IPL 2023: ఆర్సీబీని టార్గెట్ చేస్తూ మరోసారి నవీన్ ఉల్ హక్ పోస్ట్..
IPL 2023లో ఆర్సీబీకి మరోసారి నిరాశే మిగిలింది.
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో ఆర్సీబీకి మరోసారి నిరాశే మిగిలింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. అయితే ఆర్సీబీ ఓడిపోవడాన్ని ఎద్దేవా చేస్తూ లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీన్ ఉల్ హక్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్ మరోసారి ఆర్సీబీని టార్గెట్ చేస్తూ ఇన్‌స్టాగ్రాం స్టోరీ పెట్టాడు. ఆర్సీబీ ఓడిపోయిన సమయంలో ఒక యాంకర్ పగలబడి నవ్వుతున్న క్లిప్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ నవీన్‌పై మండిపడుతున్నారు. ఇలా నవీన్ ఆర్సీబీని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం ఇదేం తొలిసారి కాదు. కోహ్లీ అవుటైన ప్రతిసారీ ఇలాంటి పోస్టులు అతను పెడుతూనే ఉన్నాడు. అయితే ఈసారి అతను మరీ హద్దు మీరినట్లు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ప్లేఆఫ్స్ చేరాలంటే ఆర్సీబీ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బ్యాటింగ్ విభాగంలో అతనొక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వాళ్లలో మైకేల్ బ్రేస్‌వెల్ (29), అనూజ్ రావత్ (25 నాటౌట్) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఒక పక్క వికెట్లు పడుతున్నా మరో పక్క అడ్డుగోడలా నిలిచిన కోహ్లీ ఆర్సీబీకి 197 పరుగుల భారీ స్కోరు అందించాడు.
కానీ గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (104 నాటౌట్) కూడా చెలరేగడంతో ఆర్సీబీ ఉంచిన 198 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. అతనితోపాటు విజయ్ శంకర్ (54) కూడా రాణించాడు. వీళ్లిద్దరూ అద్భుతమైన భాగస్వామ్యంతో గుజరాత్‌ను విజయం వైపు నడిపించారు. అయితే చివర్లో విజయ్, డేవిడ్ మిల్లర్ (0) వెంట వెంటనే అవుట్ అవడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లో బంతి అందుకున్న వేన్ పార్నెల్ తొలి బంతికే నోబాల్ వేశాడు. ఆ మరుసటి బంతి వైడ్ వేశాడు. తర్వాతి బంతికి గిల్ భారీ సిక్సర్ బాదడంతో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ విజయం సాధించింది. ఈ ఓటమితో ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. అదే సమయంలో సన్‌రైజర్స్‌పై గెలిచిన ముంబై ప్లేఆఫ్స్ చేరింది.
Naveen Ul Haq Instagram Story after RCB knocked out from play off race#KingKohli𓃵 #NaveenUlHaq pic.twitter.com/wBptIS3UB4
— Suraj Pandey (@ferrarinotfiat) May 21, 2023