోరు చేసింది. అభిషేక్ పొరెల్(58), ట్రిస్టన్ స్టబ్స్(57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 189/9 స్కోరుకే పరిమితమైంది. నికోలస్ పూరన్(61), అర్షద్ ఖాన్(58 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా.. మిగతా వారు విఫలమవడంతో లక్నో పరాభవం తప్పలేదు. పవర్ ప్లేలో ఇషాంత్ శర్మ(3/34) మూడు వికెట్లు తీసి లక్నో ఓటమిని శాసించాడు. ఢిల్లీకి ఇదే చివరి గ్రూపు మ్యాచ్. ఈ మ్యాచ్‌లో విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను ఆ జట్టు సజీవంగా ఉంచుకుంది. అయితే, నెట్‌రన్‌రేట్ తక్కువగా ఉండటంతో మిగతా జట్ల ఫలితాలపైనే ఆ జట్టు ముందడుగు వేసే పరిస్థితి ఉంది. మరోవైపు, లక్నో‌కు ఈ మ్యాచ్‌లో గెలిస్తే నాకౌట్ ఆశలు మెరుగయ్యేవి. ఆ జట్టుకు మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. నెట్‌రన్‌రేట్‌లో వెనుకబడి ఉండటంతో ఆఖరి మ్యాచ్‌లో గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమే.

పూరన్, అర్షద్ పోరాటం వృథా

48/4.. ఛేదనలో ఐదు ఓవర్లలో లక్నో పరిస్థితి ఇది. ఓపెనర్లు డికాక్(12), కెప్టెన్ కేఎల్ రాహుల్(5), స్టోయినిస్(5), దీపక్ హుడా(0) దారుణంగా విఫలమయ్యారు. పవర్ ప్లేలో పేసర్ ఇషాంత్ శర్మ మూడు వికెట్లతో రెచ్చిపోయి లక్నోను కష్టాలోకి నెట్టాడు. దీంతో లక్నో గెలుపుపై అనుమానాలు నెలకొన్న పరిస్థితుల్లో.. ఆ జట్టు 189/9 స్కోరుతో పోరాటం చేసిందంటే కారణం పూరన్, అర్షద్ కఖాన్ మాత్రమే. మొదట కష్టాల్లో పడిన జట్టును పూరన్ పోటీలోకి తీసుకొచ్చాడు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో 11 ఓవర్లలో లక్నో 101/5 స్కోరుతో నిలిచింది. అంతా సాఫీగానే సాగుతుందనుకున్న సమయంలో పూరన్(61)ను ముకేశ్ అవుట్ చేసి దెబ్బకొట్టాడు. పూరన్ అవుటైన తర్వాత వచ్చిన అర్షద్ ఆ దూకుడును కొనసాగించాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు, ఢిల్లీ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ లక్నోను బలహీనపరిచినా.. అర్షద్ మెరుపులతో ఢిల్లీ జట్టులో టెన్షన్ మొదలైంది. లక్నో‌కు 12 బంతుల్లో 30 పరుగులు కావాల్సి రావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అప్పుడు చివరి రెండు ఓవర్లను ముకేశ్, రసిఖ్ సలామ్ అద్భుతంగా వేసి ఢిల్లీ జట్టును గెలిపించారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 3 వికెట్లతో సత్తాచాటగా.. ఖలీల్, అక్షర్, ముకేశ్, కుల్దీప్, ట్రిస్టన్ స్టబ్స్‌లకు చెరో వికెట్ దక్కింది.

