ధోనీ మార్క్ కెప్టెన్సీతో గుజరాత్ బ్యాటర్లకు చెక్.. కెప్టెన్సీపై సోషల్ మీడియాలో ప్రశంసలు

ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడంటే మన లక్ష్యం మరో 10 పరుగులు పెరిగినట్లే. ధోనీ చేసే బౌలింగ్ మార్పులు.. ఫీల్డ్ సెటప్ అలా ఉంటుంది.

Update: 2023-05-24 12:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడంటే మన లక్ష్యం మరో 10 పరుగులు పెరిగినట్లే. ధోనీ చేసే బౌలింగ్ మార్పులు.. ఫీల్డ్ సెటప్ అలా ఉంటుంది. గతంలో కూడా చాలా వరకు మనం చూశాం. తన మార్క్ కెప్టెన్సీతో జట్టును గెలిపించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ధోని చేసిన బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెటప్‌లు గుజరాత్ బ్యాటర్లకు చెక్ పెట్టాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిచిందంటే ధోనీ మార్క్ కెప్టెన్సీనే ప్రధాన కారణం. హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్‌ను ఔటైన విధానం చూస్తేనే ధోనీ కెప్టెన్సీ మహిమ ఏంటో మనకు అర్థమవుతోంది. బౌలింగ్ మార్పులతో పాటు ఫీల్డ్ సెటప్ కూడా గుజరాత్ బ్యాటర్లను ఉక్కిరి బిక్కిరి చేసింది.

ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఫుట్‌వర్క్‌ను బాగా పరిశీలించిన ధోనీ.. తీక్షణతో కలిసి ఉచ్చును బిగించాడు. ఇన్నింగ్స్ 6వ ఓవర్ 5 బంతికి హార్దిక్ పాండ్యా.. జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఈ బంతి వేసే ముందే ధోనీ ఫీల్డ్‌లో మార్పు చేశాడు. ఆఫ్ సైడ్ మరో ఫీల్డర్‌ను తీసుకొచ్చి ధోనీ.. తీక్షణను ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ వేయాలని సూచించాడు. ఈ బంతిని పాండ్యా కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. ఎడ్జ్ తీసుకున్న బంతి బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న జడేజా చేతిలోకి నేరుగా వెళ్లింది. దాంతో హార్దిక్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత క్రీజులో సెట్ అయిన శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేసేందుకు ధోనీ.. దీపక్ చాహర్‌ను రంగంలోకి దింపి ఉచ్చును బిగించాడు. ఫైన్ లెగ్‌లో డెవాన్ కాన్వేను ఫీల్డర్‌గా పెట్టి.. దీపక్ చాహర్ చేత స్లోయర్ బౌన్స్ వేయించాడు. ఈ ఊరించే బంతికి టెంప్ట్ అయిన గిల్.. భారీ సిక్సర్‌కు ప్రయత్నించగా గాల్లోకి వెళ్లిన బంతి నేరుగా కాన్వే చేతిలో పడింది. అటువైపు బౌండరీ పెద్దగా ఉండటంతోనే ధోనీ ఈ ప్లాన్ వేసి సక్సెస్ అయ్యాడు. అనంతరం సిక్సర్లతో ధాటిగా ఆడుతున్న రషీద్ ఖాన్‌కు కూడా ధోనీ చెక్ పెట్టాడు. తుషార్ దేశ్‌‌పాండే వైడ్‌గాఫుల్ టాస్ వేయగా.. రషీద్ డీప్ పాయింట్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతికి ముందే ఫీల్డ్‌లో మార్పు చేయడంతో రషీద్ ఖాన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రషీద్ ఆడిన షాట్ నేరుగా కాన్వే చేతులోకి వెళ్లింది. ప్రస్తుతం ధోనీ మార్క్ కెప్టెన్సీపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది.



Tags:    

Similar News