IPL 2023: ధోనీ ఫార్ములా పాటించకపోవడమే ఆర్సీబీ కొంపముంచిందా..!

IPL 2023 సీజన్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిరాశపర్చింది

Update: 2023-05-22 15:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 సీజన్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిరాశపర్చింది. కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఒకరిద్దరి ప్రదర్శనలతోనే 7 విజయాలు అందుకున్న ఆర్‌సీబీ 5 ప్లేస్‌లో సరిపెట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరకపోవడానికి ప్రధాన కారణం సమష్టి ప్రదర్శన లోపించడంతోనే ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. మరోవైపు సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఒకరిద్దరితో మ్యాచ్‌లు గెలిచినా.. టైటిళ్లు గెలవలేమనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస సెంచరీలతో చెలరేగినా.. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచినా.. ఆ జట్టును ముందుకు తీసుకెళ్లలేకపోయాయి.

ఆర్‌‌సీబీ మేనేజ్‌మెంట్‌తో పాటు ఆటగాళ్లు ఐపీఎల్ విజయ రహస్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌కు తత్వం బోధపడటం లేదు. ఐపీఎల్‌ టైటిల్ గెలవాలంటే.. ధోనీ చెప్పినట్లు అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంతో పాటు వారికి బెస్ట్ స్లాట్స్ కేటాయించి అద్భుత ప్రదర్శన కనబర్చేలా తీర్చు దిద్దుకోవాలి. ప్రతీ మ్యాచ్‌కు మార్పులు చేయకుండా వీలైనంత వరకు ఒకే జట్టును టోర్నీ మొత్తం కొనసాగించాలి. విఫలమైనా అండగా నిలిచి ప్రోత్సహించాలి.

వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు కోసం ఆడటమే చాలా ముఖ్యం. ఈ ఫార్మూలాతోనే తమ జట్టు ఐపీఎల్‌లో సక్సెస్ అయిందని, ప్లే ఆఫ్స్ చేరిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ అన్నాడు. ఈ ఫార్మూలానే ఆర్‌సీబీ మరిచిపోయింది. మ్యాచ్ మ్యాచ్‌కు మార్పులు చేసి ఆటగాళ్లలో గందరగోళం నెలకొనేలా చేయగా.. ఏ ఆటగాడిపై విశ్వాసం కనబర్చలేదు. కీలకమైన గుజరాత్‌తో కూడా అరంగేట్ర ప్లేయర్‌‌తో బరిలోకి దిగింది. ఒకరిద్దరు మినహా సమష్టి ప్రదర్శనే కనిపించలేదు. చివరకు ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారిపట్టింది.

Tags:    

Similar News