స్టబ్స్, అభిషేక్ మెరుపులు

అంతకుముందు సొంత మైదానంలో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగారు. ముఖ్యంగా అభిషేక్ పొరెల్, ట్రిస్టన్ స్టబ్స్ పరుగుల వరద పారించారు. అయితే, ఓపెనర్ జేక్ ఫ్రేజర్(0) తొలి ఓవర్‌లోనే అవుటవడంతో ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ ప్రభావం జట్టుపై పడకుండా చూశాడు అభిషేక్ పొరెల్. క్రీజులో ఉన్నంతసేపు లక్నో బౌలర్లను ఊచకోతకోశాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు కొట్టిన అతను 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో మొదట్లో నిదానంగా ఆడిన షాయ్ హోప్ కూడా యుద్విర్ సింగ్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6 బాది గేర్ మార్చాడు. దీంతో ఢిల్లీ పవర్ ప్లేలో 73/1తో నిలిచి భారీ స్కోరుకు గట్టి పునాది వేసుకుంది. అయితే, స్వల్ప వ్యవధిలోనే షాయ్ హోప్(38), అభిషేక్ పొరెల్(58) వెనుదిరిగారు. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం కూడా తగ్గింది. 1-6 ఓవర్ల మధ్య 73 పరుగుల వస్తే.. 7-15 ఓవర్ల మధ్య 63 పరుగులే వచ్చాయి. కెప్టెన్ రిషబ్ పంత్(33) కీలక పరుగులు జోడించి అవుటయ్యాడు. ఇక, డెత్ ఓవర్లలో అక్షర్ పటేల్(14 నాటౌట్) సహకారంతో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు. అర్షద్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్‌లను ఉతికారేశాడు. స్టబ్స్(57 నాటౌట్) మెరుపులతో ఢిల్లీ 200 స్కోరును దాటింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్‌కు చెరో వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 208/4(20 ఓవర్లు)

జేక్ ఫ్రేజర్(సి)నవీన్ ఉల్ హక్(బి)అర్షద్ ఖాన్ 0, అభిషేక్ పొరెల్(సి)పూరన్(బి)నవీన్ ఉల్ హక్ 58, షాయ్ హోప్(సి)రాహుల్(బి)రవి బిష్ణోయ్ 38, పంత్(సి)దీపక్ హుడా(బి)నవీన్ ఉల్ హక్ 33, ట్రిస్టన్ స్టబ్స్ 57 నాటౌట్, అక్షర్ 14 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 8.

వికెట్ల పతనం : 2-1, 94-2, 111-3, 158-4

బౌలింగ్ : అర్షద్ ఖాన్(3-0-45-1), మొహ్సిన్ ఖాన్(4-0-29-0), యుద్విర్ సింగ్(2-0-28-0), నవీన్ ఉల్ హక్(4-0-51-2), రవి బిష్ణోయ్(4-0-26-1), కృనాల్ పాండ్యా(2-0-20-0), దీపక్ హుడా(1-0-9-0)

లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ : 189/9(20 ఓవర్లు)

డికాక్(సి)ముకేశ్(బి)ఇషాంత్ 12, కేఎల్ రాహుల్(సి)ముకేశ్(బి)ఇషాంత్ 5, స్టోయినిస్(స్టంప్)పంత్(బి)అక్షర్ 5, దీపక్ హుడా ఎల్బీడబ్ల్యూ(బి)ఇషాంత్ 0, పూరన్(సి)అక్షర్(బి)ముకేశ్ 61, ఆయుశ్ బదోని(సి)గుల్బాదిన్(బి)ట్రిస్టన్ స్టబ్స్ 6, కృనాల్ పాండ్యా(స్టంప్)పంత్(బి)కుల్దీప్ 18, అర్షద్ ఖాన్ 58 నాటౌట్, యుద్విర్ సింగ్(సి)షాయ్ హోప్(బి)ఖలీల్ 14, రవి బిష్ణోయ్ రనౌట్(జేక్ ఫ్రేజర్) 2, నవీన్ ఉల్ హక్ 2 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 6.

వికెట్ల పతనం : 7-1, 24-2, 24-3, 44-4, 71-5, 101-6, 134-7, 167-8, 183-9

బౌలింగ్ : ఇషాంత్ శర్మ(4-0-34-3), ఖలీల్(2-0-22-1), అక్షర్ పటేల్(1-0-20-1), ముకేశ్(4-0-33-1), కుల్దీప్(4-0-33-1), ట్రిస్టన్ స్టబ్స్(1-0-4-1), గుల్బాదిన్(1-0-12-0), రసిఖ్ సలామ్(3-0-30-0)

Tags:    

Similar News