బెంగళూరును ఆదుకున్న అనుజ్, దినేశ్ కార్తీక్.. చెన్నయ్ ముందు టఫ్ టార్గెట్
ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నయ్ ముందు బెంగళూరు టఫ్ టార్గెట్ నిర్దేశించింది.
దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-17 ప్రారంభమైంది. చెన్నయ్ వేదికగా శుక్రవారం ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు చెన్నయ్ ముందు 174 పరుగుల టఫ్ టార్గెట్ పెట్టింది. నిర్ణీత ఓవర్లలో ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.
కెప్టెన్, ఓపెనర్ డుప్లెసిస్(35) బౌండరీలతో చెలరేగి ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించినా.. చెన్నయ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ధాటికి ఆ జట్టు తడబాటుకు గురైంది. ముస్తాఫిజుర్ 4 వికెట్లతో చెలరేగాడు. 5వ ఓవర్‌లో డుప్లెసిస్‌తోపాటు రజత్ పాటిదార్(0)ను అవుట్ చేశాడు. తర్వాతి ఓవర్‌లో మ్యాక్స్‌వెల్(0)ను దీపక్ చాహర్ పెవిలియన్ పంపాడు. అసౌకర్యంగా క్రీజులో కనిపించిన విరాట్ కోహ్లీ(21)తోపాటు కామెరూన్ గ్రీన్(18)ను ముస్తాఫిజుర్ ఒకే ఓవర్‌లో పెవిలియన్ పంపాడు. దీంతో బెంగళూరు 78 పరుగులకే బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం అనుజ్ రావత్(48), దినేశ్ కార్తీక్(38 నాటౌట్) జట్టును ఆదుకున్నారు. చెన్నయ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ7 వికెట్‌కు విలువైన 95 పరుగులు జోడించారు. ఆఖరి బంతికి అనుజ్ రావత్ రనౌట్ అవ్వగా.. దినేశ్ కార్తీక్ అజేయంగా నిలిచాడు. చెన్నయ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ 4 వికెట్లతో సత్తాచాటగా.. దీపక్ చాహర్‌కు ఒక వికెట్ దక్కింది.